జన హృదయ విజేత.. సంక్షేమానికి చిరునామా.. అపర భగీరథుడు డాక్టర్ వైయ‌స్ఆర్ 

77వ జయంతి ప్రత్యేకం 

తాడేప‌ల్లి: ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన నాయకుడు... అధికారం అంటే ప్రజాసేవ అనే తత్వాన్ని ఆచరణలో చూపించిన మహానేత... రైతు, పేద, విద్యార్థి, మహిళ, కార్మికుడు, వృద్ధుడు అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి భరోసాగా నిలిచిన సంక్షేమ సారథి... ఆయనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి.

జూలై 8న డాక్టర్ వైయ‌స్ఆర్ 77వ జయంతిని పురస్కరించుకుని ఆయన ప్రజాసేవ, సంక్షేమ పాలనను మరోసారి స్మరించుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత. కేవలం ఐదేళ్ల మూడు నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆయన సృష్టించిన ముద్ర చెరగనిది. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, వారి జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

వ్యవసాయాన్నే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించిన వైయ‌స్ఆర్ రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చారు. ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు, పావలా వడ్డీ పంట రుణాలు, కేంద్ర రుణమాఫీ పరిధిలోకి రాని 36 లక్షల రైతు కుటుంబాలకు రాష్ట్ర ఖజానా నుంచి రూ.1,800 కోట్ల సాయం, వ్యవసాయ ఇన్‌పుట్‌ల ధరల నియంత్రణ వంటి నిర్ణయాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. జలయజ్ఞం ద్వారా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి లక్షల ఎకరాలకు నీటి భరోసా కల్పించారు. వ్యవసాయం లాభసాటిగా మారడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై గ్రామాలు సుసంపన్నంగా మారాయి.

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేసిన 104 సేవలు ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికాయి. లక్షలాది కుటుంబాలకు ప్రాణభిక్షగా నిలిచిన ఈ పథకాలు వైయ‌స్ఆర్ మానవతా దృక్పథానికి నిదర్శనం.

పేద విద్యార్థులు డబ్బుల్లేక చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వేలాది మంది యువత భవిష్యత్తును మార్చింది. వృద్ధులకు సామాజిక భద్రతగా పెన్షన్లు, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కలను నిజం చేయడం, మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు రుణాలు, వడ్డీ రాయితీలు అందించడం ద్వారా సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతికి కృషి చేశారు.

గ్రామీణాభివృద్ధి, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, సాగునీరు వంటి ప్రతి రంగంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర సంక్షేమ పాలనను అందించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నిరూపిస్తూ ఆయన అమలు చేసిన ప్రతి పథకం లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపింది.

డాక్టర్ వైయ‌స్ఆర్ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజల గుండెల్లో విశ్వాసాన్ని నింపిన నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. "మా ముఖ్యమంత్రి మాకు ఉన్నాడు" అనే భరోసాను ప్రతి పేద కుటుంబానికి కల్పించిన అరుదైన ప్రజానేతగా ఆయన చరిత్రలో నిలిచారు. సేవా స్ఫూర్తి, మానవతా దృక్పథం, సంక్షేమ పాలనకు ఆయన ఒక చిరస్మరణీయ ప్రతీక.

డాక్టర్ వైయ‌స్ఆర్ 77వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజా సేవ అనే విలువలను భావితరాలకు అందించాలని ప్రతి ఒక్కరూ సంకల్పించాల్సిన అవసరం ఉంది. మహానేత చూపిన మార్గం తెలుగు ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే నిలుస్తుంది. 

- యం.వి.ఎస్. నాగిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్  

Back to Top