వైయస్ జగన్ చొరవతోనే పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు

100 ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుతో వైద్య విద్యకు మరింత ఊతం

కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

పిడుగురాళ్ల: పిడుగురాళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, బోధనాసుపత్రి ఏర్పాటు కావడం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టి, చొరవతోనే సాధ్యమైందని మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్య విద్యను విస్తరించాలనే లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం అనేక కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. అదే సంకల్పంలో భాగంగా పిడుగురాళ్లలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, బోధనాసుపత్రి ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు లభించడం వల్ల పల్నాడు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించే అవకాశం మరింత విస్తరించనుందని, అదే సమయంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు. వైద్య విద్య, ప్రజారోగ్య రంగాల అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో కీలకమని పేర్కొన్న కాసు మహేష్ రెడ్డి, ఈ సీట్ల కేటాయింపుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ త్వరితగతిన పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించి ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చాలని ఆకాంక్షించారు.

Back to Top