విశాఖలో నీరాజనం 

 వైయస్ జగన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

కిక్కిరిసిన విశాఖ వీధులు.. భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు 

 

 విశాఖపట్నం:  జిల్లా పర్యటనకు వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు, పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇచ్చేందుకు విశాఖకు చేరుకున్న ఆయనకు విమానాశ్రయం నుంచే భారీ జనసందోహం స్వాగతం పలికింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో ఆత్మీయంగా ఆహ్వానించారు. ఎయిర్‌పోర్టు పరిసరాలు పూర్తిగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులతో నిండిపోయి పండుగ వాతావరణాన్ని తలపించాయి.

ఎయిర్‌పోర్టు నుంచి జబ్బార్‌ తోట వైపు బయలుదేరిన వైయస్ జగన్ కాన్వాయ్‌కు మార్గమధ్యంలోని ప్రతి ప్రాంతంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి స్వాగతం పలికారు. రహదారుల ఇరువైపులా నిలబడి చేతులు ఊపుతూ అభివాదం చేసిన ప్రజలకు వైయస్ జగన్ కూడా చిరునవ్వుతో ప్రతిస్పందించారు. అనేక చోట్ల ప్రజలు ఆయన కాన్వాయ్‌ను చూసేందుకు, తమ సమస్యలను వినిపించేందుకు పెద్దఎత్తున చేరుకోవడంతో విశాఖ నగరంలోని ప్రధాన రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి.

కాన్వాయ్‌ దిగి ప్రజలతో మమేకం 

పర్యటనలో భాగంగా పలుచోట్ల కాన్వాయ్‌ దిగి వైయస్ జగన్ నేరుగా ప్రజలను కలిశారు. బాధిత కుటుంబ సభ్యులు, మహిళలు, యువకులు, వృద్ధులు తమ సమస్యలను వివరించగా, వాటిని ఓపికగా విని పరామర్శించారు. పలువురు అందించిన వినతిపత్రాలను స్వీకరించి, సమస్యలను సంబంధిత స్థాయిలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పారు.

మత్స్యకారులకు అండగా వైయస్ జగన్ 

జబ్బార్‌ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన వైయస్ జగన్, వారి ఆవేదనను ఓపికగా విన్నారు. బాధిత కుటుంబాలను ఓదారుస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రమాదం నుంచి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన కారి చిన్నాను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బోటు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను స్వయంగా తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 ప్రజల స్పందనతో ఉత్సాహభరితంగా పర్యటన 

వైయస్ జగన్ రాకతో విశాఖ నగరం అంతటా ప్రజల్లో విశేష ఉత్సాహం కనిపించింది. విమానాశ్రయం నుంచి జబ్బార్‌ తోట వరకు ఎక్కడ చూసినా ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, బాధిత కుటుంబాలను పరామర్శించడం, ప్రతి చోట ప్రజల నుంచి లభించిన విశేష స్పందనతో విశాఖ పర్యటన విజయవంతంగా కొనసాగింది.
 

Back to Top