బీసీల్ని నిండా ముంచిన కూటమి సర్కార్

ఆగస్టు 9న విజయవాడలో వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ సభ 

చంద్రబాబు మోసాల్ని ఎండగట్టబోతున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ బీసీ నాయకుల వెల్లడి

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ బీసీ సెల్ నేతలు మాజీ మంత్రులు జోగి రమేశ్, విడదల రజనీ

ఆగస్టు 9న విజయవాడలో బీసీల గర్జన

కూటమి సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం

జోగి రమేశ్ హెచ్చరిక

రెండేళ్లలో బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం

జగన్ పాలనలో బ్యాక్ బోన్ కులాలుగా బీసీలు

విడదల రజనీ వెల్లడి

బీసీలకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు

కచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం

తేల్చిచెప్పిన రమేశ్ యాదవ్ 

బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న చంద్రబాబు

డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేరా ?

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూటి  ప్రశ్న

తాడేపల్లి: రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో బీసీలకు ప్రతీ విషయంలోనూ అన్యాయమే జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా వారిని మోసం చేయడంతో పాటు ప్రశ్నిస్తే దాడులు, కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీపీ బీసీ సెల్ నేతలు మాజీ మంత్రులు జోగి రమేశ్, విడదల రజనీ, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మండిపడ్డారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు బీసీలకు చేసిన మోసంతో పాటు జగన్మోహన రెడ్డి గారి పాలనలో జరిగిన మేలును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వచ్చే నెల 9న విజయవాడలో భారీ సభ నిర్వహించబోతున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ బీసీ నేతలు ప్రకటించారు. 

జోగి రమేశ్, మాజీ మంత్రి

విజయవాడ వేదికగా ఆగస్టు 9న బీసీల గర్జన వినిపించబోతున్నాం. కూటమి సర్కార్, కుట్రల సర్కార్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించబోతున్నాం. బీసీల ఐక్యతను చాటే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. బీసీలంటే బ్యాక్ బోన్ అనే చేతల్లో చూపించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ప్రభుత్వంలో బలహీనవర్గాలకు ఏ విధంగా మేలు జరిగింది, సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల్ని, అభినవ పూలే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఏ విధంగా చేసి చూపించారో చెప్పబోతున్నాం. స్వాతంత్రం వచ్చాక ఏపీలో బీసీల్ని ఎలా బలోపేతం చేశారో చెప్పాలనుకుంటున్నాం. రెండేళ్ల పాలనలో చంద్రబాబు బలహీన వర్గాలను ఎలా హింసిస్తున్నాడు, బలహీన వర్గాల నాయకుల్ని ఎలా అణచివేస్తున్నాడో ప్రజలకు తెలియజెప్పాల్సి ఉంది. జగనన్న ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రజలంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో వైయ‌స్ఆర్‌సీపీలో ఉన్న బలహీన వర్గాల నాయకులంతా ఆగస్టు 9న ఆదివారం నాడు సంఘటితం కాబోతున్నాం. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటాం. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాల ప్రజలంతా మళ్లీ నడవాల్సిన అవసరాన్ని గుర్తుచేయబోతున్నాం. 

విడదల రజనీ, మాజీ మంత్రి 

ఆగస్టు 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఓ కార్యాచరణ చేపట్టబోతోంది. చంద్రబాబు మోసపు పాలనను ఎండగడుతూ వైయ‌స్ఆర్‌సీపీ ముందడుగు వేయబోతోంది. సూపర్ సిక్స్ లో సూపర్ మోసపు హామీలతో, ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారు. రెండేళ్లలో బీసీల్ని చంద్రబాబు ప్రభుత్వం ఎలా మోసం చేసిందో చెప్పడంతో పాటు మా ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్నివిధాలా జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాం. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్లో సగం బీసీలకే ఇచ్చారన్న విషయం గుర్తుచేయబోతున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీసీలకు చేసిందేమీ లేదు. ఆనాడు బీసీల తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మా పార్టీలో నాతో పాటు జోగి రమేశ్ గారు, ఇతర నాయకులపై ఎన్ని కేసులు పెట్టి, దాడులు చేయించి ఇబ్బంది పెడుతున్నారో అందరూ చూశారు. జగనన్న చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు.  మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని ముందుకెళ్తాం. మాతో పాటు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి విధానాలు నచ్చి అభిమానిస్తున్న వారికి కూడా అండగా నిలవబోతున్నాం. బీసీలకు మళ్లీ మంచిరోజులు రావాలంటే జగనన్న పాలనే రావాలి, కావాలి అనే నినాదంతో ఆగస్టు 9న సభ ఉంటుంది. 

