టీడీపీ ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ అరాచ‌కాలు క‌నిపించ‌వా?

కూట‌మి నేత‌ల‌ను సూటిగా ప్ర‌శ్నించిన ఆళ్ల‌గ‌డ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి సూటి ప్ర‌శ్న‌

నంద్యాల: అధికారం అండగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలం ఆలయాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టోల్‌గేట్లలో అక్రమ వసూళ్లు, ఆలయ వెంట్రుకల వేలం ప్రక్రియలో కమిషన్ల కోసం బెదిరింపులు, ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే అరాచ‌కాలు కూట‌మి నేత‌ల‌కు క‌నిపించ‌డం లేదా అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. మంగ‌ళారం నంద్యాలలో మీడియాతో గంగుల బిజేంద్ర‌రెడ్డి మాట్లాడారు.

దొంగే దొంగ అని అరిచినట్లుగా టీడీపీ నాయకుల వ్యవహారం
అహోబిలం ఆలయానికి సంబంధించిన త‌ల వెంట్రుకల వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లను టీడీపీ నేత‌లు బెదిరిస్తున్నారని గంగుల బిజేంద్రరెడ్డి ఆరోపించారు. ఆలయ సీఈవో నిబంధనల ప్రకారం వెంట్రుకలను చెన్నైలోని కాంట్రాక్టర్‌కు తరలిస్తుండగా, భూమా విఖ్యాత్ అడ్డుకుని హంగామా చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతూ ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్లుగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి 
సనాతన ధర్మం పేరుతో మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని గంగుల బిజేంద్రరెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా అని నిలదీశారు. నంద్యాల జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహోబిలం ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై చర్యలు తీసుకుంటారా లేదా ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Back to Top