ఇడుపులపాయ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు ఘనాంజలి అర్పించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మహానేత వైయస్ఆర్ ప్రజాసేవ, సంక్షేమ పాలన, అభివృద్ధి పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని ఈ సందర్భంగా వైయస్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు స్మరించుకున్నారు. రైతుల సంక్షేమం, పేదల అభ్యున్నతి, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి చారిత్రాత్మక కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడిగా వైయస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీమతి వైయస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు కూడా వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైయస్ఆర్ చూపిన ప్రజాసంక్షేమ మార్గం, సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి అనే ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజల కోసం జీవించిన మహానేత వైయస్ఆర్ సేవలు తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.