సీతంపేట: జీవో నెం.3ను తక్షణమే పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, జీవో నెం.26ను రద్దు చేసి గిరిజనుల భూములు, హక్కులు, ఉపాధి, విద్య, జీవన హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో గిరిజన సంఘాలు చేపట్టిన 'ఛలో సీతంపేట' కార్యక్రమంలో పాలకొండ మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. అనంతరం గిరిజన సంఘాల నాయకులు, ప్రజలతో కలిసి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్‌కు వినతిపత్రం అందజేశారు. జీవో-3 పునరుద్ధరణే గిరిజన యువత భవిష్యత్తుకు భరోసా ఈ సందర్భంగా విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జీవో నెం.3 అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జీవో-3ను వెంటనే పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని అమలు చేసి గిరిజనుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలకు రాజ్యాంగ పరిరక్షణలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. జీవో-3పై వాస్తవాలను ప్రజలకు చెప్పాలి జీవో-3 విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన కళావతి, 2020లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానం చేసి రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. రివ్యూ పిటిషన్ వేయలేదంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని విమర్శించారు. గిరిజన యువత ఉద్యమాలను రాజకీయ రంగు పులమడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. గిరిజన హక్కులకు భంగం కలిగితే ఉద్యమాలు ఉధృతం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు, స్థానిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు, పోడు భూములకు పట్టాలు, గిరిజన సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన విషయాలను ప్రస్తావించిన కళావతి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టి జీవో-3ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులను కాలరాస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు.