హంద్రీనీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం

రూ.3 వేల కోట్ల పనుల్లో భారీ అవినీతి

`చలో చోళసముద్రం` కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ధ్వ‌జం

రాయ‌ల‌సీమ‌కు అన్యాయం చేస్తే స‌హించేది లేదు

మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకె శైల‌జానాథ్ హెచ్చ‌రిక‌

హంద్రీనీవా పరిరక్షణకు పోరుబాట చేప‌ట్టిన అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు. అనంత‌పురం జిల్లాలోని చోళసముద్రం నుంచి నారాయణపురం వరకు హంద్రీనీవా కాలువలను పరిశీలించారు. అనంత‌రం అక్క‌డే రైతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన మాజీ మంత్రి డాక్ట‌ర్ శైల‌జానాథ్‌, జిల్లా అధ్య‌క్షులు అనంత వెంక‌ట్రామిరెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, విశ్వేశ్వ‌ర్‌రెడ్డి. కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌, ఎంపీలు త‌లారి రంగ‌య్య‌, గోరంట్ల మాధ‌వ్‌, మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ,  జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గిరిజమ్మ,  జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, డిప్యూటీ మేయర్ వాసంతి,  మాజీ కార్పొరేషన్ చైర్మన్ రంగన్న,  బీసీ సెల్‌ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్,  ఐటీ వింగ్ జోన‌ల్ అధ్య‌క్షుడు, ప్రోగ్రాం కో-ఆర్డినేట‌ర్ మంజునాథ్ యాద‌వ్‌,  కోకటం విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డిడ్డి,  రాయలసీమ అధికార ప్రతినిధి రమణ, పార్టీ జిల్లా ఉపాధ్య‌క్షురాలు  నైరుతి రెడ్డి, నాయ‌కులు  గోకుల్, అశోక్,  నార్పల సత్యనారాయణ రెడ్డి,  నదీమ్ మహమ్మద్,  గోవర్ధన్ రెడ్డి,  తిప్పేస్వామి,  వీరాంజనేయులు,  ఓబులేసు,  జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు,  వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, నాయకులు,  రైతు నాయకులు,  మహిళా నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

హంద్రీనీవా కాలువల విస్తరణ, లైనింగ్ పనుల్లో రూ.3 వేల కోట్ల దోపిడీ

చేత్తో లాగితే ఊడిపోయేలా హంద్రీనీవా లైనింగ్ పనులు

పనులు సక్రమంగా జరిగి ఉంటే అనంతపురానికి 80 టీఎంసీల నీరు వచ్చేది

వైయ‌స్ జగన్ ప్రభుత్వం 6,300 క్యూసెక్కులకు పెంచిన ప్రణాళికను రద్దు చేసి 3,850 క్యూసెక్కులకు కుదించారు

వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే హంద్రీనీవాను 11,500 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరిస్తాం

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నది చంద్రబాబే

రాయలసీమ ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టిన చంద్రబాబు

హంద్రీనీవా అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

రాయలసీమ నీటి హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం మరింత ఉధృతం చేస్తుంది

తేల్చి చెప్పిన వైయ‌స్ఆర్‌సీపీ అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల నేత‌లు

అనంత‌పురం: రాయలసీమ రైతుల జీవితాధారమైన హంద్రీనీవా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధుల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలువల విస్తరణ, లైనింగ్ పనుల పేరుతో రూ.3 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని, రైతులకు మాత్రం చుక్కనీరు కూడా అందించలేదని మండిపడింది. హంద్రీనీవా కాలువలను 11,500 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించాల్సిన అవసరాన్ని పక్కనపెట్టి, నాసిరకం పనులతో రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టారని ధ్వజమెత్తింది. హంద్రీనీవా పరిరక్షణ కోసం అనంతపురం, కర్నూలు జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ నేతలు చేపట్టిన 'చలో చోళసముద్రం' కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలోని చోళసముద్రం నుంచి నారాయణపురం వరకు కాలువలను పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి జరిగిన సభలో రాయలసీమ టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజానాథ్ , జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తదితరులు మాట్లాడుతూ, రాయలసీమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, హంద్రీనీవా పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
రైతుల‌ను ఉద్దేశించి వైవైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఏం మాట్లాడారంటే..  

- సాగునీటి సాధ‌న‌కు ప్ర‌జా ఉద్య‌మం ఉధృతం:  డాక్టర్ సాకె శైలజానాథ్ , గ్రేట‌ర్ రాయలసీమ టాస్క్‌ఫోర్స్ క‌న్వీన‌ర్ , మాజీ మంత్రి 
కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గొప్పలు చెబుతోంది. కానీ రాయలసీమ రైతులకు ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు. హంద్రీనీవా కాలువల లైనింగ్ పనులు అత్యంత నాసిరకంగా జరిగాయి. చేత్తో లాగితే ఊడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. నీరు వదిలితే మొత్తం లైనింగ్ కొట్టుకుపోతుంది. రైతుల కోసం కాకుండా కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే ఈ పనులు చేశారు. అనంతపురం, రాయలసీమ ప్రజలకు ఒట్టి మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయించే వరకు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. హంద్రీనీవా లైనింగ్ పనుల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనాన్ని దోచుకున్న కాంట్రాక్టర్ల నుంచి ప్రతి రూపాయి రికవరీ చేయాలి. ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నీటి అవసరాలను తీర్చేందుకు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.

