కృష్ణమ్మనూ కొల్లగొడుతున్న పచ్చ మాఫియా

పుత్తా శివశంకర్‌ ఫైర్‌

యథేచ్ఛగా నదీగర్భం నుంచి ఇసుక దోపిడి

పర్యావరణం, ప్రజల ప్రాణాలతో చెలగాటం

పుత్తా శివశంకర్‌ ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌

కూటమి పాలనలో ఏదీ వదలకుండా అంతా దోపిడి

గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక సరఫరా

మంగళం పాడిన కూటమి ప్రభుత్వం. ఇప్పుడంతా మాఫియా

సుప్రీంకోర్టు ఆదేశాలు. ఎన్జీటీ నిబంధనల ఉల్లంఘన

8 నుంచి 10 మీటర్ల లోతు వరకు అక్రమ తవ్వకాలు

సీఎం నివాసానికి సమీపంలోనే యంత్రాలతో తవ్వకం

అయినా పట్టించుకోని చంద్రబాబు  కూటమి ప్రభుత్వం

కృష్ణా నది స్వరూపం మారే ప్రమాదం. పర్యావరణానికి ముప్పు

తక్షణమే అక్కడ ఇసుక తవ్వకాలన్నీ పూర్తిగా నిలిపివేయాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన పుత్తా శివశంకర్‌

తాడేపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తూ, చివరకు కృష్ణా నదిని, పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ మండిపడ్డారు. నాడు వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు ఉచిత ఇసుక అందించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చగా, ప్రస్తుతం  కూటమి నేతలు సహజ వనరులను దోచుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆయన  విమర్శించారు. సుప్రీంకోర్టు, ఎన్‌జీటీ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ కృష్ణా నదిలో భారీ యంత్రాలతో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్‌ ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

నాడు పేదలకు ఉచిత ఇసుక.. ప్రభుత్వానికి ఆదాయం:
    వైయస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వమే ఇసుక రీచ్‌లను నిర్వహించి పేదలకు ఉచితంగా ఇసుక అందించినా, రీచ్‌ల ద్వారా  ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరింది. కాగా, ఇప్పుడు ఉచిత ఇసుక లేకపోగా, ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడం లేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్‌జీటీ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ఒక మీటరుకు బదులుగా 8 మీటర్ల నుంచి 10 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

నదీ స్వరూపమే మారేలా..:
    కృష్ణా నది పక్కనే సీఎం నివాసం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. దీని వల్ల నది స్వరూపం పూర్తిగా మారిపోతుంది. దాంతో వరదల ముప్పు పెరుగుతుంది. ఇంకా మత్స్యసంపద, భూగర్భ జలాలు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఉచిత ఇసుక పేరుతో కూటమి నేతలు పక్క రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.

ఎన్జీటీ విచారణ చేస్తే భారీ మూల్యం తప్పదు:
    2014–19లో అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటి పరిస్థితులపై ఎన్జీటీ విచారణ జరిపితే మరింత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇకనైనా వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలు పూర్తిగా అరికట్టాలి. లేకపోతే ప్రజలే ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని పుత్తా శివశంకర్‌ స్పష్టం చేశారు.

Back to Top