కరవు సంక్షోభంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం 

యుద్ధప్రాతిపదికన ఆదుకోకపోతే రైతుకి తీవ్ర ఆర్థిక సంక్షోభమే..

ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి..

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ 
సెక్ర‌ట‌రీ(వ్య‌వ‌సాయం, రైతు విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి

అన్నదాతలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం 

మొత్తం 15 వ తారీకు వరకూ జరగవలసిన సాగులో అనేక పంటలు కేవలం 60 శాతం లోపు మాత్రమే సాగు 

ప్రాజెక్టుల్లో నీరున్నా అందించలేని పాలన

సాగునీటి కాలువ‌ల నిర్వ‌హ‌ణ అధ్వాన్నం 

రైతుకు చెల్లించ వలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలి

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంవీఎస్ నాగిరెడ్డి

తాడేప‌ల్లి: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు, కరువు సంక్షోభం నేపథ్యంలో రైతుల‌ను ఆదుకోవ‌డంలో, పొలాల‌కు నీటిని విడుద‌ల చేయ‌డంలో, కాలువ‌ల‌ను ఆధునికీక‌రించ‌డంలో కూటమి ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైందని వైయ‌స్ఆర్‌సీపీ  జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ (వ్య‌వ‌సాయం, రైతు విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఖరీఫ్‌లు, 2 రబీలు పూర్తయి, ఇప్పుడు 3వ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని.. కానీ ఇంతవరకు ఎప్పుడూ లేనంతటి సంక్షోభాన్ని రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్లలో ఉత్పత్తులు లేక, అకాల వర్షాలతో వేరుశెనగ, ప్రత్తి పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయని.. ధరలు లేక ఉల్లి, అరటి, చినీ, మొక్కజొన్న, పొగాకు, మామిడి, ఆక్వా రైతులు రోడ్డున పడ్డారని ఆయ‌న గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన స్పందించి వాటర్ మేనేజ్మెంట్, కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు చేపట్టడంతోపాటు రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు చేపట్టాలని ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. 

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే...

అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే రాష్ట్రమంతా లోటు వర్షపాతం

ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారమే జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 6 వారాలు గడిచినా రాష్ట్రంలో 48.3 శాతం లోటు వర్షపాతం  నమోదైంది. ప్రస్తుతం ప్రాక్టికల్‌గా 11 జిల్లాలు మైనస్ 40 శాతం కంటే ఎక్కువ లోటుతో, మరో 11 జిల్లాలు మైనస్ 30 శాతం పైగా లోటుతో, 5 జిల్లాలు మైనస్ 20శాతం కంటే ఎక్కువ లోటు వర్షపాతంతో ఉన్నాయి. కేవలం నెల్లూరు జిల్లా మాత్రమే సాధారణ వర్షపాతంలో ఉంది. మిగతా రాష్ట్రమంతా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. 

వ్యవసాయ శాఖ అధికారిక డేటా ప్రకారం పంటల సాగు పరిస్థితి దారుణంగా ఉంది. జూలై 15 నాటికి జరగాల్సిన మొత్తం సాగులో కొన్ని పంటలు కేవలం 60 శాతం మాత్రమే సాగైంది. రాయలసీమలో పండే మిల్లెట్స్ (ఆరిక, వరగ, ఊద తదితర) సాగు కేవలం 43 శాతం మాత్రమే జరిగింది. అత్యధిక పెట్టుబడి అయ్యే వేరుశెనగ సాగు ఈ సీజన్ మొత్తంలో కేవలం 16శాతం  మాత్రమే జరిగింది. ప్రభుత్వం కనీసం విత్తనాలను కూడా సరిగ్గా సప్లై చేయలేకపోయింది. వేరుశెనగ సాగు దెబ్బతింటే రాయలసీమలో పశుగ్రాసం కొరత ఏర్పడి, రైతులు పశువులను అమ్ముకుని వలసపోయే దీన స్థితి వస్తుంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు ఆగస్టు 15 ఆఖరి గడువు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. 

కాలువల నిర్వహణ శూన్యం

గోదావరి, కృష్ణా డెల్టాల్లో నీటి నిర్వహణ, కాలువల ఆధునికీకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 
గోదావరి డెల్టాలో కాటన్ బ్యారేజ్ వద్దకు 17,250 క్యూసెక్కుల నీరు వస్తున్నా.. కాలువల్లో గుర్రపుడెక్క తీయకపోవడం, సమ్మర్ క్లోజర్ లో మెయింటెనెన్స్ పనులు చేయకపోవడం వల్ల కోనసీమ జిల్లాలో నారుమళ్లు ఎండిపోతున్నాయి. నీరు సముద్రం పాలవుతున్నా, కిందకు వెళ్లడం లేదు. దీనిపై రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే, ఇరిగేషన్ మంత్రి గత ప్రభుత్వంపై నెపం నెట్టడం హాస్యాస్పదం.  

కృష్ణా డెల్టాలో జూలై 1 వరకు గోదావరిలో నీరు లేనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్ నుంచే నీటిని వదిలారు. ప్రస్తుతం పులిచింతలలో 29.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ, ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తున్న 4వేల‌ క్యూసెక్కుల నీటి విడుదలను అకస్మాత్తుగా ఎందుకు నిలిపివేశారు. సీఎం డ్యాష్ బోర్డ్ డేటా ప్రకారం ఈ రోజు ఉదయం జీరో ఇన్ ఫ్లో క‌నిపిస్తోంది. తూర్పు, పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా,గుంటూరు, బాపట్ల జిల్లాల్లో టైలాండ్ భూముల్లో ఎదబెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క 100 ఎకరాలైనా నీరు లేక ఎండిపోయిందా? 

రైతు సంక్షేమ పథకాలకు మంగళం. బకాయిలు నిలిపివేత

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు ప్రతి రైతును ఆదుకునేందుకు తెచ్చిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం తెచ్చిన 'స్వచ్ఛంద బీమా' (వాతావరణ బీమా) గడువు జూలై 15తోనే, దీన్ని పొడిగించమని విజ్ఞప్తి చేశాం.ఒకవేళ పాత ఉచిత బీమా ఉండి ఉంటే ఈ వాతావరణ సంక్షోభంలో రైతులకు వేల కోట్ల లబ్ధి చేకూరేది. 

ఇప్పటివరకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ క్లైమ్‌లు, సున్నా వడ్డీ బకాయిలు విడుదల చేయలేదు. తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ జీవో ఇచ్చినా రైతులకు డబ్బులు అందలేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఫైల్ ప్రభుత్వంలో ఉన్నా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేవలం రూ. 500 కోట్లు కేటాయించి, మార్క్ ఫెడ్ ద్వారా కనీస ధర 200 రూ లకకు కొనుగోళ్లు జరిపించి రైతులను ఆదుకోవచ్చు. వైఎస్ జగన్ గారి హయాంలో మార్కెట్ జోక్యం చేసుకొని కొనుగోలు చేసిన విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? 

ప్రభుత్వానికి వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్లు

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అధికారిక డేటా ఆధారంగానే మేము ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తున్నాం. ఎంతసేపూ వ్యవసాయం బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేసుకోవడం మానేసి, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించాలి. రాబోయే 4-5 రోజుల్లో వర్షాలు పడకపోతే రాష్ట్రం భారీగా నష్టపోతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన స్పందించి వాటర్ మేనేజ్మెంట్, కాలువల్లో  గుర్రపుడెక్క తొలగింపు చేపట్టాలి. అలాగే రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు చేపట్టాలి.

Back to Top