డీఎస్సీ అక్రమాలపై బద్వేలులో టౌన్‌హాల్ సమావేశం

డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి 

ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ డిమాండ్

 బద్వేలు: డీఎస్సీ–2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తక్షణమే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బద్వేలు నియోజకవర్గ స్థాయి టౌన్‌హాల్ సమావేశాన్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ యువత సమస్యలు, విద్యాదీవెన–వసతిదీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై చర్చించారు.

డీఎస్సీ నియామకాలపై తీవ్ర అనుమానాలు

డీఎస్సీ కన్వీనర్‌ను పూర్తిగా పక్కనపెట్టి పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, డిజిటల్ ప్రక్రియల బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడం వల్ల పారదర్శకత దెబ్బతిన్నదని నేతలు ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో ప్రశ్నపత్రాల నిర్వహణ జరపడం, పరీక్షల ప్రక్రియలో పనిచేసిన వ్యక్తి టాప్ ర్యాంకు సాధించడం, అనంతరం మెరిట్ జాబితా నుంచి పేరు తొలగించడం వంటి పరిణామాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

స్పోర్ట్స్ కోటా, యువత హామీలపై విమర్శలు

స్పోర్ట్స్ కోటా నియామకాల కోసం నిబంధనలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, జాతీయ స్థాయి క్రీడాకారులను పక్కనపెట్టి అనర్హులకు ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 6 నుంచి 9 వరకు రిలే దీక్షలు.. 10న భారీ ర్యాలీ

ప్రభుత్వం వెంటనే స్పందించి డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యార్థుల బకాయిలు విడుదల చేసి నిరుద్యోగ భృతిని అమలు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఆగస్టు 6 నుంచి 9 వరకు బద్వేలు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, మేధావులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ పిలుపునిచ్చారు.

Back to Top