నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడిన ఆయన, పొగాకు ధరలు పడిపోవడం, అధికంగా తిరస్కరణలు జరుగుతుండటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం పరిస్థితిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, అనవసర తిరస్కరణలను నిలిపివేసి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు పంటపై ఆధారపడిన వేలాది రైతు కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరిన ఆయన, రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైయస్ఆర్‌సీపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.