చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి దేవాలయాలపై దాడులు

అనపర్తి ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

అనపర్తి: హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు ఆలయాలపైనే దాడులకు పాల్పడుతున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై వైయస్‌ఆర్‌సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గంలోని హిందూ దేవాలయాలు, సంప్రదాయాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

అనపర్తి కొత్తూరులో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించకుండా తూతూ మంత్రంగా ముగించారని, నిత్య ధూపదీప నైవేద్యాలు జరిగేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించారని పేర్కొన్నారు. అనపర్తి విష్ణాలయం, రామవరం ఆంజనేయస్వామి ఆలయ ప్రహారీ గోడ కూల్చివేత వ్యవహారాల్లోనూ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. కుతుకులూరు ఆంజనేయస్వామి ఆలయ నిధులకు సంబంధించిన అసలు, వడ్డీ మొత్తాలను వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేసిన తర్వాతే తిరిగి చెల్లించారని గుర్తు చేశారు.

ఇటీవల టీటీడీ కళ్యాణమండపానికి వెళ్లే మార్గంలో రావిచెట్టు వద్ద ఉన్న వినాయకుడి ఆలయానికి దాతల సహకారంతో నిర్మించిన రేకుల షెడ్డును పంచాయతీ సిబ్బందితో తొలగించడం అత్యంత దుర్మార్గమని సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. త్వరలో పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన షెడ్డును తొలగించడం ద్వారా ఎమ్మెల్యే భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు.

తన ఆరోపణలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నానని, నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే వ్యవహారాలపై మరిన్ని ఆధారాలతో ప్రజల ముందుకు వస్తానని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top