కడప: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో దుర్మరణం చెందిన కడపకు చెందిన ముడియం శ్రీధర్ మృతిపై మాజీ ఉప ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన శ్రీధర్ భౌతికకాయం కడపకు చేరుకున్న సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కడప నగరంలోని ఓంశాంతి నగర్‌లోని శ్రీధర్ నివాసానికి చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రమాదంలో శ్రీధర్ అకాల మరణం అత్యంత విషాదకరమని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఈ సందర్భంగా శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అంజాద్ బాషా, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలిపారు. ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, ఓబుల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితర వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొని శ్రీధర్‌కు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.