కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పరాకాష్ట 

డియస్సీ స్కామ్ నుండి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు కుటిల యుక్తులు

అందులో భాగంగానే వైయ‌స్ఆర్‌సీపీ  నేతలపై అర్ధరాత్రి దాడులు, అక్రమ అరెస్టులు

ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ విబాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర్ బాబు.

డిస్సీ స్కామ్ లో లోకేష్‌ను కాపాడేందుకే కూటమి చంద్రబాబు అరాచక పర్వం

వైయ‌స్ఆర్‌సీపీ  ప్రజాప్రతినిధులపై దాడులు, అర్ధరాత్రి అక్రమ అరెస్టులు

బీసీ, ఎస్సీ, మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై పోలీసుల దాడి అమానుషం

కర్నూలు జిల్లాలో దళిత తల్లి మాల గంగమ్మ లాకప్ డెత్

ఆముదాలవలస ఘటనలో లేని వారిపై అక్రమ కేసులు

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు

స్పష్టం చేసిన టీ జే ఆర్ సుధాకర్ బాబు 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత కొడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రధాన పాత్రధారిగా వెలుగుచూసిన భారీ డిఎస్సీ స్కామ్ నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాష్ట్రంలో తీవ్రస్థాయి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన డిఎస్సీ ఉద్యోగాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలు, దొంగ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రజలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిలదీస్తుండటంతో, లోకేష్‌ను రక్షించుకునేందుకు చంద్రబాబు తీవ్ర కుయుక్తులకు పాల్పడుతున్నారని తేల్చి చెప్పారు. 
ఇందులో భాగంగానే ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బలహీన వర్గాలు (బీసీ), ఎస్సీ, మైనార్టీ ప్రజాప్రతినిధులను, మాజీ మంత్రులను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో తలుపులు బద్దలు కొట్టి ఉగ్రవాదుల తరహాలో అరెస్టులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి చేయించి, తిరిగి ఆ పార్టీ నేతలపైనే అక్రమ సెక్షన్లతో అబద్ధపు ఎఫ్‌ఐఆర్‌లు బనాయిస్తోందని, ఘటన జరిగే ప్రాంతాల్లో లేని లాయర్లు, ప్రైవేటు ఉద్యోగులను కూడా కేసుల్లో ఇరికిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిస్సిగ్గుగా అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..

ఉగ్రవాదిలా ఆలూరు ఎమ్మెల్యే అరెస్ట్ – టీడీపీ కక్షసాధింపు చర్యలు.

ఆలూరు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, కురుబ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షి ఇళ్ల తలుపులను అర్ధరాత్రి సమయంలో పగలగొట్టి, ఏదో తీవ్రవాదినో, ఉగ్రవాదినో అరెస్ట్ చేయడానికి వెళ్లినట్లుగా పోలీసులు వ్యవహరించారు.
నేమకల్లు (చిప్పగిరి మండలం) లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను టీడీపీ మూకలు బంధించి కొడుతుంటే, ప్రాణభయంతో ఆ కార్యకర్త వీడియో కాల్ చేసి ఎమ్మెల్యేను రక్షించమని వేడుకున్నాడు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే అక్కడికి వెళ్తే, పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.
అంతేకాకుండా, చంద్రబాబు డైవర్షన్ పొలిటికల్ డ్రామాలో భాగంగా నాగరాజు అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపి వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై నిందలు వేసేందుకు యత్నించాడు. ప్రత్యక్ష విజువల్స్ సాక్ష్యంగా ఉన్నప్పటికీ, బాధ్యతారహితంగా మంత్రులు వచ్చి ఈ అక్రమ చర్యలను సమర్థించుకోవడం సిగ్గుచేటు.

మూడు ప్రాంతాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ ప్రజాప్రతినిధులే టార్గెట్..