రమేశ్ యాదవ్, ఎమ్మెల్సీ

వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ తరఫున వచ్చే నెల 9న బీసీ మంత్రులు, నాయకులు కలిసి ఓ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో గత రెండేళ్లలో బీసీలపై చేసిన దాడులు, బీసీలకు ఇచ్చిన మోసపు హామీలపై చర్చించబోతున్నాం. బీసీలకు చంద్రబాబు, ఆయన కోటరీ ఎలా వెన్నుపోటు పొడుస్తోందన్న అంశంపైనా చర్చిస్తాం. జోనల్ వారీగా, జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కూడా కూటమి ప్రభుత్వం అక్రమాలను తీసుకెళ్లాలని నిర్ణయించాం. బీసీల్ని బాబు కమిటీలుగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై మా పోరు కొనసాగిస్తాం. మేం తెచ్చిన అమ్మఒడిని తల్లికి వందనం అనే పేరు మార్చి అందులో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. నేతన్న నేస్తం విషయంలోనూ ఇలాగే బీసీల్ని మోసం చేస్తున్నారు. అందుకే బీసీల్ని ఏకతాటిపైకి తెచ్చి మా నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. 

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి

 వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి పాలనలో బలహీనుడి బలపరిస్తే, మళ్లీ చంద్రబాబు బలహీనుడిని మరింత బలహీనుడిని చేసేలా పాలన చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆగస్టు 9న రాష్ట్రంలో బీసీ మాజీ మంత్రులు, వివిధ కార్పోరేషన్లు, ఇతర పదవుల్లో ఉన్న వారంతా కూర్చుని ఈ ప్రభుత్వం చేసిన మోసాలపై చర్చిస్తాం.  చంద్రబాబు ఈ రెండేళ్లలో బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు. రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బలహీన వర్గాలకు ఈసారి ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేకపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో కేఈ కృష్ణమూర్తి గారికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు, ఈసారి మాత్రం ఎందుకు ఇవ్వలేదు ? ఇది బీసీల్ని అవమానించడం కాదా ? బీసీలకు రుణాలిస్తామంటే 3 లక్షలమంది దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ వీరిలో ఒక్కరికైనా రుణం ఇచ్చారా, ఇది మోసం కాదా అనేది చెప్పాలి.  చంద్రబాబు మూడు బడ్జెట్లలో ఆదరణ పథకం కోసం రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. ఆదరణ పేరు చెప్పి వెయ్యి కోట్లు పెట్టినా ఎక్కడా రూపాయి ఇవ్వలేదు. ఆర్ధిక సాయం పేరుతో వెయ్యి కోట్లు ఖర్చుచేస్తామన్నారు, కానీ ఎక్కడా రూపాయి ఇవ్వలేదు. 
    బీసీలు విద్యావంతులు కాకుండా బానిసలుగా ఉండిపోయి కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తున్నారు. తల్లికి వందనంలో కొందరికి మూడు వేలు, కొందరికి ఏడు వేలు ఇస్తున్నారు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంట్ కు భారీగా బకాయిలు పెట్టి బీసీ విద్యార్ధులను ఇబ్బంది పెడుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఒకే రోజు 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తే వారికి ఆఫీసులు లేవు, కుర్చీలు లేవన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు 40 కార్పోరేషన్లే ఎందుకు ఏర్పాటు చేశారు. ఆ కార్పోరేషన్లూ మేం పెట్టిన ఆఫీసుల్లో, ఫర్నిచర్ తోనే నడుపుతున్నారు. ఆయా కార్పోరేషన్లకు మీరిచ్చిన నిధులెంత అని అడుగుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించామని మాపై విమర్శలు చేసిన చంద్రబాబు... త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఎంత శాతం ఇస్తారో చెప్పాలి.  బీసీల్లో చైతన్యం వచ్చింది, మీ మెడలు వంచి బడ్డెట్ లో 50 శాతం నిధులు కేటాయించేవరకూ పోరాటాలు చేస్తాం.

Back to Top