అనంతపురం: ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాలలో మహిళా వైద్య విద్యార్థినులపై వేధింపులు జరిగాయంటూ వెలువడిన వార్తలపై వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ నిర్వహించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ నాగభూషణంకు వినతిపత్రం సమర్పించింది. అనంతపురంలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ, మహిళా విద్యార్థినుల భద్రతను నిర్ధారించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యాసంస్థల్లో విద్యార్థినులు భయాందోళనలు లేకుండా చదువుకునే వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. పత్రికల్లో వెలువడిన ఆరోపణలు అత్యంత తీవ్ర స్వభావం కలిగినవని, ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా స్వతంత్రంగా విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినులకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు, కళాశాల, ఆసుపత్రి, హాస్టళ్లలో మహిళల భద్రతను బలోపేతం చేసే ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. మహిళల రక్షణ, విద్యాసంస్థల్లో భద్రత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో కనిపించడం లేదని విమర్శించిన చంద్రశేఖర్ యాదవ్, ప్రతి విద్యాసంస్థలో సమర్థవంతమైన భద్రతా వ్యవస్థ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు కైలాష్, నగర ప్రధాన కార్యదర్శులు శేఖర్, సాయి చరణ్, హరీష్, బబ్లు, చరణ్, రఫీ, ఫయాజ్, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.