తాడేపల్లి: రాజధాని అసైన్డ్ భూముల కేసులో గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా అబద్దాలను వండి వారుస్తూ, విపరీతమైన వర్ణనలతో చంద్రబాబుకు క్లీన్ చిట్ దొరికినట్లు అబద్ధపు ప్రచారం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఈ కేసు కేవలం ఒక రాజకీయ ఫిర్యాదు కాదని, చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదల భూములను దోపిడీ చేసిన రూ.4,400 కోట్ల పక్కా కుంభకోణమని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై తాము ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నామని వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే నిన్నటివరకు ఆధారాలు సేకరించిన సిఐడి కాస్తా "చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్"గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. భయాందోళనలు సృష్టించి.. పేదల భూముల దోపిడీ.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా, నాటి ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు హడావుడిగా ఏపీకి వచ్చారు. తమకు కావలసిన వ్యక్తులకు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే లీకులు ఇచ్చి, ఆ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అసైన్డ్ రైతుల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో తీవ్ర భయాందోళనలు సృష్టించారు. నిరుపేదల నుంచి తక్కువ ధరలకే అసైన్డ్ భూములను బలవంతంగా, మోసపూరితంగా బినామీల పేర్లతో లాక్కున్నారు. జీఓ ఎంఎస్ 41 వెనుక ఉన్న అక్రమ ముసుగు.. రాష్ట్రఅసైన్డ్ ల్యాండ్ చట్టం ప్రకారం అసైన్డ్ భూములను కొనడం, అమ్మడం పూర్తిగా నిషిద్ధమని చట్టాలు మొత్తుకుంటున్నా, చంద్రబాబు ప్రభుత్వం తన బినామీల ప్రయోజనాల కోసం 2016 ఫిబ్రవరి 17న "జీఓ ఎంఎస్ నంబర్ 41"ని అడ్డగోలుగా తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భూములు కొన్న బినామీలకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించడమే ఈ జీఓ ముఖ్య ఉద్దేశం. నాటి ఏజీ (అడ్వకేట్ జనరల్) ఆమోదం లేకుండా, అసెంబ్లీలో ఎలాంటి చర్చ పెట్టకుండా నిబంధనలను తుంగలో తొక్కి ఈ జీఓను జారీ చేశారని, దీనిపై అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతోనే సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. 76 మంది సాక్షుల విచారణ – పక్కాగా ఉన్న ఆర్థిక లావాదేవీల ఆధారాలు.. ఈ కేసు కేవలం రాజకీయ ఆరోపణ కాదని చెప్పడానికి సిఐడి సేకరించిన సాక్ష్యాలే నిదర్శనం. చంద్రబాబు, నారాయణలపై స్టే ఉన్నప్పటికీ, సిఐడి అధికారులు నిరుపేద అసైన్డ్ రైతులు, మధ్యవర్తులు, అధికారులు సహా మొత్తం 76 మంది సాక్షులను విచారించింది. పలువురి స్టేట్మెంట్లను మెజిస్ట్రేట్ ముందు 164 సీఆర్‌పీసీ కింద రికార్డ్ చేయించింది. 2024 మార్చి నాటి సిఐడి ప్రాథమిక విచారణ ప్రకారం సుమారు 1,100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగింది. దీని విలువ సుమారు రూ.4,400 కోట్లు ఉంటుంది. నారాయణ విద్యాసంస్థల నుంచి రూ.18.1 కోట్లు రామకృష్ణ మరియు ఇతర రియల్ ఎస్టేట్ మధ్యవర్తుల ద్వారా రూట్ మారి అసైన్డ్ రైతులకు చేరినట్లు పక్కా బ్యాంక్ లావాదేవీల ఆధారాలు ఉన్నాయి. ఉద్దండరాయునిపాలెంకు చెందిన ఎస్సీ మాదిగ కులానికి చెందిన పులి సుధాకర్ వంటి బాధితుల భూముల కొనుగోలు సొమ్ము ఎలా బినామీల ద్వారా చేతులు మారిందో సిఐడి ఆధారాలతో సహా నిరూపించింది. కీలకమైన ఆడియో రికార్డును తొక్కేశారు... నారాయణ విద్యాసంస్థల నుంచి సిఐడి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో మాజీ మంత్రి నారాయణ, ఆయన కుమార్తె డాక్టర్ సింధూర మధ్య జరిగిన సంభాషణల ఆడియో రికార్డు అత్యంత బలమైన సాక్ష్యం. నేను కొన్నది వాస్తవమే.. కానీ నా పేరుతో