డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రజా హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయుల ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వంగవీటి మోహనరంగా, అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గోపాలపురం గ్రామంలో, రావులపాలెంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, అలాగే రావులపాలెంలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగా అని కొనియాడారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ సమాజంలో ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులపై అసమాన పోరాటం చేసి భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఆయన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మహనీయులు చూపిన విలువలు, త్యాగస్ఫూర్తి, ప్రజాసేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు.