చంద్రబాబు కుయుక్తులకు రేవంత్ రెడ్డి మద్దతు 

ఆయ‌న కోస‌మే నాగార్జున యాద‌వ్ అక్ర‌మ అరెస్టు  

వారిద్ద‌రి హాట్‌లైన్ సంబంధాలు బ‌ట్ట‌బ‌య‌లు  

వైయ‌స్ఆర్‌సీపీ నేతల తీవ్ర ఆగ్రహం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర 

చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలకు రేవంత్ రెడ్డి స‌హ‌క‌రిస్తున్నాడు

రెండేళ్ల కింద‌టి వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు కేసు పెట్ట‌డం సిగ్గుచేటు

డిబేట్‌లో చేసిన రాజ‌కీయ‌ విమ‌ర్శ‌ల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లా?  

వైయ‌స్ఆర్ ఆక‌స్మిక మ‌ర‌ణంపై రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో గుర్తులేదా? 

ఆయ‌న చేసిన దిగ‌జారుడు వ్యాఖ్య‌లపై మేం గెలిచాక అరెస్టు చేయమంటారా?

ప్రజా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే రేవంత్ రెడ్డి ద్వారా ఈ అరెస్ట్ డ్రామా

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుయుక్తులకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా వంతపాడుతున్నారని, కూట‌మి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి రేవంత్ రెడ్డి వంత‌పాడుతున్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న 'హాట్‌లైన్' సంబంధాలు ఈ అక్రమ అరెస్టుతో పూర్తిగా బట్టబయలయ్యాయని విమర్శించారు. రెండేళ్ల కింద‌టి వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు కేసు పెట్ట‌డం సిగ్గుచేటని, ఏఐ ద్వారా వాటిని సృష్టించారా అనేది కూడా నిర్ధారించుకోకుండా కేసులు పెట్టార‌ని ఆరోపించారు. టీవీ డిబేట్‌లో చేసిన రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్ట‌డం ద్వారా ఏం సందేశం ఇస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. గ‌తంలో ఇదే రేవంత్ రెడ్డి.. మ‌హానేత వైఎస్సార్ మ‌ర‌ణంపై చేసిన దిగ‌రాజుడు వ్యాఖ్య‌ల‌పై రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక చ‌ర్య‌లు తీసుకోమంటారా అని నిల‌దీశారు. ప్రజా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే రేవంత్ రెడ్డి ద్వారా ఈ అక్ర‌మ అరెస్ట్ డ్రామా ఆడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. కూటమి ప్రభుత్వ విఫల విధానాలపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు నిరంతరం గొంతెత్తుతూనే ఉంటాయని, నాగార్జున యాదవ్‌ను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు.

వారు ఇంకా ఏం మాట్లాడారంటే... 

● నాగార్జున అరెస్ట్ రాజకీయ కక్షసాధింపు చర్య
- టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే 

ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి గారు.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక బీసీ యువ నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణం. టీవీ డిబేట్లలో మాట్లాడే మాటల ఆధారంగా కేసులు పెట్టుకుంటూ పోతే, ప్రతి డిబేట్‌పైనా రోజుకు పది కేసులు పెట్టాల్సి వస్తుంది. దేన్ని నేరంగా పరిగణించాలనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం. చంద్రబాబు నాయుడి కుయుక్తి రాజకీయాలకు, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వంతపాడుతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో వైఎస్సార్ గారి మరణంపై వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ వ్యాఖ్యల ఆధారంగా ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రిపై మేము కూడా కేసులు పెట్టవచ్చా? రెండు రాష్ట్రాల్లో వైఎస్ జగన్ గారిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?

- రెండేళ్ల తర్వాత కేసు పెట్టడం వెనుక ఉన్న మర్మం ఏంటి?

నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు తప్పైతే చట్టప్రకారం చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. కానీ, ఈ ఏఐ యుగంలో అది నిజమైన వీడియోనా, కాదా లేదా మార్ఫింగ్ చేశారా అనేది నిర్ధారించుకోకుండా, రెండేళ్ల క్రితం నాటి అంశంపై ఇప్పుడు కేసులు బనాయించడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ప్రకాశం జిల్లా పొగాకు రైతులు, చిత్తూరు జిల్లా మామిడి, అరటి రైతులు, అలాగే మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వైఎస్ జగన్ గారు అందించిన ప్రజా సంక్షేమం కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చి చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఇది కేవలం ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే ప్రయత్నం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, సామాన్యుడి తరఫున గొంతెత్తుతూనే ఉంటుంది. బెదిరింపులకు, అక్రమ కేసులకు మా పార్టీ భయపడదు. 

● రెండు రాష్ట్రాల సీఎంల మధ్య 'హాట్‌లైన్' ఒప్పందాలు 
- పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర

ఆంధ్రప్రదేశ్‌లో 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తుంటే, దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న 'హాట్‌లైన్' సంబంధాలు ఇవాళ స్పష్టంగా బయటపడ్డాయి. కేంద్రంలో ఎన్డీయేతో సంసారం చేస్తూ, చాటుమాటుగా యూపీఏతో చంద్రబాబు అండర్‌స్టాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపించే గొంతుకలను టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. నాగార్జున యాదవ్‌పై ఏదో అంతర్జాతీయ నేరం చేసినట్లు ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ పేరిట తప్పుడు సెక్షన్ల కింద కేసులు  నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  గతంలో పబ్లిక్ మీటింగుల్లో జగన్ గారిని, వారి కుటుంబ సభ్యులను ఎంతగా దూషించారో అందరికీ తెలుసు. అప్పట్లో మేము గనుక ఇలాంటి సెక్షన్లతో కేసులు పెట్టి ఉంటే మీరు ఇవాళ బయట తిరిగేవాళ్లా?

ముఖ్యమంత్రుల మధ్య ఉన్న అవగాహనను రాష్ట్రాల అభివృద్ధి కోసం, విభజన చట్టంలోని నిధులు, నీళ్ల సాధన కోసం ఉపయోగించాలి తప్ప, ఇలాంటి కక్షసాధింపు రాజకీయాల కోసం కాదు. ఒక బీసీ యువకుడిని అర్ధరాత్రి వేళ నోటీసులు లేకుండా, ఏ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారో కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేయడం ఏ రకమైన సంస్కృతి? కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టడానికి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వంద కేసులకైనా సిద్ధంగా ఉన్నాయే తప్ప, వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.

● రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు క్రిమిన‌ల్ చ‌ర్య‌లా? 
- పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర 

వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక పోలీసుల సమక్షంలో నోటీసు ఇచ్చి వివరణ తీసుకోకుండా, అర్ధరాత్రి పూట దొంగలలా ఎత్తుకెళ్లడం దారుణం. నాగార్జున యాదవ్‌ను బేషరతుగా, తక్షణమే విడుదల చేయాలి. సాధారణ రాజకీయ వ్యాఖ్యలను క్రిమినల్ కేసులుగా మార్చడాన్ని ఉపసంహరించుకోవాలి. రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ పేరిట రైతుల భూములను బుల్డోజర్లతో ఆక్రమించుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై వైఎస్ జగన్ గారి నేతృత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున పోరాడుతోంది. నాగార్జున యాదవ్ కూడా దీనిపై గట్టిగా గొంతు వినిపించారు. ఆ ప్రజా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే చంద్రబాబు తన శిష్యుడైన రేవంత్ రెడ్డి ద్వారా ఈ అరెస్ట్ డ్రామా ఆడించారు. 

గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలు ఇష్టానుసారంగా మాట్లాడినా ప్రజాస్వామ్య దృక్పథంతో చూశాం తప్ప ఇలాంటి తప్పుడు కేసులు పెట్టలేదు. సోషల్ మీడియాను అడ్డుకోవడానికి టాస్క్ ఫోర్స్ పెట్టడం, మీడియా యాంకర్లపై కూడా కేసులు పెడతామనడం దుర్మార్గం. ఐటీడీపీ శ్రేణులు చేస్తున్న విష ప్రచారాలపై లేని శ్రద్ధ, ఒక బీసీ నేత రాజకీయ విమర్శలపై చూపించడం రేవంత్ రెడ్డి గారి ఫాసిస్ట్ ధోరణికి అద్దం పడుతోంది. ఈ అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
 

Back to Top