మదనపల్లె: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వైయస్ఆర్‌సీపీ ముందడుగు వేసింది. మదనపల్లెలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్‌రూమ్‌కు ఓటరు నమోదు, వివరాల సవరణ, మ్యాపింగ్ తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించిన నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. సబ్ కలెక్టర్ సూచన మేరకు మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో మండల తహసీల్దార్ మాధవితో కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఓటరు నమోదులో తలెత్తుతున్న ఇబ్బందులు, దరఖాస్తుల స్వీకరణ, మ్యాపింగ్ ప్రక్రియపై అధికారులతో సమగ్రంగా చర్చించి పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్. నిసార్ అహమద్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కోరారు. వార్‌రూమ్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమస్యలు పరిష్కారమవుతున్న తీరుపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్ రెడ్డి, ఫయాజ్, కొత్తపల్లి మహేశ్, బస్రీ, బయ్యారెడ్డి, మహబూబ్ భాషా, శంకర్ నాయక్, మస్తాన్, సలీం, రామకృష్ణారెడ్డి, వాసు, ఫయాజ్ ఖాన్, నవీద్ బాయమ్మతో పాటు బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.