కేంద్ర, రాష్ట్రాల వైఫల్యం వల్లే నీట్, డీఎస్సీ అక్రమాలు

28న రాష్ట్రంలో  విద్యార్ది, యువతతో ర్యాలీలు, నిరసనలు

వైయ‌స్ఆర్‌సీపీ నేతల పిలుపు

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్ధి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర

ఫీజు రీయింబర్స్ మెంట్ గాలికొదిలేసిన కూటమి సర్కార్ 

డీఎస్సీ అక్రమాలు బయటపడినా చర్యలు తీసుకోలేదు

యువతలో సహనం నశించడం వల్లే ఢిల్లీ నిరసనలు

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి 

జక్కంపూడి రాజా డిమాండ్ 

ఢిల్లీ జంతర్ మంతర్ ఘటనల్ని ఖండిస్తున్నాం

విద్యార్దులపై లాఠీఛార్జి, బలప్రయోగం సరికాదు

కూటమి సర్కార్ ఇంకా దీనిపై స్పందించలేదు

డీఎస్సీ అక్రమాలపై చర్యలు చేపట్టాల్సిందే

తేల్చిచెప్పిన పానుగంటి చైతన్య 

నీట్ ఆందోళనల్ని జటిలం చేస్తున్న కేంద్రం 

సీబీఐ దర్యాప్తుతోనే డీఎస్సీ బాధితులకు న్యాయం

ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీలు చెల్లించేదెప్పుడు ?

జూలై 28న ఏపీలో ఆందోళనలకు వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు

రవిచంద్ర వెల్లడి

తాడేపల్లి:  నీట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణలో వైఫల్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు తీరని అన్యాయం చేస్తున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్ధి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్ని పోలీసులతో అణచివేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వారు తప్పుబట్టారు. అలాగే రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి, యువజన విభాగాల నేతలు ప్రకటించారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని గాలికొదిలేశారు:
జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలు ఇవ్వడం, ఎన్నికల తర్వాత మొండిచేయి చూపడం రివాజుగా మారిపోయింది.2024 ఎన్నికలకు ముందు రైతులు, మహిళలు, విద్యార్దులు, యువతకు ఎన్నో హామీలిచ్చారు. కానీ గత రెండేళ్లుగా యువత చెవుల్లో పువ్వులు పెట్టారు. ఉదాహరణకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత చదువులు చదువుకుంటే కుటుంబ ఆర్దిక స్థితిగతులు మారతాయని ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకుంటే ప్రవేశపెట్టారు. దీన్ని 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పూర్తిగా నీరుగార్చింది. మళ్లీ ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో పట్టాలెక్కించారు. మళ్లీ ఈ రెండేళ్లలో ఆ పథకం పూర్తిగా గాలికొదిలేశారు. చాలా చోట్ల విద్యార్ధులు కాలేజీల యాజమాన్యాల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేల మంది విద్యార్దులు చదువులు మానేసి రోజువారీ కూలీకి వెళ్తున్నారు. అటు నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇస్తామని, ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. కోటి మందికి నెలకు 3వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ రెండేళ్లలో 72 వేల కోట్లు ఇవ్వకుండా బకాయిపెట్టారు. కోటి ఆశలతో ఆస్తులు తాకట్టుపెట్టి, అప్పులు చేసి, రాత్రీ పగలూ తిండీనిద్ర మానేసి కష్టపడి చదువుకున్న పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం కోసం డీఎస్సీ పరీక్ష రాస్తే వాళ్లను కూడా మోసం చేశారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడితో అడుగడుగునా అక్రమాలు చేశారు. ఉద్యోగాల కోసం బేరసారాలు ఆడే ఆడియో లీక్ లు బయటికి వచ్చినా ఏ ఒక్కరిమీదా చర్యలు తీసుకోలేదు. పారదర్శకంగా విచారణ కూడా చేయలేదు. అధికారం ఉంది కాబట్టి ఏదైనా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్న విద్యామంత్రి లోకేష్ బాధ్యతా రాహిత్యంగా లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

డీఎస్సీ అక్రమాలపై చర్యలేవీ ?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా డీఎస్సీ అక్రమాలను బయటపెట్టినా, ఈ ప్రభుత్వం వాటిని తేలిగ్గా తీసుకుంది. యువతలో సహనం నశిస్తే ఏం జరుగుతుందో గతంలో బంగ్లాదేశ్ లో జరిగిన ఘటనల్లో కనిపించింది. ఇప్పుడు  ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు దీన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడకుండా పరీక్షలు, ఉద్యోగాల విషయంలో బాధ్యతగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నాం. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వల్ల భారీ సంఖ్యలో విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు. మన ఇంట్లో వాళ్లు కూడా అలాగే నష్టపోతే ఎంత బాధపడతాం? కాబట్టి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికైనా డీఎస్సీలో జరిగిన తప్పులపై సీబీఐ దర్యాప్తు వేయాలని కోరుతున్నాం. అలాగే నీట్ పరీక్ష అక్రమాలపైనా స్పందిస్తున్నాం. దీంతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు డిమాండ్ తో పార్టీ విద్యార్ధి, యువజన విభాగాలు సంయుక్తంగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్ధులు, యువతతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి వీటిపై స్పందించాలని కోరుతున్నాం.

