మావిగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది

అమరావతి రైతులకు వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు.. 

వైయ‌స్ఆర్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు

గుంటూరు: మావిగన్ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) ప్రతిపాదనపై టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు ఆరోపించారు. మావిగన్ పరిధిలోనే అమరావతి కూడా భాగమని, అయినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో తొలి విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తి న్యాయం జరగలేదని, అలాంటి పరిస్థితుల్లో రెండో విడత భూ సమీకరణను చేపట్టడాన్ని వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయకుండా కొత్తగా భూములు తీసుకోవడం సమంజసం కాదన్నారు.

పెనుమాక రైతుల పిలుపు మేరకే తాము వెళ్లామని, అక్కడ తమపై దాడి చేసి తిరిగి తప్పును వైయ‌స్ఆర్‌సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మద్దతుదారులు ఉన్నారని, అక్కడి రైతులకు అన్యాయం జరుగుతోందని వారు కోరడంతోనే తమ పార్టీ స్పందించిందని చెప్పారు. అమరావతి నిర్మాణంలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపడమే వైయ‌స్ఆర్‌సీపీ విధానమని, అమరావతి రైతులకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించలేదని వనమా బాల వజ్రబాబు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి భారీగా ప్రజాధనం వెచ్చించాల్సి వస్తుందని, అదే సమయంలో మావిగన్ ప్రాంతాన్ని తక్కువ వ్యయంతో, ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను వినియోగించుకుంటూ వేగంగా అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజాధనాన్ని ఆదా చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మార్గమే మావిగన్ ప్రతిపాదన అని అన్నారు.
 

Back to Top