వైయస్‌ జగన్‌ను కలిసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల యూనియన్‌ ప్రతినిధులు

థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలి.. బకాయి వేతనాలు చెల్లించాలని వినతి

కార్మికులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది: శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా

తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ను గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల యూనియన్‌ ప్రతినిధులు గురువారం కలిశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.

గత 26 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది కార్మికులు సమగ్ర మంచినీటి పథకాలలో పనిచేస్తున్నారని యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడంలో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ విధానం కారణంగా అనేక జిల్లాల్లో కార్మికులకు చెల్లించాల్సిన ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను తగ్గించి ఇస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 నెలల వరకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వాపోయారు.

నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని పేర్కొన్నారు.

థర్డ్‌ పార్టీ కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను తక్షణమే చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యూనియన్‌ ప్రతినిధులు శ్రీ వైయస్‌ జగన్‌ను కోరారు. కార్మికులకు నిర్ణీత రేట్ల ప్రకారం వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

యూనియన్‌ ప్రతినిధులు వివరించిన సమస్యలను సావధానంగా విన్న శ్రీ వైయస్‌ జగన్‌ వారికి ధైర్యం చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ను కలిసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌, దేవినేని అవినాష్‌, మల్లాది విష్ణు, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు.

Back to Top