రాష్ట్రంలో "క్యాష్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"

డబ్బులు ఇవ్వకపోతే ఏ కంపెనీ రాష్ట్రంలో నిలవలేదు

పారిశ్రామిక‌వేత్త‌ల‌కు నారా లోకేష్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ డిమాండ్ 

వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌

లంచాలు ఇవ్వ‌లేక‌నే టాటా పవర్  ఒడిశాకు వెళ్లిపోయింది 

వీడిన 6 కంపెనీల వ‌ల్ల రూ. 12 వేల కోట్ల పెట్టుబ‌డులు వెన‌క్కి  

రెండేళ్ల‌లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు.. ప‌చ్చి అబ‌ద్ధం

కేంద్ర ప్ర‌భుత్వ సమాచారం ప్రకారం వెలుగులోకి వాస్త‌వాలు 

రెండేళ్ల‌లో వ‌చ్చినవి 10 ప్రాజెక్టులు పూర్త‌యిన‌వి రెండు

త‌ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.6,500 కోట్లు మాత్రమే

వివ‌రాలు వెల్ల‌డించిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

తాడేపల్లి: రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం లేదని, టాటా పవర్ సహా పలు ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ను విడిచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం ఇందుకు నిదర్శనమని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం "స్పీడ్ ఆఫ్ డూయింగ్" అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వాస్తవానికి రాష్ట్రంలో "క్యాష్ ఆఫ్ డూయింగ్" మాత్రమే నడుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డబ్బులు ఇవ్వకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా రాష్ట్రంలో నిలవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. టాటా పవర్ రూ.6,675 కోట్ల పెట్టుబడితో రావాల్సి ఉండగా ఒడిశాకు వెళ్లిపోయిందని, ఇదే విధంగా హిందుస్తాన్ కోకాకోలా బేవరేజెస్, అజాద్ ఇండియా మొబిలిటీ, జిన్ఫా, జూపిటర్ రిన్యూవబుల్స్ వంటి పలు సంస్థలు కూడా రాష్ట్రాన్ని వీడాయని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. కేంద్ర సమాచారం ప్రకారం ప్రతిపాదించిన 10 ప్రాజెక్టుల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయని, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.6,500 కోట్లు మాత్రమేనని తెలిపారు. పరిశ్రమలు ఎందుకు రాష్ట్రాన్ని విడిచి వెళ్తున్నాయో తెలుసుకునేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

పారిశ్రామిక వేత్తలను భయపెట్టి త‌రిమేస్తున్నారు

రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని సకల శాఖల మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప, వాస్తవంలో వేల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. డబ్బులు ఇస్తేనే కంపెనీలు పెట్టనిస్తాం, లేకపోతే బయటకు పంపించేస్తాం అనే రీతిలో ఇండస్ట్రియల్, సకల శాఖ మంత్రులు వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు 'ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో' అని పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. 

రాష్ట్రాన్ని వీడి వెళ్లిన ప్రధాన పరిశ్రమలు 
(రూ. 12,890 కోట్ల పెట్టుబడులు ఆవిరి)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనుమతులు పొంది, గ్రౌండ్ అయ్యే దశకు వచ్చిన సుమారు 6 ప్రముఖ కంపెనీలు ఈ ప్రభుత్వ వేధింపులు, లంచాల డిమాండ్ భరించలేక వెళ్లిపోయాయి. వాటి ద్వారా రూ. 12,890 కోట్ల పెట్టుబడులు వెన‌క్కి వెళ్లిపోయాయ‌. 

టాటా పవర్: నెల్లూరు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో జీవోలు ఇచ్చి ప్రోత్సహిస్తే, రూ. 6,675 కోట్ల పెట్టుబడితో రావలసిన టాటా కంపెనీ ఈ రోజు 'మేము ఏపీలో ఫ్యాక్టరీ పెట్టలేము' అని ఒడిశాకు తరలిపోయింది. 

హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ : అనకాపల్లి జిల్లా రాంపల్లిలో రూ. 1,200 కోట్ల పెట్టుబడితో పెట్టాల్సిన ఈ కంపెనీ, కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక ల్యాండ్ అలాట్‌మెంట్ వద్దంటూ వైదొలిగింది. 

ఆజాద్ ఇండియా మొబిలిటీ: శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 1,046 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించాల్సిన ఈవీ ఎలక్ట్రికల్ వాహనాల కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది.

