హిందూపురం: మెగా డీఎస్సీ–దగా డీఎస్సీ పేరుతో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా హిందూపురం నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి దీపిక వేణు రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడంతో హిందూపురం పట్టణ వీధులు మార్మోగాయి. డీఎస్సీ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని ర్యాలీ సందర్భంగా నినాదాలు చేశారు. వైయస్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఎస్పీ, ఎంఎస్‌ఎఫ్, ఆర్‌ఎస్‌పీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో వివిధ వర్గాల నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు భారీగా పాల్గొని డీఎస్సీ బాధితులకు అండగా నిలిచారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, యువత భవిష్యత్తును దెబ్బతీసే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వైయస్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు.