కొండల్ని కొల్లగొడుతున్నారు

సీఎం రమేష్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌

ఈనెల 21న ‘ఛలో పంచదార్ల’

అక్రమ మైనింగ్‌ అరాచకాన్ని నిలదీస్తాం

గుడివాడ అమర్‌నాథ్‌ ప్రకటన

విశాఖపట్నంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు 
బొడ్డేటి ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.

పీఏ పేరుతో సీఎం రమేష్‌ మైనింగ్‌ పర్మిషన్‌

యథేచ్ఛగా తన సొంత కంపెనీలకు మట్టి తరలింపు

గత రెండు నెలల్లో మైనింగ్‌తో వేల కోట్లు దోపిడి

చివరకు పవిత్ర పంచదార్లనూ అపవిత్రం చేశారు

ఆ పవిత్ర జలాల్లో ఇప్పుడు బురద నీరు వస్తోంది

ఇంకా సింహాచలం కొండను తవ్వేస్తున్నారు

విశాఖలోని అన్ని కొండలకు గుండు కొడుతున్నారు

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడి

వెంటనే ఆ మైనింగ్‌ లీజును రద్దు చేయాలి

ఆ ప్రాంతాన్ని ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించాలి

ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌

విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో  అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే పురాతన దివ్యక్షేత్రం  ఉమా ధర్మలింగేశ్వరస్వామి వారి ఆలయం వెలసిన  పంచదార్ల కొండను ఎంపీ సీఎం రమేష్‌ కొల్ల గొడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌ అయ్యారు. అక్కడ కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం (21వ తేదీ) ‘ఛలో పంచదార్ల’ చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌  తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సాగిస్తున్న అక్రమ మైనింగ్‌ ద్వారా వేల కోట్లు దోచుకుంటున్నారని, ఈ వ్యవహారాన్ని ప్రజలు ముందు పెడతామని తెలిపారు.
    సీఎం రమేష్‌ తన పీఏ విజయ్‌కుమార్‌నాయుడు పేరిట మే నెలలో రెండున్నర హెక్టార్లు లీజుకు ఇప్పించడంతో పాటు, మరికొందరికి అడ్డగోలుగా పర్మిట్లు ఇచ్చేలా చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. అప్పటి నుంచి పగలు, రాత్రి మైనింగ్‌ చేస్తూ, వేలాది లారీల్లో గ్రావెల్‌ తరలిస్తున్నారని, పర్మిట్‌ తీసుకున్న హద్దులు దాటి అపరిమితంగా తవ్వేస్తున్నారని ఆరోపించారు. భూమికి కిందన 70 అడుగులు మేర, కొండకు 60 నుంచి 70 అడుగుల మేర అడ్డగోలుగా మైనింగ్‌ సాగించడంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మలింగేశ్వరస్వామి వారి పవిత్రతకు దెబ్బ తీశారని, ఇంకా అక్రమ మైనింగ్‌ వల్ల అక్కడి పంచదార్ల నుంచి పవిత్ర నీటికి బదులు బురుద నీరు వస్తోందని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం అలా ఆలయ పవిత్రతను కూటమి నేతలు దెబ్బ తీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్‌తో కలిసి విశాఖలో మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్‌ ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమర్‌నాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

సనాతన ధర్మ పరిరక్షకులు తరలి రావాలి:
    టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం, లేనిపోని ఆరోపణలు, అసత్య ప్రచారంతోనే గడిపేస్తోంది. హిందూ ధర్మం, సనాతన ధర్మం పట్ల మా పార్టీకి గౌరవం లేనట్లు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, పుణ్యక్షేత్రాలను కూడా పట్టించుకోకుండా, ఆలయాల పవిత్రతను దెబ్బ తీస్తోంది కూటమి నేతలే. అందుకు పంచదార్లతో పాటు, సింహాచలం కొండల యథేచ్ఛ తవ్వకాలే ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే సనాతన ధర్మ పరిరక్షకులు, హిందుత్వ వాదులు తరలి రావాలి. విశాఖలో కొండలను కాపాడాలి.

