కనిగిరి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ చేసిన వ్యాఖ్యలు అత్యంత సంస్కారహీనమైనవని కనిగిరి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ గారు తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నానాజీ చేసిన అసభ్య, అవమానకర, విద్వేషపూరిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ శ్రీనివాసుల రెడ్డికి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మరణాలు, లాకప్ డెత్‌లు, పోలీసుల వేధింపులు, తప్పుడు కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల దర్శకత్వంలో కూటమి నేతలు రాజకీయ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నానాజీ భాష పూర్తిగా దిగజారుడు స్థాయిలో ఉందని, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నానాజీకి లేదన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనను జెడ్పీటీసీగా, అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిదేనని పేర్కొన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే కనిగిరి నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలని నానాజీకి బహిరంగ సవాల్ విసిరారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై నోటికొచ్చినట్లు మాట్లాడిన ఎమ్మెల్యే నానాజీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.