కేంద్రమంత్రి పెమ్మసాని డైరెక్షన్‌లోనే ముస్త‌ఫాపై కక్ష సాధింపు చర్యలు 

అంబటి రాంబాబు ధ్వజం 

గుంటూరు వైయ‌స్ఆర్‌సీపీ  కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు. 

అక్రమ కేసులతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై టిడిపి ప్రభుత్వం వేధింపు 

వ్యాపార వివాదాన్ని రాజకీయ కుట్రగా మార్చి ముస్తఫాపై అన్యాయంగా కేసులు

ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు

మాజీ ఎమ్మెల్యేపై కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ, మర్డర్ అటెంప్ట్ సెక్షన్ల మోత..

బెయిల్ రాకుండా పోలీసుల దుర్మార్గం

రాత్రివేళ ముస్లిం మహిళలు ఉన్న ఇళ్లల్లో చట్టవిరుద్ధంగా సోదాలు..

సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసిన వైనం

మాజీ శాసనసభ్యుడికి ‘పోలీస్ బహుమతి’ ప్రకటనలు

ఇది  పోలీసింగ్ వ్యవస్థకే అవమానం

అంబటి రాంబాబు తీవ్ర ఆక్షేపణ.

గతంలో నా ఇంటిపై దాడులు, లాకప్ వేధింపులు పెమ్మసాని కుట్రే

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

గుంటూరు: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార చంద్రబాబు ప్రభుత్వం దారుణమైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాధారణ వ్యాపార లావాదేవీల వివాదాన్ని పగటిపూట రాజకీయ కుట్రగా మలిచి, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాపై అక్రమ కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు. సోమవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోందని, ఆయన అన్నారు. ఆ దిశలోనే తమ పార్టీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా, ఆమె తండ్రి, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముస్తఫాపై ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తోందని... ఎన్ని కేసులు పెట్టినా వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆపదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. 
ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

వ్యాపార వివాదానికి 'హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ' రంగు..
ముస్తఫా గారికి, కొయ్యలగూడేనికి చెందిన పొగాకు వ్యాపారి సూర్యచంద్రంకు మధ్య రూ.36 లక్షల అడ్వాన్స్ బకాయిల విషయమై చిన్న వ్యాపార వివాదం జరిగింది. డబ్బులు తీసుకుని పొగాకు వేరేవాళ్లకు సరఫరా చేస్తుంటే, ఆపి కాకాని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కానీ, సూర్యచంద్రంతో నూజివీడులో ఫిర్యాదు చేయించి.. ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌లపై ఏకంగా కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు. కేవలం బెయిల్ రాకుండా చేసేందుకే ఇన్ని తీవ్రమైన సెక్షన్లు మోపారు.
 
రాత్రివేళల్లో ముస్లిం కుటుంబాల ఇళ్లపై దౌర్జన్యం..

చట్ట ప్రకారం రాత్రి 6 గంటల (సూర్యాస్తమయం) తర్వాత నివాస గృహాల్లోకి వెళ్లకూడదు.  డీఎస్పీ శ్రావణ్ కుమార్, కాకాని పోలీసు అధికారి నారాయణ స్వామి మఫ్టీలో వచ్చి, రాత్రి 9-10 గంటల వరకు ముస్లిం మహిళలు ఉన్న ఏడు అపార్ట్‌మెంట్లలోకి వెళ్లి సోదాలు చేశారు. దౌర్జన్యం చేయడమే కాకుండా, పోలీసుల అక్రమాలు బయటపడకుండా అక్కడి సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని దొంగతనంగా ఎత్తుకెళ్లారు. నాసిరకం డ్రగ్స్ లేదా హెరాయిన్ పెట్టి ముస్తఫా కుటుంబాన్ని ఇరికించే కుట్ర కూడా చేశారు.

మాజీ ఎమ్మెల్యే దొరికితే బహుమతా? ఇదేం పోలీసింగ్?

రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసి, మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన ముస్తఫా ఫోటోలు వేసి 'పట్టుకుంటే బహుమతి ఇస్తాం' అని నూజివీడు ఎస్ఐ లక్ష్మణ్ బాబు ప్రకటనలు ఇవ్వడం అపహాస్యం. ఆస్తులు, వ్యాపారాలు ఉన్న నాయకుడు పారిపోతాడా? ముస్తఫా చట్టపరంగా ముందస్తు బెయిల్ (ఆంటిసిపేటరీ బెయిల్), క్వాష్ పిటిషన్లకు వెళ్లారు. బెయిల్ కోరడం నిందితుడి హక్కు. ఒక ప్రజాప్రతినిధిని రౌడీషీటర్‌లాగా చిత్రీకరించడం పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు.
 
కేంద్రమంత్రి పెమ్మసాని నేరస్తుడు.. సంకెళ్లు వేయడం ఖాయం..

నా ఇంటిపై దాడి జరిగినా, కార్లు పగలగొట్టి పెట్రోల్ బాంబులు వేసినా, నన్ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో కాళ్లు పగలగొట్టేలా చిత్రహింసలకు గురిచేసినా.. దానికి కారణం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖరే. వంశీధర్, గంగా వెంకటేశ్వరులకు ఫోన్ చేసి కొట్టమని డైరెక్షన్ ఇచ్చింది ఆయనే. బయటకు పెద్దమనిషిలా అభివృద్ధి గురించి మాట్లాడే పెమ్మసాని, వెనుక ఉండి తడిగుడ్డతో గొంతులు కోస్తున్నారు. నా  ఇంటిపై దాడి చేసిన వారిని మాత్రం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు.

సంకెళ్లు వేసి నిలబెడతాం:

నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెమ్మసానికి సంకెళ్లు వేసినట్టు ఉన్న కార్టూన్ పెడితే విలవిలలాడారు. అది కేవలం కార్టూన్ మాత్రమే! రేపు జగనన్న ప్రభుత్వం వచ్చాక, నిన్ను నేరస్తుడిగా చట్టబద్ధంగా సంకెళ్లు వేసి నిలబెట్టేంత వరకు నిద్రపోను. 
ఈ నేపధ్యంలో పోలీసులు చట్ట పరిధి దాటి, రౌడీల్లా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని.. యూనిఫాం వేసుకున్నంత మాత్రాన మీరేం చేసినా చెల్లుతుందనుకోవద్దని అంబటి రాంబాబు హెచ్చరించారు. ప్రతి పోలీస్ అధికారిపై, ఈ అతి ప్రవర్తనపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్తఫా కుటుంబానికి, కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Back to Top