తక్షణం ఆ అనుమతులు రద్దు చేయాలి:
    పంచదార్ల కొండపై మైనింగ్‌ కోసం ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలి. ఇంకా ఆ ప్రాంతాన్ని ‘నో మైనింగ్‌ జోన్‌’ గా ప్రకటించాలి. స్థానిక ఎంపీ సీఎం రమేష్‌ తన పీఏ పేరుతో మైనింగ్‌ లీజ్‌ పొంది, తన సొంత సంస్థలకు గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఆయన్ను అనకాపల్లి ఎంపీగా గెలిపించినందున అక్కడ వనరులు దోచుకోవడానికి బ్లాంక్‌ చెక్‌ ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మేం చేస్తోంది రాజకీయ పోరాటం కాదు. దేవుడుని, దేవుని ప్రతిష్టను కాపాడాకునే పోరాటం. అక్కడికి సమీపంలోని పునారావస గ్రామాలు, జగనన్న కాలనీలు ఉన్నాయి. అక్కడ 500 మీటర్ల మేర మైనింగ్‌కు వీలు లేదు. కానీ, అంతకు మించి యథేచ్ఛగా మైనింగ్‌ చేస్తున్నారు.
    దీనిపై వివిధ శాఖల అధికారులకు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఈనెల 21న, ఛలో పంచదార్ల కార్యక్రమంలో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కె.కన్నబాబుతో పాటు, పార్టీ ముఖ్య నాయకులంతా పాల్గొంటారని గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు.

మైనింగ్‌ అక్రమార్కులకు కళ్లు తెరిపిస్తాం.
:కరణం ధర్మశ్రీ. మాజీ ఎమ్మెల్యే
– దేశంలోనే  పవిత్రమైన, చారిత్రాత్మకమైన దివ్యక్షేత్రం పంచదార్ల. 31 కి.మీ మేర విస్తరించిన ఈ కొండ పాండవుల కొండగా పూర్వీకులు చెబుతుంటారు. పాండవులు అజ్జాత వాసం చేసినప్పుడు తలదాచుకున్న పంచదారుల కొండను వారు దాహార్తిని తీర్చడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు సృష్టించారని అంటారు. అంత చరిత్ర, పవిత్రమైన ఆ ప్రదేశంలో కూటమి నేతలు అక్రమ మైనింగ్‌ చేస్తూ, ఏకంగా కొండకే గుండు కొడుతున్నారు.
ఎంపీ సీఎం రమేష్‌ తన పీఏ పేరుతోనూ, ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ లక్ష్మీనరసింహా మినరల్స్‌ పేరిట మైనింగ్‌ లీజు ఐదున్నర హెక్టార్లకు తీసుకుని.. ఇద్దరూ కలిసి వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పటికే పంచదార్లలో మూడు దారులు డెడ్‌ అయిపోయాయి. ఉన్న రెండు దార్ల నుంచి బురద నీరు వస్తోంది. దీనిపై పోరాడేందుకు ఛలో పంచదార్ల పిలుపునిచ్చాం. అలా అక్రమ మైనింగ్‌ను ప్రజలకు చూపి కోట్ల కాజేస్తున్న వారికి కళ్లు తెరిపిస్తాం. 

పంచదార్లపై అనకొండల దోపిడి.
:బొడ్డేటి ప్రసాద్‌. వైయస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు.
– పంచదార్ల పుణ్యక్షేత్రంలో కూటమి నేతల అనకొండల దోపిడి జరుగుతోంది. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తుండగా, మేం కూడా అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ  బీజేపీ, జనసేన, టీడీపీ నేతల సాగిస్తున్న దోపిడి చూపుతాం. వారి బండారాన్ని బయటపెడతాం.

Back to Top