విజయవాడ సెంట్రల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ దీక్షా శిబిరంపై దాడి దుర్మార్గం

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రశాంతంగా కొనసాగుతున్న వైయ‌స్ఆర్‌సీపీ రిలే నిరాహార దీక్షా శిబిరంపై జరిగిన దాడిని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా జరుగుతున్న ప్రజాస్వామ్య నిరసనను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని ఆయన విమర్శించారు.

విజయవాడలో  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలుపుతుండగా టెంట్లు లాగిపడేసి, కార్యకర్తలు, మహిళలపై కోడిగుడ్లతో దాడి చేయడం రౌడీయిజానికి పరాకాష్ట అని వెలంపల్లి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తూ అధికార పార్టీ వర్గాలు వ్యవహరించడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు.

ఒకప్పుడు దేశంలోనే ప్రశాంత రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలకు, గూండాయిజానికి కేంద్రంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు లోపాలను ప్రశ్నించే ప్రతిపక్షంపై భౌతిక దాడులు చేయడం కూటమి ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్లాది విష్ణుపై, దీక్షలో పాల్గొన్న నాయకులపై కోడిగుడ్లు విసిరి దాడి చేయడం యావత్ బ్రాహ్మణ సమాజాన్ని అవమానించడమేనని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సామాజిక వర్గాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మల్లాది విష్ణుతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలనే అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెట్టడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదని, చట్టానికి అనుగుణంగా విధులు నిర్వహించాలని పోలీసులకు సూచించారు.

నిరుద్యోగ భృతి, మహిళలకు హామీ ఇచ్చిన పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, డీఎస్సీ నియామకాలలో వెలుగుచూస్తున్న అక్రమాలు వంటి ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి నాయకత్వంలో యువతకు, ప్రజలకు అండగా పోరాటం కొనసాగిస్తామని వెలంపల్లి స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని, దీక్షా శిబిరంపై దాడికి బాధ్యులైన వారు వెంటనే ప్రజలకు, మల్లాది విష్ణుకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
 

Back to Top