చంద్రబాబు ప్రభుత్వం ఒకే సందర్భంలో మూడు ప్రాంతాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, మైనార్టీ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసింది.  రాయలసీమయల కురుమ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ అరెస్ట్, ఉత్తరాంధ్రయల మత్స్యకార (బీసీ) సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, అలాగే చింతాడ రవికుమార్‌లపై తప్పుడు కేసులు నమోదు, మధ్యాంధ్ర లో మూడుసార్లు గెలిచిన మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా, ఆయన కుమారుడిపై అక్రమ కేసులు బనాయించింది.
ప్రజాప్రతినిధులుగా ఎదిగిన బలహీన వర్గాల నాయకులను రాజకీయాల్లో ఉండటానికి అర్హులుగా చంద్రబాబు చూడటం లేదు. తన సుపుత్రుడిని డిఎస్సీ స్కామ్ నుండి రక్షించుకునే పన్నాగమే ఇది.

కర్నూలులో పోలీసుల లాకప్ డెత్ దారుణం – మాల గంగమ్మ కేసు..

కర్నూలు జిల్లాలో మందులు పిచికారీకి వెళ్లిన కొడుకు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన 'మాల గంగమ్మ' అనే దళిత తల్లిని పోలీసులు విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్‌కు గురిచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వేసిన సిట్ అధికారులు, బాధితురాలినే నేరం ఒప్పుకోమని కొట్టి చంపేశారు. అనంతరం నిజాలు బయటకు రాకుండా పోస్టుమార్టం కూడా చేయించకుండా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆమె మృతదేహాన్ని సమాధి చేశారు. నిజనిర్ధారణకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలను బాధితులను కలవనీయకుండా అడ్డుకున్నారు. 

లేనివారిపై కేసులు... తప్పుడు ఎఫ్ఐఆర్‌లు..

ఆముదాలవలస నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌పై నమోదైన ఎఫ్ ఐ ఆర్ (No. 117/2026) కేవలం అబద్ధాల పుట్ట. ఈ కేసులో A-8 (ధనేటి రామ్మోహన్ రావు), ఈయన న్యాయవాది. సంఘటన జరిగిన సమయంలో కోర్టు విచారణలో ఉన్నారు.
A-9 (తేజేశ్వరరావు).. సంఘటన జరిగిన రోజు తన కుమార్తెను యూనివర్సిటీలో చేర్పించడానికి పంజాబ్‌లో ఉన్నారు (రైలు టికెట్లు, గూగుల్ లొకేషన్ ఆధారాలు ఉన్నాయి). ఎన్.సురేష్ డాక్యుమెంట్ రైటర్ అయిన ఈయన ఆ సమయమంతా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనే ఉన్నారు. ఘటనా స్థలంలో లేని అమాయకులపై కేసులు బనాయించి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కొందరు అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రతి అధికారి చర్యల రికార్డులు భద్రంగా ఉన్నాయి.

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్లివే...: 

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట జరిపిన పోలీసు దాడిపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలి. పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను కోర్టు పర్యవేక్షణలో భద్రపరచాలి.  మాల గంగమ్మ అక్రమ నిర్బంధం, చిత్రహింసలు మరియు లాకప్ మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపి, సంబంధిత సిట్ అధికారులు, ఎస్పీ, డిఐజీలపై కేసులు నమోదు చేయాలి.  గుంటూరులో మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా కుమారుడిపై పెట్టిన తప్పుడు కేసులను నిష్పక్షపాతంగా సమీక్షించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై బాధితుడు మాదాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలి. ఆముదాలవలస ఘటనలో ఘటనా స్థలంలో లేని అమాయకులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.

కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక... :

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని...  మరో 700 రోజుల్లో (రెండు సంవత్సరాల్లో) వైఎస్. జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయమని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి అక్రమానికి, బనాయించిన ప్రతి తప్పుడు కేసుకు చట్ట ప్రకారం సమాధానం చెప్పాల్సిందేనని... ఎన్ని తలుపులు బద్దలు కొట్టినా, ఎన్ని తలలు పగలగొట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితుల వైపు నిలబడి పోరాటం కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు.

Back to Top