తిరుపతి: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కనపెట్టి, అమరావతి అభివృద్ధి పేరుతో అవాస్తవ ప్రచారాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. అమరావతిలో "మినీ అమెజాన్" నిర్మిస్తున్నట్లు వస్తున్న ప్రచారాలపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ప్రజలకు ఉపాధి, అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టమైన కార్యాచరణ చూపాల్సిన ప్రభుత్వం, ఊహాజనిత ప్రాజెక్టులతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. భూమన కరుణాకర రెడ్డి ఏమన్నారంటే.. అమరావతిలో మినీ అమెజాన్ అంటూ తప్పుడు ప్రచారమా? అమరావతిలో ఐదు ఎకరాల్లో 20 వేలకుపైగా చెట్లు, 400 రకాల మొక్కలు, కృత్రిమ సెలయేళ్లు, పొగమంచు వాతావరణం, జీవ వైవిధ్య అభివృద్ధి వంటి అంశాలతో "మినీ అమెజాన్" ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేయడం ఆశ్చర్యకరమన్నారు. అంతేకాకుండా అక్కడ ఉష్ణోగ్రతను నాలుగు డిగ్రీలు తగ్గిస్తామని చెప్పడం కూడా ప్రచార ఆర్భాటమేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రచారాలు చేస్తుంటే అమరావతిలో ఏడు ఎకరాల్లో పసిఫిక్ మహాసముద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని, టైటానిక్ నౌకను తీసుకురావాలని, హిమాలయ పర్వతాలను కూడా నిర్మించాలని వ్యంగ్యంగా అన్నారు. ఇంద్రుని అమరావతిని మించిన అమరావతిని నిర్మిస్తున్నామని కూడా ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు వదిలి ప్రచారాలేనా? రాష్ట్రంలో అత్యధికంగా దిగువ, మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్నారని, వారి జీవన సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం కల్పిత ప్రచారాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిందిపోయి ప్రచారానికే పరిమితమవుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో బార్లు తెరిచిన ప్రభుత్వం సచివాలయంలో ఉద్యోగులకు కూడా ప్రత్యేక బార్ ఏర్పాటు చేయవచ్చని, హైకోర్టు సమీపంలో కూడా బార్ ఏర్పాటు చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎయిర్ కండీషనింగ్ చేస్తామని కూడా అధికార అనుకూల పత్రికల ద్వారా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయవచ్చని ఎద్దేవా చేశారు. ప్రచారాలకు బదులుగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని భూమన కరుణాకర రెడ్డి సూచించారు. ప్రజలకు వాస్తవ ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.