పాతపట్నం: విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని, అధికారంలోకి రాకముందు సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చిన ప్రభుత్వం నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు కూడా అందించలేని దుస్థితికి తీసుకెళ్లిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. పాతపట్నం మండలంలోని వైయస్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లు, బీఎల్‌ఏ (BLA) ఇన్‌ఛార్జ్‌లతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాకముందు సంక్షేమ పాలన అంటూ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు అందకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు లేక వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో స్కూళ్లు ప్రారంభమైన తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు వంటి అన్ని అవసరమైన వస్తువులు విద్యార్థులకు సకాలంలో అందేవని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై ఇంతకాలమైనా విద్యార్థులకు కనీస వసతులు కూడా అందించలేక కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రచారాలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి వెంటనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు పంపిణీ చేసి వారి విద్యాభవిష్యత్తును కాపాడాలని రెడ్డి శాంతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.