తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి జూలై 14న ఆమోదించిన 134వ తీర్మానంపై స్వతంత్ర విచారణ జరపాలని.. మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి కుట్రను బయట పెట్టాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ పరిధిలోని బర్డ్స్, స్విమ్స్, పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్స పరికరాల కొనుగోళ్లలో అమలులో ఉన్న అర్హత నిబంధనలను నారా లోకేష్ ఒత్తిడితో పాలక మండలి సడలించి, భారీ అవినీతికి తలుపులు తెరిచారని ఆయన ధ్వజమెత్తారు. తనకు అనుకూలమైన వ్యాపారవేత్తలకు టెండర్ల కట్టబెట్టేందుకు వీలుగా నియమ, నిబంధనల్లో అడ్డగోలు మార్పులు చేశారని ఆక్షేపించారు. నాణ్యమైన మందులు, ఇంజెక్షన్లు, వైద్య వినియోగ పరికరాలు, వస్తువుల సరఫరాకు టెండర్లలో పాల్గొనాలంటే ఇప్పటివరకు కనీస రూ.100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే అర్హత ఉండేదని, కానీ దాన్ని ఇప్పుడు రూ.25 కోట్లకు తగ్గించారని, ఇంకా కొన్ని విభాగాల్లో రూ.15 కోట్ల టర్నోవర్ సరిపోతుందని నిర్ణయించడం వెనక భారీ అవినీతి కుట్ర దాగి ఉందని తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ఏమిటి ఆ అజ్ఞాత కమిటీ?: మందులు సరఫరా చేసే సంస్థల టర్నోవర్ నిబంధనల సడలింపునకు సంబధించి ఒక అజ్ఞాత కమిటీ సిఫారసు చేసిందని టీటీడీ పెద్దలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అసలు ఏమిటా అజ్ఞాత కమిటీ? నిజానికి ఆ అజ్ఞాత కమిటీ కాస్త.. అజ్జాన కమిటీగా మారి అవినీతికి బాటలు వేసిన కమిటీగా రూపాంతం చెందింది. బర్డ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ నేతృత్వంలోని ఆ అజ్ఞాత కమిటీ సిఫారసుల వెనుక భారీ అవినీతి కుట్ర దాగి ఉంది. అదే డాక్టర్ జగదీష్‌ను స్విమ్స్, చిన్నపిల్లల ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలకు కూడా నియమించడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. టీటీడీ సభ్యురాలిగా ఉన్న ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థ యాజమాన్య ప్రతినిధి ఆ అజ్ఞాత కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, నారా లోకేష్ ఆదేశాల పేరుతో ఆమె అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తీర్మానాన్ని ఆమోదించారు. నాణ్యతను కాపాడాల్సిన టీటీడీ ఇప్పుడు నిబంధనలను తుంగలోకి తొక్కి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే నాణ్యమైన మందుల కొనుగోళ్లలో టర్నోవర్ అర్హతను ఒక్కసారిగా రూ.100 కోట్ల నుంచి రూ.25 కోట్లకు తగ్గించడం వెనుక స్పష్టమైన అవినీతి ఉద్దేశమే కనిపిస్తోంది. నాసిరకం మందులు, వైద్య సామగ్రి సరఫరా చేసే సంస్థలకు అవకాశం కల్పించి కమిషన్లు దండుకోవడమే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం. తక్కువ ధరకు కొని.. ఎక్కువ ధరకు టీటీడీకి: దేశంలోని ఎయిమ్స్ వంటి అగ్రశ్రేణి వైద్య సంస్థలు మందుల కొనుగోలులో కఠినమైన ప్రమాణాలు పాటిస్తున్నాయి. అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యంత కీలక రంగంలో ఈ స్థాయి సడలింపులు ఎందుకు అవసరమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంకా ఇప్పటికే బర్డ్స్, స్విమ్స్ ఆస్పత్రుల్లో భారీ వైద్య పరికరాల కొనుగోళ్లలో కూడా ఎల్–1 టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. తయారీ సంస్థల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి, టీటీడీకి అధిక ధరలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి: రాష్ట్ర ప్రజలకు ప్రాణాధారమైన స్విమ్స్, దేశంలోనే ప్రముఖ ఎముకల ఆసుపత్రిగా గుర్తింపు పొందిన బర్డ్స్, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రుల వంటి సంస్థల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అవినీతికి ఆస్కారం కలిగించేలా టీటీడీ నిర్ణయం తీసుకోవడం అత్యంత దురదృష్టకరం. అందుకే టీటీడీ పాలక మండలి ఆమోదించిన 134వ తీర్మానంపై కూటమి ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరిపి, ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కుట్రను బయటపెట్టాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు వీలుగా సడలింపులుకు బాధ్యులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.