అరకు: నియోజకవర్గంలోని ముంచంగిపుట్టు మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఘనంగా ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు పార్కు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విగ్రహం గిరిజన యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల ఆత్మగౌరవానికి, హక్కులకు ప్రతీక అని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, పోడు భూముల పరిరక్షణ కోసం, అడవి బిడ్డల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహా యోధుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు మండలం ఎంపీపీ అరిసెల సీతమ్మ, జేసీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ అరబీర జగబంధు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మరావు, సుజనకోట ఎంపీటీసీ సభ్యురాలు మజ్జి సుబ్బలక్ష్మి, జోలాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు బి. కమల, పెద్దగూడ ఎంపీటీసీ సభ్యుడు టి. గణపతి, ఏనుగురై మాజీ సర్పంచ్ నర్సింగరావు, జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు కే. జయదేవ్, పంచాయతీ అధ్యక్షుడు దశరథ్, మండల కార్యదర్శి ముఖి రాంప్రసాద్, ఆర్టీఐ అధ్యక్షుడు అర్జున్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు సాధురం, దామోదర్, కోడా సాదూరం, కోర్ర రామకృష్ణ, పాంగి చంద్రరావు, శోభ, రాంబాబు, సమరెడ్డి జలంధర్, బైరాగి, విజయ్ కుమార్, మట్టం రాజేంద్రప్రసాద్, బొడ్నైక్ బుద్ధ, దాసు, సన్యాసిరావు, పాపారావు, సింహాద్రి, గణపతి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.