అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం అంతులేని  దోపిడీ

‘మావిగన్’ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? 

కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి పేర్ని నాని సవాల్.

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని).

రాజధాని పేరుతో రైతుల ఎమోషనల్ బ్లాక్ మెయిల్

అభివృద్ధి పేరుతో అంతులేని అప్పుల కుప్ప

ప్రశ్నిస్తే సోషల్ మీడియా పై అణచివేత

ప్రభుత్వ తీరుపై పేర్ని నాని ఫైర్. 

వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కాస్తా ఏడు బిల్డింగుల మున్సిపాలిటీ అయింది

చంద్రబాబు కుట్రలను ఆధారాలతో సహా నిలదీసిన పేర్ని నాని.

‘మావిగన్’అభివృద్ధి అజెండా చూసి వణుకుతున్న కూటమి ప్రభుత్వం

స్పష్టీకరించిన మాజీ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: "అమరావతి రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అంతులేని అప్పులు, సాగిస్తున్న దోపిడీ, రైతుల పట్ల చూపిస్తున్న అరాచకాలపై వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అమరావతిని ఒక మోయలేని గుదిబండగా మార్చారని మండిపడ్డారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ‘మావిగన్’ పేరుతో అభివృద్ధి చేయాలన్న వైయస్ జగన్ విజన్‌ను చూసి చంద్రబాబుతో సహా 9 మంది మంత్రులు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి కథనాలు, రైతుల కన్నీళ్లు బయటకు రాకుండా ఉండేందుకు ‘మెటా’ వంటి అంతర్జాతీయ సంస్థలను లోబర్చుకుని సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. ఒకవైపు రాజధాని నిర్మాణ వ్యయం పేరుతో చదరపు అడుగుకు రూ.20 వేలు దోచుకుంటూ, మరోవైపు ప్రశ్నించిన కాపు, దళిత సామాజికవర్గాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో సిట్ అధికారులు పెద్ద డ్రామాలు ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పిటళ్లలో మందుల బడ్జెట్ తగ్గినా పట్టించుకోని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, కేవలం జగన్‌ను తిట్టడానికే పరిగెత్తుకొస్తున్నారని విమర్శిస్తూ.. అమరావతి ఆర్థిక భారం మరియు ‘మావిగన్’ అభివృద్ధిపై తాము సూటిగా అడిగిన ప్రశ్నలకు లెక్కలతో సమాధానం చెప్పే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా అని పేర్ని నాని బహిరంగ సవాల్ విసిరారు. 

ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... 

అమరావతి ఒక గుదిబండ – 'మావిగన్' తోనే ఆంధ్రప్రదేశ్ రక్షణ.

రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేస్తూ, ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అమరావతిని ఒక మోయలేని గుదిబండగా మార్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) ప్రాంతాలను కలుపుకుని అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుంది.ఇప్పటికే ఈ ప్రాంతంలో రెండు పెద్ద నగరాలు, అంతర్జాతీయ ప్రమాణాలున్న పోర్టు, రైల్వే కనెక్టివిటీ, జాతీయ రహదారులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, పవన కళ్యాణ్ సంతకాలు పెట్టి మరీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు ఎంత బోగస్సో... అమరావతి సెల్ఫ్ ఫైనాస్స్ ప్రాజెక్టు అన్న మీ మాటలు కూడా అంతే బోగస్. వీటికి సమాధానం చెప్పమంటే... ఎదురు దాడి చేస్తున్నారు. కేంద్రం చదరపు అడుగు రూ.4వేలకే కడతామని చెబుతుంటే... చంద్రబాబు మాత్రం రూ.20 వేలకే కడతామని చెబుతున్నారు. ఇది నీచం అనిపించడం లేదా? చంద్రబాబూ. ఉత్తరప్రదేశ్ తరహాలో మనది మిగులు రాష్ట్రం కూడా కాదు. మరోవైపు మావిగన్ పై విమర్శిస్తున్నారు. ఎలా మావిగన్ తప్పు అంటే సమాధానం చెప్పరు? అమరావతి ఏ విధంగా రాష్ట్రానికి ఆస్తి కాబోతుంది అంటే సమాధానం చెప్పరు. అమరావతిలో నీళ్లు తోడడానికి 17, 18 వేల క్యూసెక్కులు నీటిని తోడే సామర్ధ్యమున్న మోటార్లు పెడితే ఆ బిల్లు ఎవరు కడతారు.? పట్టిసీమకు కూడా అన్ని మోటార్లు లేవు. గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీరివ్వడానికి మీరు పెట్టిన మోటార్ల కెపాసిటీ కంటే అమరావతిలో వర్షపు నీరు తోడడానికి మీరు పెట్టి మోటార్ల కెపాసిటీ ఎక్కువ? ఎవరికి పండగ ఉంటే.. నీళ్లు తోడుకునే వారికి బాగుంది. 
భవిష్యత్తులో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు, ఖర్చులు అన్నీ ‘మావిగన్’ ప్రాంతంలోనే ఉంటాయని వైయస్ జగన్ స్పష్టం చేయగానే.. చంద్రబాబుతో సహా 9 మంది మంత్రులు ఉలిక్కిపడి బూతులు, శాపనార్థాలతో ప్రెస్ మీట్లు పెడుతున్నారు.

ప్రపంచ స్థాయి రాజధాని నుండి 'ఏడు బిల్డింగుల మున్సిపాలిటీ'గా..

ఒలింపిక్స్ నిర్వహిస్తామని, నవనగరాలు కడతామని నమ్మబలికిన చంద్రబాబు.. ఇవాళ అమరావతిని ఒక చిన్న మున్సిపాలిటీగా, కేవలం ఏడు బిల్డింగుల రాజధానిగా మార్చేశారు. 
2016లోనే స్లాబ్‌లు, గోడలు పూర్తయిన ఐఏఎస్ బంగ్లాలు, జడ్జీల నివాసాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు ఇప్పుడు టైల్స్, రంగులు వేసి 2028లో ప్రారంభిస్తామనడం హాస్యాస్పదం. విజయవాడలో కాపురం ఉంటున్న ఏ ఐఏఎస్ అధికారి లేదా ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబంతో అక్కడ నివసిస్తారో, కనీసం మంత్రులైనా ఉంటారో చెప్పాలి. 
కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.4 వేలు ఖర్చు పెడుతుంటే, చంద్రబాబు మాత్రం రూ.20 వేలు ఎందుకు తగలేస్తున్నారు. చంద్రబాబు తన సొంత హెరిటేజ్ ఆఫీసును చదరపు అడుగు ఎంత చొప్పున కట్టారో చెప్పగలరా?. కేవలం ఆఫీసులకే రూ.50 వేల కోట్లు ఖర్చు పెడితే మౌలిక సదుపాయాల సంగతేంటి.? 
భూమి విలువతోనే రాజధాని కడతామన్న మాటలు పచ్చి అబద్ధాలు. చంద్రబాబే స్వయంగా అక్కడ ఎకరం రూ.3.80 కోట్ల చొప్పున 5 ఎకరాలు కొన్నారు, అంటే ఎకరం విలువ రూ.4 కోట్లు కూడా లేనప్పుడు, మంత్రి నారాయణ ప్రభుత్వం దగ్గర ఉన్న  మిగిలిన 5 వేల ఎకరాలు అమ్మి తెచ్చిన అప్పులు ఎలా తీరుస్తారని లెక్కించారు. ప్రజలు లేని చోట 4 స్టార్ హోటళ్లు పెడితే బ్యాంకులు దివాళా తీయడం ఖాయం. 

సోషల్ మీడియాపై ఉక్కుపాదం – ‘మెటా’ సంస్థతో చంద్రబాబు కుమ్మక్కు?

అమరావతిలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని, భూములిచ్చిన రైతుల కన్నీళ్లను 29 గ్రామాలు దాటి బయటకు రాకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. 
చంద్రబాబు ప్రభుత్వంపై లేదా అమరావతి అవినీతిపై ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియో వచ్చినా.. ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చే తప్పుడు ఫిర్యాదుతో అమెరికన్ కంపెనీ 'మెటా' వెంటనే వాటిని తొలగిస్తోంది.మెటా సంస్థలో చంద్రబాబు మనుషులైనా ఉండాలి లేదా వారిని లోబరుచుకొని అయినా ఉండాలి. 
దేశ రక్షణ కోసం, తీవ్రవాదులపై ఉపయోగించే నిబంధనలను సాకుగా చూపిస్తూ సాక్ష్యాలు లేకుండా కథనాలను తొలగిస్తున్నారు,  ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు బనాయిస్తున్నారు.  లోకేష్ గ్యాంగ్‌లోని  అమరావతిలో వారికి సెంటు భూమి లేకపోయినా శ్మశానాలు, వాగుల సర్వే నెంబర్లలో రిటర్నబుల్ ప్లాట్లు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలి.

కాపులను మోసం చేస్తున్న పవన్ కళ్యాణ్ – ‘ప్రశ్న రావణ్’ కేసు ఒక కుట్ర.

కూటమి ప్రభుత్వంపై కాపు సామాజికవర్గానికి పూర్తిగా విసుగెత్తిపోయింది, జనసేన బలహీనపడటంతో మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ, జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు మోటివేటెడ్ డిజార్డర్స్ ఉన్నాయి, అప్పటికప్పుడు వేషాలు మారుస్తాడు. కాపులను కేవలం బకరాలను చేసి వాడుకుంటున్నాడు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ విషయంలో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలైన పిఠాపురం, కాకినాడ, బందరులలో వరుసగా కేసులు పెడుతూ వేధిస్తున్నారు.  బందరు ఇనకుదురు పోలీస్ స్టేషన్ పై రౌడీషీటర్లు, నర్సాపురం ఎమ్మెల్యే దొమ్మీగా దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు.? పవన్ కళ్యాణ్ సన్నిహితుడు హరిప్రసాద్‌కు బందరులో ఏం పని?. 

 వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం:
ఒక్క మంత్రి కూడా తన శాఖ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులకిచ్చే బడ్జెట్ తగ్గిందని వారి అనుకూల పత్రిక ఈనాడులో రాస్తే.. దానికి  వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కనీసం స్పందించడు. 
ప్రభుత్వ ఆసుపత్రిలో ఫేషెంట్లు పెరిగినప్పుడు సౌకర్యాలు, వైద్యులను, మందులను పెంచాలి. అది జరగకపోగా బడ్జెట్ తగ్గిస్తుంటే దానికి సమాధానం చెప్పడు.
అసలు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆసుపత్రులకు సందర్శనకు ఎప్పుడైనా వెళ్లాడా? 108 రాక రోగులు చనిపోయారంటే మాట్లాడడు. ఆసుపత్రిలో స్ట్రెచర్లు లేవన్నా, గిరిజనులను డోలీలు కట్టి మోసుకొస్తున్నారు ఏం చర్యలు తీసుకున్నారంటే దానిపై మాట్లాడని ఆరోగ్యశాఖ మంత్రి  ... వైయస్.జగన్ ని తిట్టడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. అసలు ఆయన భారతీయ జనతాపార్టీలో ఉన్నారా? లేక టీడీపీలో ఉన్నారో తెలియదు. బహుశా బీజేపీని హంద్రీనీవాలో కలిపేశారేమో అన్న సందేహం కలుగుతోంది.

‘ప్రశ్న రావణ్’ కేసు.. చంద్రబాబు తప్పుడు కుట్ర!