ఢిల్లీలో విద్యార్దులపై పోలీసుల ప్రయోగం సరికాదు:
పానుగంటి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు 

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యవహారం రాష్ట్రంలోనూ దుమారం రేపుతోంది. రేయింబవళ్లు కష్టపడి చదువుకున్న వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. రాష్ట్రంలోనూ డీఎస్సీ పరీక్షల అక్రమాలతో విద్యార్ధులను కూటమి సర్కార్ మోసం చేసింది. పరీక్షల నిర్వహణ నుంచి అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చే వరకూ ఎన్నో అక్రమాలు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. జంతర్ మంతర్ లో నిరసన ర్యాలీలు చేస్తుంటే పోలీసులు గూండాల్లా లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగాలు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విబాగం ఈ ఘటనల్ని తీవ్రంగా ఖండిస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ తరఫున లోకేష్ దీనిపై ఇప్పటివరకూ నోరుమెదపలేదు. డీఎస్సీ అక్రమాలపైనా ఆయన ఇప్పటివరకూ మాట్లాడలేదు. విద్యార్ధులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇది గతంలో ఎన్నోసార్లు రుజువైంది. కాబట్టి విద్యార్ధులకు జరిగిన అన్యాయంపై స్పందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలన్నీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. నీట్ అక్రమాలతో పాటు డీఎస్సీ అక్రమాల వెనుక ఉన్న నిందితుల్నీ కఠినంగా శిక్షించాలి. ఇవే డిమాండ్లతో 28న మేం చేపట్టిన నిరసనలను విజయవంతం చేయాలని విద్యార్ధులు, యువతను కోరుతున్నాం.

28న ర్యాలీలు, నిరసనల్ని విజయవంతం చేయాలి:
రవిచంద్ర, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ 

డీఎస్సీ అక్రమాలపై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలి. అలాగే నీట్ పేపర్ లీక్ వివాదంలో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించి బాధ్యుల్ని శిక్షించాలి. ఢిల్లీలో విద్యార్ధుల ఆందోళనల్ని సున్నితంగా పరిష్కరించకుండా కేంద్రం జటిలం చేస్తోంది. విద్యార్దులపై లాఠీచార్జ్ లు, బాష్పవాయువు ప్రయోగాల్ని ఖండిస్తున్నాం. అలాగే ఏపీలో గత 13 విడతల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. సుమారు 9100 కోట్లు బకాయిలు ఉన్నాయి. స్కాలర్ షిప్పులు మరో 3300 కోట్లు బకాయిపడింది. మొత్తం 12400 కోట్లు ఇప్పటివరకూ ప్రభుత్వం విద్యార్ధులకు బకాయిలు పెట్టింది. దీని వల్ల విద్యార్ధులకు పై చదువులు చదువుకునే అవకాశం లేకుండా పోతోంది. కాబట్టి ఈ నెల 28న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నాం. డీఎస్సీని ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించలేకపోయింది. నవీన్ అనే మొదటి ర్యాంక్ వచ్చిన విద్యార్ధికి ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. టెట్, డీఎస్సీకి ఒకరే కన్వీనర్ ఉండటం వల్ల అక్రమాలు జరిగాయి. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం పోస్టులు ఇవ్వకుండా వాటిని అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉమ్మడి ఏపీలోనూ ఏ ప్రభుత్వం చేయని విధంగా పోస్టులు అమ్ముకున్నారు. ప్రభుత్వం అనుమానాల్ని నివృత్తి చేయకుండా అధికారులతో మాట్లాడించి తప్పించుకుంది. డీఎస్సీపైనా ఇప్పటికైనా చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందే. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కేవలం 2900 కోట్లు మాత్రమే ఇచ్చి తప్పించుకుంటున్నారు. కాబట్టి జూలై 28న ప్రతీ ఒక్క విద్యార్ధి, యువత భారీ ఎత్తున హాజరై నిరసనలు విజయవంతం చేయాలి.

Back to Top