పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేసిన వైయస్ జగన్

 బాధిత కుటుంబానికి అండగా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ

 విజయవాడ: కృష్ణలంక సీఐ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము కనకరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ, వైయస్ జగన్ మానవతా దృక్పథంతో క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, చట్టప్రకారం రావాల్సిన ప్రయోజనాలు కూడా ఇంకా అందలేదన్నారు. దళితులపై జరుగుతున్న వివక్షపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా మానవత్వంతోనే వైయస్ జగన్ సహాయం చేశారని అన్నారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ, ఆర్థిక సాయంతో పాటు క్రాంతికుమార్ చిన్న కుమారుడి వైద్య చికిత్స బాధ్యతను కూడా పార్టీ తీసుకుందని తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, "ఏ కష్టం వచ్చినా నేనున్నాను" అనే భరోసాను వైయస్ జగన్ మరోసారి నిలబెట్టారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, క్రాంతికుమార్ ఘటన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు.

ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తమ కుటుంబానికి అండగా నిలిచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిన వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
 

Back to Top