"యూట్యూబర్ ప్రశ్న రావణ్ విషయంలో కూటమి ప్రభుత్వం చట్టాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం, కాకినాడ, బందరులలో వరుసగా అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు. బందరు ఇనకుదురు పోలీస్ స్టేషన్ మీదకు రౌడీషీటర్లు దొమ్మీగా వస్తుంటే, పోలీసులు ఏం చేస్తున్నారు? కస్టడీలో ఉన్న ముద్దాయిపై దాడికి ప్రయత్నించిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? పవన్ కళ్యాణ్ స్కెచ్ మేరకే ఎమ్మెల్సీ హరిప్రసాద్, నర్సాపురం ఎమ్మెల్యే బందరులో క్యాంప్ వేశారు. ఒకే నేరానికి పలు స్టేషన్లలో కేసులు కట్టడం ఎంతవరకు సరైన చర్య?"

సాయికృష్ణ లాకప్ డెత్.. అంతా పెద్ద డ్రామా!.

"రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విచ్చలవిడిగా మారింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ డాబా మీద సాయికృష్ణ శవాన్ని కాల్చేశారని, అక్కడ ఎముకలు దొరికాయని సిట్ అధికారులు పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. పోలీస్ స్టేషన్ పైన శవాన్ని ఓపెన్‌గా కాలిస్తే చుట్టుపక్కల జనానికి వాసన రాదా? కేవలం హైకోర్టులోని హెబియస్ కార్పస్ పిటిషన్‌ను క్లోజ్ చేయడానికే ఈ కట్టుకథలు అల్లారు. ఈ కుట్రలో కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ), టాస్క్ ఫోర్స్ పాత్రపై సిట్ ఎందుకు విచారణ చేయడం లేదు? ఇద్దరిని చంపేసిన సీఐ నాగరాజే ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందని భయపడుతున్నాడంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతోంది."

మత్స్యకారుల నిర్లక్ష్యం.. ఆయిల్ మాఫియా దోపిడీ..

"రాష్ట్రంలో ప్రభుత్వం చేయదగిన పనులు చాలా ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకునే నాథుడే లేడు. పోర్టుల నిర్మాణం ఎందుకు వేగంగా ముందుకు సాగడం లేదు? బేరాలు కుదరక వాటిని వదిలేశారా? ఎంతమంది గంగపుత్రులకు మత్స్యకార భరోసా నిలిచిపోయిందో ప్రభుత్వానికి తెలుసా? మంత్రి కొల్లి రవీంద్ర పెద్ద ఆయిల్ డాన్. నిజాంపట్నం, కావలి, బందరు ప్రాంతాల్లో దొంగ డీజిల్ అమ్ముకుంటూ సేల్ టాక్స్, జీఎస్టీకి భారీగా గండి కొడుతున్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు."

చంద్రబాబు గారూ.. మీ మూలంగానే రాష్ట్రం చెడిపోతోంది..

నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే రావణ్ రిపీట్ చేస్తే.. ఇద్దరికీ చెరో చట్టం ఉంటుందా? పెద్దాపురంలో ఒక వికలాంగురాలిపై అత్యాచారం జరిగితే స్పందించని అధికారులు, సోషల్ మీడియాలో మాట్లాడారనే కారణంతో గంటల వ్యవధిలో హైదరాబాద్ వెళ్లి రావణ్‌ను అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, తప్పుడు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబే పూర్తి బాధ్యుడు. లాకప్ డెత్స్ జరుగుతున్నా హోంమంత్రి నోరు మెదపకపోవడం దారుణం. ఇకనైనా సీఎస్  దీనిపై దృష్టి సారించాలి. అమరావతి, మావిగన్ అభివృద్ధిపై మేము ఎప్పుడైనా చర్చకు సిద్ధం.. చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే ముందుకు రావాలని పేర్ని నాని  సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, శాంతిభద్రతల విఫలతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ముమ్మాటికీ బాధ్యుడని ఆయన తేల్చి చెప్పారు.

Back to Top