తాడేపల్లి: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచన ప్రజల ఆస్తులపై ప్రత్యక్ష దాడినే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ప్రజల భూముల భద్రతతో చెలగాటం ఆడొద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన కీలక సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇది కేవలం పరిపాలనా సంస్కరణ కాదని, రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజల ఆస్తుల భద్రతను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయమని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డ్రోన్లు, జీపీఎస్, లాంగిట్యూడ్–లాటిట్యూడ్ ఆధారిత సాంకేతికతతో వేలాది మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి, ప్రతి భూమికి శాశ్వత హద్దులు నిర్ణయిస్తూ, క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ భూ రికార్డులు రూపొందించి భూమి యజమానులకు శాశ్వత భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశామని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుత్తా శివశంకర్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ దూరదృష్టితో తీసుకువచ్చిన భూ సంస్కరణలను అప్పట్లో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎల్లో మీడియా, సోషల్ మీడియా, కాల్ సెంటర్లు, పత్రికల ద్వారా "మీ భూములను ప్రభుత్వం లాక్కుంటుంది", "ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల రైతుల ఆస్తులు పోతాయి" అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న భూసర్వే విధానం, డిజిటల్ రికార్డులు, క్యూఆర్ కోడ్ వ్యవస్థ, సాంకేతిక ప్రమాణాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో రూపొందించినవేనని అన్నారు. పాస్‌బుక్ రంగు మార్చడం, ఫోటో తొలగించడం తప్ప మరే మార్పూ చేయలేదని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ముందు చేసిన ప్రచారం అంతా అసత్యమని ప్రజలకు ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఇప్పుడు అదే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటుపరం చేయాలన్న ప్రమాదకరమైన నిర్ణయానికి సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. మొదటి దశలో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి అధిక విలువైన భూములు ఉన్న 26 కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసి, అనంతరం రాష్ట్రంలోని 294 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. - ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ దందాలకు అవకాశం రిజిస్ట్రేషన్ శాఖ అనేది సాధారణ ప్రభుత్వ శాఖ కాదని, భూముల యాజమాన్య హక్కులు, మార్కెట్ విలువలు, నిషేధిత భూముల వివరాలు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), స్టాంప్ డ్యూటీ వసూళ్లు, రిజిస్ట్రేషన్ ధృవీకరణ వంటి అత్యంత కీలకమైన అంశాలను నిర్వహించే శాఖ. ఇలాంటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ప్రజల వ్యక్తిగత సమాచారం, భూముల వివరాలు, ఆస్తుల విలువలు, కుటుంబ సభ్యుల సమాచారం, అప్పులు, కోర్టు కేసులు వంటి అత్యంత గోప్యమైన సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలపై నిత్యం వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ నియంత్రణలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగిస్తే భూ మాఫియాలు, రియల్ ఎస్టేట్ దందాలకు మరింత అవకాశం కల్పించినట్టే అవుతుంది. అప్పుడు రైతుల భూములను, సామాన్య ప్రజల ఆస్తులను ఎవరు రక్షిస్తారు?. ఈ నిర్ణయం వల్ల రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, తరతరాలుగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ ఆస్తులు, మున్సిపల్ ఆస్తులను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాల తర్వాత ఇప్పుడు ప్రజల వ్యక్తిగత ఆస్తుల భద్రతను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనుకోవడం అత్యంత ప్రమాదకరం. "భూమి రైతుకు జీవనాధారం... సామాన్య కుటుంబానికి జీవితకాల సంపాదన. అలాంటి భూముల రికార్డులను, హక్కులను, గోప్యమైన సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు" - రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, డాక్యుమెంట్ రైటర్లు, ఉద్యోగ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఎలా అడ్డుకున్నామో, అంతకంటే పెద్ద స్థాయిలో ప్రజల భూములు, ఆస్తుల రక్షణ కోసం పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలి. ప్రజల ఆస్తుల భద్రతతో చెలగాటం ఆడితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేస్తుంది. ప్రజల భూములు, రైతుల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం చివరి వరకు నిలబడతాం" అని పుత్తా శివశంకర్ హెచ్చరించారు.