జిన్ఫా డిఫెన్స్ ప్రాజెక్ట్ : అనంతపురం జిల్లా తిమ్మాపురంలో ల్యాండ్ అలాట్‌మెంట్ పొంది, ఈడీఎమ్ డిపాజిట్ చేసినా రూ. 1,150 కోట్ల ప్రాజెక్టును తమిళనాడుకు తరలించుకుపోయింది. 

జుపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్: అనకాపల్లి జిల్లాలో రూ. 2,700 కోట్ల పెట్టుబడి, 3,000 మందికి ఉపాధితో రావలసిన సంస్థ జీవో 38 ద్వారా రద్దు చేసుకుని వెళ్ళిపోయింది. 
ఇండియన్ సెమీకండక్టర్స్, అదానీ మొబిలిటీస్, ఐలాట్ హెల్త్ సొల్యూషన్స్ వంటి సంస్థలు కూడా ఏపీ నుంచి పారిపోతున్నాయి. 

కేంద్ర నివేదికతో బయటపడిన అబద్ధాల గుట్టు 

రెండు సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని డబ్బా కొట్టుకుంటున్నారు. లోక్‌సభలో మా ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానమే వీళ్ల అబద్ధాలను బట్టబయలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నివేదిక డీపీఐఐటీ ప్రకారం ఈ రెండేళ్లలో గ్రౌండ్ అయిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు కేవ‌లం 10. అందులో పూర్తయినవి కేవలం 2 మాత్ర‌మే. వచ్చిన మొత్తం పెట్టుబడి రూ. 6,500 కోట్లు మాత్రమే. వచ్చిన ఉద్యోగాలు కూడా కేవలం 22,167. మరి 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అని పచ్చ మీడియా ద్వారా చెప్తున్న లెక్కలు ఎక్కడివి?  చంద్రబాబు లెక్కలు తప్పా? లేక కేంద్ర ప్రభుత్వ నివేదిక తప్పా? ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. 

నారా లోకేష్ క్ష‌మాప‌ణ‌లు చెప్పరా? 

లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి, లక్షల ఉద్యోగాలు వస్తే రాష్ట్రంలో స్టేట్ జీఎస్టీ 5 శాతం ఎందుకు తగ్గింది? ఆర్థిక లావాదేవీలు, ఉపాధి పెరుగుతున్నప్పుడు జీఎస్టీ పెరగాలి గానీ ఎందుకు పడిపోతుందో సకల శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ వెళ్లిపోతే వైఎస్సార్సీపీ కారణమని, రాష్ట్ర ప్రజలంతా క్షమాపణ చెప్పాలని లోకేష్ మాట్లాడుతున్నారు. అమర్ రాజా కంపెనీలో లెడ్ శాతం గాలిలోనూ, భూమిలోనూ ప్రమాదకర స్థాయిలో ఉందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కేంద్ర సంస్థ ఈపీటీఆర్ ఉమ్మడి నివేదిక ఇచ్చాయి. కార్మికుల బ్లడ్ శాంపుల్స్‌లో కూడా ఇది తేలడంతో హైకోర్టు ఆదేశాల మేరకే నిబంధనలు అమలు చేశాం. కోర్టు తీర్పును గౌరవించకుండా వారు వేరే రాష్ట్రానికి వెళ్తే వైఎస్సార్సీపీని నిందిస్తారా? మరి ఈ రోజు మీ 'క్యాష్ ఆఫ్ డూయింగ్' అవినీతి వల్ల రూ. 12,890 కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతుంటే, దానికి లోకేష్ పారిశ్రామిక వేత్తలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతారా? 

కంపెనీలు త‌ర‌లిపోవ‌డంపై విచారణ జ‌ర‌గాలి

పరిశ్రమల పెట్టుబడులపై ప్ర‌భుత్వం వాస్త‌వాలు చెప్పాలి. గత రెండేళ్లలో ఎన్ని ఎంఓయూలు చేసుకున్నారు? వాటి విలువ ఎంత? ఎంత పెట్టుబడి గ్రౌండ్ అయింది? రద్దయిన పరిశ్రమలెన్ని? పోయిన ఉద్యోగాలెన్ని? అనే వివరాలను నిజాయితీగా ప్ర‌జ‌ల ముందు పెట్టాలి. రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న కంపెనీల యజమానులను పిలిచి ఒక స్వతంత్ర కమిటీ ద్వారా విచారణ జరిపితే, ఈ ప్రభుత్వ అవినీతి, 'క్యాష్ ఆఫ్ డూయింగ్' అసలు స్వరూపం బయటపడుతుందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు.

Back to Top