తాడేపల్లి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు,భక్తులతో పాటు పవిత్ర క్షేత్రాలకు భద్రత లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టులు... ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘాట్ రోడ్డులో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేయడం టీటీడీ పాలకమండలి మరియు రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర పరిపాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీలు, పవిత్రత దెబ్బతినే ఘటనలపై కూటమి నాయకులు, దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు ఏమన్నారంటే.. వెల్లంపల్లి శ్రీనివాస్,మాజీ మంత్రి: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో ఎప్పుడూ జరగని అపచారాలన్నీ వరుసగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణకు గురికావడం, కొండపై చెప్పులు వేసుకొని తిరగడం వంటి దుర్ఘటనలు టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ చూడలేదు. టీటీడీ పాలకమండలి కేవలం వివిఐపీల సేవకే పరిమితమైంది. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభంగా మారింది." తిరుమల కొండ పైనుంచి ఒక విగ్రహాన్ని దొంగలు ఎలా తీసుకెళ్లగలుగుతారు? ఇదేనా మీరు ఇచ్చే భద్రత? పరిపాలన చేతకాని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. తిరుమల పరిపాలన అంతా పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు, వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిని అని చెప్పే సీఎం చంద్రబాబు గారు ఇంతటి దుర్మార్గపు ఘటనలు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏడుకొండల మెట్లు కడగరా? వైఎస్సార్‌సీపీలో గెలిచి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి ఓటేసి సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డికి మా పార్టీ గురించి, వైఎస్. జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పూర్తిగా అన్‌ఫిట్. శాఖపై ఆయనకు కనీస అవగాహన, ఇన్ఫర్మేషన్ లేదు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై నాడే మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 11-09-2020న సిబిఐ విచారణకు జీవో ఇచ్చింది. మరి ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి/టిడిపి ప్రభుత్వం ఇప్పటివరకు సిబిఐ చేత విచారణ ఎందుకు పూర్తి చేయించలేదు? 2014-19 టిడిపి హయాంలో వందలాది దేవాలయాలను గుణపాలతో కూల్చేస్తే, వైఎస్ .జగన్ ప్రభుత్వం రూ. 70 కోట్ల ప్రభుత్వ నిధులతో విజయవాడలో కూల్చివేసిన గుళ్లన్నీ పునర్నిర్మించారు. దేవుడిని కేవలం రాజకీయం కోసం వాడుకోవడం మానుకోకపోతే, హిందూ దేవాలయాలు మరియు భక్తుల రక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. మల్లాది విష్టు, మాజీ ఎమ్మెల్యే : గత 10 రోజులుగా రాష్ట్రంలో హిందూ ధర్మం, దేవాలయాల పరిరక్షణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోంది. పంచదారల కొండని బోడిగుండుగా మార్చి వేల టన్నుల మట్టిని టిడిపి, బిజెపి ప్రజాప్రతినిధులు కొల్లగొడుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలి. విజయవాడ యలమలకూరు వినాయకుడి గుడిలో, కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో, తిరుమల ఘాట్ రోడ్డులో వరుస చోరీలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. దేవాదాయ శాఖ, మైనింగ్, విజిలెన్స్ విభాగాలు ఏం చేస్తున్నాయి?. విజయవాడ దుర్గగుడిలో వేద పండితులు, అర్చకులను దుర్భాషలాడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కాపాడేందుకు ఎండోమెంట్స్ కమిషనరే వారిని సెలవుపై పంపించారు. మేము ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా మాపై రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారు. దేవాదాయ శాఖలో పారదర్శక పాలన అంటూ ప్రభుత్వం విడుదల చేసిన 10 పేజీల బుక్‌లెట్ అంతా అబద్ధాలు, అసత్యాల మయం. ఈ రెండేళ్ల కూటమి పరిపాలనలో జరిగిన వైఫల్యాలపై మంత్రికి కొన్ని ప్రశ్నలతో త్వరలోనే బహిరంగ లేఖ రాస్తాం. మా వైఎస్సార్‌సీపీ హయాంలో జీవో నంబర్లు 438, 439 ద్వారా అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఆదేశిస్తే, ఈ ప్రభుత్వం ఎందుకు 43/10 రిజిస్టర్‌లో నమోదు చేయడం లేదు? రూ. 2 లక్షలు, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను అక్కడి అర్చకులకు హ్యాండ్ ఓవర్ చేయాలన్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఎండోమెంట్స్‌లో కలిపి, దాని నిధుల నుంచి రూ. 23 కోట్లను 'తల్లికి వందనం' పథకానికి మళ్లించారు. దేవాలయాల హుండీల ఆదాయం తగ్గితే రియాక్ట్ అయ్యే ప్రభుత్వం... వరుస దొంగతనాలు, చోరీలపై ఎందుకు నోరు విప్పడం లేదు? వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ హిందూ ధర్మాన్ని, పవిత్ర ఆలయాలను కాపాడుకోవడంలో ముందుంటుంది.