- హంద్రీనీవా వైయ‌స్ఆర్ దూర‌దృష్టి ఫ‌లితం: అనంత వెంకటరామిరెడ్డి , వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే 
హంద్రీనీవా ప్రాజెక్టు రాయలసీమ ప్రజల దశాబ్దాల పోరాటం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి ఫలితం. రాయలసీమకు కృష్ణా జలాలు అందించి కరవును పారద్రోలాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు జీవోలు జారీ చేసి టెండర్లు కూడా పిలిచింది. కానీ కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాలను రద్దు చేసి కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు కుదించింది. రైతులు 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువలను విస్తరించాలని కోరుతుంటే, కూటమి ప్రభుత్వం మాత్రం నాసిరకం లైనింగ్ పనులతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంది. రూ.3 వేల కోట్ల పనులు పూర్తయ్యాయని చెబుతున్నా, అనంతపురం జిల్లాకు రావాల్సిన 80 టీఎంసీల నీరు ఎందుకు రాలేదో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలి.  రాయలసీమ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. హంద్రీనీవా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే వరకు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా కాలువలను 11,500 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించి రాయలసీమ రైతుల కలను సాకారం చేస్తాం.

- ఐక్యంగా పోరాడుదాం: కాటసాని రాంభూపాల్‌రెడ్డి,వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే  
రాయలసీమకు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ న్యాయం చేయలేదు. 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే హంద్రీనీవా, గాలేరు-నగరి, ఎస్‌ఆర్‌బీసీ, గోరకల్లు, గండికోట వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు కృష్ణా జలాలు అందించిన ఘనత కూడా వైయ‌స్సార్‌కే దక్కుతుంది. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను 80 శాతం పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాయలసీమలో నీటి సమస్య శాశ్వతంగా తీరేది. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై ఆ ప్రాజెక్టును నిలిపివేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపించానని చెప్పినా, చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదు. ఆల్మట్టి ఎత్తు పెంపు, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు మౌనం పాటిస్తూ రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. రాయలసీమ ప్రజలు ఇక మోసపోవద్దు. మన నీటి హక్కుల కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం అందరం ఐక్యంగా పోరాడాలి. హంద్రీనీవా కాలువల లైనింగ్ పనుల్లో జరిగిన నాసిరకం నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన కాంట్రాక్టర్ల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. రాయలసీమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తుంది.

- చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ ద్రోహి:  ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, వైయ‌స్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే 
రాయలసీమకు ద్రోహం చేసిన వారిలో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడే. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులపై మాట్లాడకుండా, రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీరేదనే ఉద్దేశంతో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ కూటమి ప్రభుత్వం దానిని అడ్డుకుంది. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు తగ్గించి రాయలసీమ రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. లైనింగ్ పనులు పూర్తిగా నాసిరకంగా జరిగాయి. చేత్తో లాగితే ఊడిపోయే స్థాయిలో నిర్మాణాలు చేశారు. నీరు వదిలితే మొత్తం కొట్టుకుపోయేలా పనులు చేసి, తిరిగి మరమ్మతుల పేరుతో మరోసారి వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికే ఈ కుట్ర జరిగింది. ఈ నాసిరకం లైనింగ్ వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, చెట్లు నాశనమవుతున్నాయి. రాయలసీమను విస్మరించి ఒకే ప్రాంత అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. ఇప్పుడు రాయలసీమ ప్రజలు ఐక్యంగా నిలబడి తమ నీటి హక్కులను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. అనంతపురమా, కర్నూలా, నంద్యాలా అనే తేడా లేకుండా ఎక్కడ రాయలసీమకు అన్యాయం జరిగినా అందరం కలిసి పోరాడాలి. హంద్రీనీవా అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించే వరకు, రాయలసీమకు న్యాయం జరిగే వరకు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. 

- రాయలసీమకు ద్రోహం చేస్తే ఊరుకోం: విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
హంద్రీనీవా కాలువల లైనింగ్ పనులకు రూ.950 కోట్లతో టెండర్లు పిలిచి, భారీ ఎక్సెస్‌తో కాంట్రాక్టులు అప్పగించారు. అయినా నాణ్యత ఎక్కడా కనిపించడం లేదు. రైతులు తమ బోర్లు ఎండిపోయాయని, చెట్లు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి చెందిన కాంట్రాక్టర్లు, నాయకులు కలిసి ప్రజాధనాన్ని పంచుకోవడానికే ఈ పనులు చేశారు. ప్రస్తుతం నిర్మించిన లైనింగ్ కూడా నిలబడే పరిస్థితిలో లేదు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువలను 11,500 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించి, రైతులకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 6,400 క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువలను విస్తరించేందుకు టెండర్లు పిలిచినా, కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసి 3,850 క్యూసెక్కులకు కుదించింది. వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తీసుకురాలేదు. గండికోట, గాలేరు-నగరి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులను వైయ‌స్ రాజశేఖరరెడ్డి, వైయ‌స్ జగన్ ప్రభుత్వాలు దూరదృష్టితో ముందుకు తీసుకెళ్లాయి. కానీ కూటమి ప్రభుత్వం పక్క రాష్ట్రాల ప్రయోజనాలకు తలొగ్గి రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. అప్పర్ భద్ర, ఆల్మట్టి, తెలంగాణ అక్రమ నీటి వినియోగం వంటి అంశాల్లో చంద్రబాబు వైఫల్యం వల్ల రాయలసీమ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. రాయలసీమకు ద్రోహం చేస్తే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం" అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top