నా వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం 

 రాయలసీమ లిఫ్ట్‌పై మాట్లాడిన అంశాలను వక్రీకరించిన ఎల్లోమీడియాపై విశ్వేశ్వరరెడ్డి మండిపాటు 

 రాయలసీమ ప్రయోజనాల కోసం వైయ‌స్ఆర్‌సీపీ రాజీలేని పోరాటం కొనసాగుతుంది 

ఉరవకొండ: నెల్లూరులో నిర్వహించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఎల్లోమీడియా ప్రచారం చేయడాన్ని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టులో లైనింగ్ పేరుతో జరుగుతున్న అవినీతి, ప్రజాధన దోపిడీపై తాను స్పష్టంగా మాట్లాడిన విషయాలను పక్కదారి పట్టించి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
విశ్వేశ్వరరెడ్డి ఏమన్నారంటే.. 

హంద్రీ–నీవా ప్రాజెక్టులో దోపిడీపైనే నా వ్యాఖ్యలు
నెల్లూరులో జరిగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో హంద్రీ–నీవా ప్రాజెక్టులో లైనింగ్ పేరుతో జరుగుతున్న అవినీతి, ప్రజాధన దుర్వినియోగాన్ని తాను స్పష్టంగా ప్రస్తావించానని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ప్రజల సొమ్మును కొల్లగొట్టే విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టినట్లు చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా నదిలోని వరద జలాలను సాధ్యమైనంత త్వరగా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించి తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల నీటి సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు.

ప్రాధాన్యత పనులు పక్కనపెట్టి లైనింగ్ పేరుతో దోపిడీ 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు ఉపయోగపడే ప్రాధాన్యతా పనులను విస్మరించి, లైనింగ్ వంటి పనుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే అంశాన్ని టాస్క్‌ఫోర్స్ సమావేశంలో విస్తృతంగా వివరించినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల అసలు భావాన్ని పూర్తిగా మార్చి తమకు అనుకూలంగా ఎల్లోమీడియా వార్తలు ప్రచురించడం, వాటిని ఆధారంగా చేసుకుని టీడీపీ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించారు.

రాయలసీమ లిఫ్ట్‌ను నిలిపివేసిన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి 
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోరాడనే కారణంతో రాయలసీమకు జీవనాడి అయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిలిపివేసి మూలనపడేసిన ప్రభుత్వం, ఆ తప్పుకు ముందుగా రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తప్పును సరిదిద్దాల్సింది పోయి తన వ్యాఖ్యలను వక్రీకరించడం మరింత దుర్మార్గమని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలగకుండా, వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నట్లు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టుల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

Back to Top