కొనలేదు.. బినామీల పేర్లతో కొన్నాను, లేకపోతే ఈపాటికి జైలు పాలయ్యేవాడిని" అని నారాయణ స్వయంగా ఒప్పుకున్న ఆడియో లభించినా, ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండా, వాయిస్ శాంపుల్స్ తీసుకోకుండా దర్యాప్తును తొక్కిపెట్టారు. అలాగే ఈ కేసులో అప్రూవర్‌గా మారుతానని కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి కోర్టులో వేసిన పిటిషన్‌ను కూడా సిఐడి ముందుకు తీసుకెళ్లలేదు. వ్యవస్థల మేనేజ్‌మెంట్.. కేసుల క్లోజర్ల పరంపర.. చంద్రబాబు అధికారంలోకి రాగానే కేసులను బలహీనపరచడం ఒక పరిపాటిగా మారింది. నిందితుడిగా ఉన్నప్పుడు చార్జ్ షీట్ వేసే దర్యాప్తు సంస్థే, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆధారాలు లేవని అనడం సిగ్గుచేటు. కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటరే నిందితులకు అనుకూలంగా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం. ఇదే తరహాలో ఇతర ప్రధాన కుంభకోణాలను కూడా క్లోజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్:...రూ.300 కోట్లు రెడ్ హ్యాండెడ్‌గా చేతులు మారాయని ప్రాథమిక ఆధారాలున్నా, ఆధారాలు లేవంటూ సిఐడి క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది. మద్యం విధానం కేసు:.. చంద్రబాబు ఏ-3 గా ఉన్న ఈ కేసులో 2025 డిసెంబర్ లో ఆధారాలు లేవంటూ ఫైనల్ రిపోర్ట్ వేసి ముగించారు. ఫైబర్ నెట్ కేసు:.. రూ. 330 కోట్ల టెండర్లలో రూ.114 కోట్ల నష్టం జరిగిందని 2024 లోనే చార్జ్ షీట్ దాఖలైనా, 2025 డిసెంబర్ లో అక్రమాలు లేవంటూ కేసును క్లోజ్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఇసుక విధానం కేసులు: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసును కూడా 'మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్' కింద క్లోజ్ చేసేందుకు 2026 ఫిబ్రవరిలో సిఐడి కోర్టుకు తెలిపింది. ఉచిత ఇసుక విధానం కేసు దర్యాప్తును పూర్తిగా అటకెక్కించారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఉన్న మరో రెండు అనుబంధ కేసులను (క్రైమ్ నంబర్ 14, 15/2020) 2025 నవంబర్ లో బాధితులకు ఎలాంటి క్లోజర్ నోటీసులు ఇవ్వకుండానే రహస్యంగా క్లోజ్ చేశారు. నిందితుడిగా ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థ ఒక ఛార్జిషీట్ వేస్తుంది. అదే వ్యక్తి ముఖ్యమంత్రి కాగానే అదే దర్యాప్తు సంస్థ ఆధారాలు లేవు అంటుంది. గత ప్రభుత్వం సేకరించిన బ్యాంకు ట్రయిల్స్, డిజిటల్ ఆధారాలు,164 వాంగ్మూలాలు, ఛార్జిషీట్లు, ఒక్కసారిగా బలం కోల్పోతాయి. వరుసగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, నో ఎవిడెన్స్ అంటూ ముగుస్తాయి. తర్వాత అనుకూల మీడియా అన్నీ రాజకీయాలే అంటూ పెద్ద పెద్ద అక్షరాల్లో ప్రచారం చేస్తుంది. ఇది యాదృచ్ఛికమా? లేక అధికారంలో ఉన్న వ్యక్తి తనపై దర్యాప్తు చేస్తున్న వ్యవస్ధలనే తనకు అనుకూలంగా మలచుకోవడమా? సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం.. గౌరవ హైకోర్టు కేవలం ప్రాథమిక దశలో ఎఫ్‌ఐఆర్‌ను మాత్రమే రద్దు చేసింది. సిఐడి సేకరించిన 76 మంది సాక్షుల వాంగ్మూలాలను, బ్యాంకు లావాదేవీలను పరిశీలించలేదు. చంద్రబాబు క్లీన్ చీట్‌తో బయటపడ్డానని సంబరపడాల్సిన అవసరం లేదు. కోర్టులో ట్రయల్ జరిగి నిర్దోషిగా తేలితేనే అది క్లీన్ చీట్ అవుతుంది. ఎల్లో మీడియా పక్షపాత ధోరణితో వార్తలు రాయడం మానుకోవాలి. ఈ నేపధ్యంలో 1,100 ఎకరాలకు పైగా నిరుపేద ఎస్సీ, ఎస్టీలను మోసగించిన ఈ అతిపెద్ద కుంభకోణంపై తాము ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేస్తామని, నిరుపేదలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ చట్టపరంగా పోరాడుతుందని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.