అనంతపురం: టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో తీవ్ర వ్యవసాయ సంక్షోభం నెలకొందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా వారిని ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా బకాయిలను ఇప్పటికీ విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులు పెట్టుబడులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్-నినో ప్రభావం కారణంగా వ్యవసాయ రంగంపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులను అప్రమత్తం చేయడం, అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ కుట్రలు తప్ప రైతుల సమస్యలు పట్టడం లేదని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. రైతు సంక్షేమాన్ని కాపాడాలంటే వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా బకాయిలను విడుదల చేయడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.