లోప‌భూయిష్టంగా రివ‌ర్ ఫ్రంట్ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు

ప్రమాదపు అంచుల్లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం 

మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఆగ్ర‌హం

రాజ‌మహేంద్ర‌వ‌రంలో నిర్మాణంలో ఉన్న రివర్ ఫ్రంట్ పనులను ప‌రిశీలించిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ 

గోదావ‌రి న‌దికి వ‌ర‌ద ఉధృతి పెరిగితే ఘోర ప్ర‌మాదం 

రివ‌ర్ ఫ్రంట్ ప‌నుల‌తో కూలిపోయే స్థితిలో గోదావ‌రి గ‌ట్టు రోడ్డు 

ఈ ప‌రిస్థితికి కారకుల‌పై క్రిమినల్ కేసులు పెట్టకపోతే హైకోర్టుకి వెళతాం

మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ హెచ్చ‌రిక 

ఈనెల 5న దేవరాపల్లిలో వైఎస్ జ‌గన్ 

పొగాకు రైతులకు మ‌ద్ద‌తు ధ‌ర‌ కోసం పోరాటం

భోగాపురం ఎయిర్ పోర్టు ఘనత వైఎస్ జ‌గన్ గారిదే.. 

స్ప‌ష్టం చేసిన మార్గాని భరత్ 

రాజమహేంద్రవరం:
వెన్నుపోటు కూటమి ప్రభుత్వం రివర్ ఫ్రంట్ పేరుతో సుందరీకరణ చేపట్టి నగరాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితుల్లోకి తీసుకెళ్లింద‌ని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. గోదావరి గట్టున ఉన్న మట్టి జారిపోయి బండ్ రోడ్డు కూలిపోయేలా ఉంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని నిలదీసారు. సోమవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి స్థానిక మార్కండేయ ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. అక్కడ గోదావరి బండ్ రోడ్డు కుంగిపోకుండా ఉండేందుకు వేసిన ఇసుక బస్తాలను చూసి అధికారులు, ప్రజా ప్రతినిధులపై మండిపడ్డారు. ఇప్పుడు గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఉందని, ఒకేసారి 20 నుంచి 25 లక్షల క్యూసెక్కుల వరదనీరు కూడా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కిందకు విడుదల చేసిన రోజులు ఉన్నాయన్నారు. ఇంకా వరద ఉధృతి పెరిగితే న‌గ‌రంలో ఉన్న ప్ర‌జ‌ల పరిస్థితి ఏమిటని మండిప‌డ్డారు. గోదావరి గట్టు రోడ్డు గుల్లగా మారి కూలిపోతే ఎదురయ్యే పరిస్థితులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యానికి కారకులపై క్రిమినల్ కేసులు పెట్టకపోతే తాము హైకోర్టుని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే... 

న‌గరం మునిగిపోయే పరిస్థితి దాపురించింది

"ఇరిగేషన్ అధికారుల సలహాలు, సూచనలు, నిబంధనలు పాటిస్తూ పనులు చేయాల్సిన అధికారులు ఈ విధంగా వ్యవహరించడం చాలా దారుణం. కోటిలింగాల రేవులో స్క్రీన్ ఏర్పాటు చేశారు, కానీ అది ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయింది. మరొక పది అడుగుల ఎత్తులో ఆ నిర్మాణం చేసి ఉంటే పోయేదేముంది? కంబాలచెరువు పార్కులో పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేశాం. దాని ద్వారా వర్షపు నీటిని ఏబీ నాగేశ్వరరావు పార్కులోకి పంపేందుకు వీలున్నా అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తూ నగరమంతా మునిగిపోయేలా చేస్తున్నారు. పంపింగ్ స్టేషన్లను వినియోగించకుండా కంబాలచెరువులో చేపలు పెరుగుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. రైల్వే స్టేషన్ రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా ఉంది, చిన్న వర్షం వస్తే చాలు పూర్తిగా ముంపునకు గురవుతోంది.

బీసీ నాయకులను టార్గెట్ చేసి దాడులు

వైఎస్సార్సీపీలో ఉన్న వెనుకబడిన బీసీ వర్గాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని అక్రమంగా అరెస్టులు, దాడులు చేయిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, సీదిరి అప్పలరాజు, ఆముదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్.. ఇప్పుడు ఎమ్మెల్యే విరుపాక్షి వరకు అందరిపైనా తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. బీసీలంటే ఈ కూటమి ప్రభుత్వానికి చాలా లోకువగా కనిపిస్తున్నారు. జరిగిన అన్ని అక్రమ అరెస్టులపైనా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. ఎళ్లకాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండరు, త్వరలోనే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుంది. ఆ తరువాత వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేసిన వారందరిపైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను. జరిగే పరిణామాలకు చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు.

పొగాకు రైతులకు మద్దతుగా దేవరాపల్లికి జగన్

ఈనెల 5వ తేదీన పొగాకు రైతులకు మద్దతుగా దేవరాపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గారు పర్యటిస్తున్నారు. ఆ పర్యటనకు రైతులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిస్తున్నాను. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులకు లేదా అని నిలదీస్తున్నాను. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు పొగాకు రైతులకు క్వింటాల్‌కు ₹40,000 ఇచ్చేవారం, ఇప్పుడు దానిలో సగం కూడా రావడం లేదు. వరి రైతులకు మద్దతు ధర చెల్లించలేక పంటలు వేయవద్దని చెప్పడం సరైన విధానం కాదు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రైతులకు మేలు జరిగేలా చేస్తాం.

భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత ముమ్మాటికీ జగన్ గారిదే

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి మాత్రమే దక్కుతుంది. ఆయన 2,800 ఎకరాల భూసేకరణ చేసి శంకుస్థాపన చేశారు. ఒక సభలో 'ఎర్ర బస్సు రాని ఊరుకి ఎయిర్‌పోర్టు ఎందుకు?' అని స్థానిక మహిళ ప్రశ్నిస్తే, దానిపై జగన్ గారు మాట్లాడిన మాటలను అపార్థం చేసుకుంటూ ఆయనపై దుష్ప్రచారం చేయడం తగదు. ఇప్పుడేదో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఏదో సాధించేసినట్టుగా ప్రధానిని తీసుకొచ్చి ఎయిర్‌పోర్టును ప్రారంభించి ప్రగల్భాలు పలుకుతున్నారని భ‌ర‌త్ ఆరోపించారు.

Back to Top