ప్రమాదపు అంచుల్లో గోదావరి గట్టు..

పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనతే కారణం 

 బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం : మార్గాని భరత్‌రామ్‌

  రాజమహేంద్రవరం: రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న పనులు రాజమహేంద్రవరం నగరాన్ని తీవ్ర ముంపు ప్రమాదంలోకి నెడుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి గట్టు కుంగిపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధ్యులపై వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సోమవారం మార్కండేయ ఆలయం సమీపంలోని రివర్‌ ఫ్రంట్‌ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 గోదావరి గట్టు ప్రమాదంలో.. అధికారుల నిర్లక్ష్యం

గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో కూడా భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం అత్యంత ప్రమాదకరమని మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. గట్టు కుంగిపోకుండా ఇసుక బస్తాలతో తాత్కాలిక చర్యలు తీసుకోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. కోటిలింగాల రేవు, కంబాలచెరువు, రైల్వే స్టేషన్‌ రోడ్డు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్వహణలో అధికారుల వైఫల్యం కారణంగా నగరం ముంపు ముప్పును ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.

 బీసీ నేతలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు

రాష్ట్రంలో బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌, కారుమూరి సునీల్‌, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, విరుపాక్షి తదితరులపై నమోదైన కేసులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

 రైతులకు అండగా జగన్‌.. భోగాపురం ఘనత వైయస్‌ జగన్‌దే

ఈ నెల 5న దేవరాపల్లిలో పొగాకు రైతులకు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారని, రైతులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మార్గాని భరత్‌రామ్‌ పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూసేకరణ, అనుమతులు, నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది వైయస్‌ జగన్‌ ప్రభుత్వమేనని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని ఘనతను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలు, ప్రజా ప్రయోజనాల అంశాల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top