ఇది ప్రగతి నివేదిక కాదు.. ప్రజల నడ్డి విరిచే అబద్ధాల పోస్టర్

విద్యుత్ రంగంపై మంత్రి చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు

కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలపై రూ.20,136 కోట్ల విద్యుత్ భారం

ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ డాక్టర్  మొండితోక అరుణ్ కుమార్.

ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా వెళ్లి బిల్లులు చెక్ చేద్దాం.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్చకు సిద్ధమా? 

సవాల్ చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

తాడేపల్లి: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదంటూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విడుదల చేసిన నివేదిక పచ్చి అబద్ధాల పోస్టర్ అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవాలను దాచిపెట్టిన కూటమి ప్రభుత్వం, అనుకూల మీడియాలో పెద్ద పెద్ద హెడ్డింగులతో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై ఏకంగా రూ.20,136 కోట్ల అదనపు భారాన్ని మోపి ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు. రకరకాల సర్ ఛార్జీలు, అడ్జెస్ట్‌మెంట్ ఛార్జీలతో సామాన్యుడిని దోచుకుంటూ.. ఛార్జీలు పెంచలేదనడం పచ్చి అబద్ధమని  డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ విడుదల చేసింది ప్రగతి నివేదిక కాదు, అబద్ధాల పోస్టర్ అని మండిపడ్డారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... 

- రెండేళ్లలోనే రూ. 20,136 కోట్ల అదనపు భారం.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన బంగ్లా దాటి బయటకు వస్తే పెరిగిన విద్యుత్ బిల్లుల వాస్తవాలు చూపిస్తాం.  కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజలపై రకరకాల రూపాల్లో  ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారు. 2024 నవంబరు నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ. 20,136 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపారు. కరెంటు బిల్లుల్లో సర్ ఛార్జ్, సర్వీసు ఛార్జ్, అడ్జెస్ట్ మెంట్ ఛార్జిల పేరుతో దోపిడీ చేస్తున్నారు.

- మంత్రి రవికుమార్‌కు బహిరంగ సవాల్: 

2024 డిసెంబరులో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రూ.6,772 కోట్లు, 2025లో రూ.9,412 కోట్లు, ఆర్థిక సంవత్సరాల వారీగా రూ.1,863 కోట్లు (2024-25), రూ.2,787 కోట్లు (2025-26) చొప్పున మొత్తం రూ.20,136 కోట్లు పెంచింది.  నేను చెప్పే లెక్కలు అబద్ధమైతే.. మంత్రి రవి కుమార్ కి నచ్చిన రాష్ట్రంలో ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా వెళ్దాం. జూన్ 2024 బిల్లు ఎంత? జూన్ 2026 బిల్లు ఎంత? అనేది చెక్ చేద్దాం. హిడెన్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తున్నారో ప్రజల ముందే లెక్కిద్దాం. చర్చకు వచ్చే దమ్ము మంత్రికి ఉందా?

- విభజన నాటికే ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం..

విద్యుత్ లోటు నుంచి మిగులు రాష్ట్రంగా మార్చింది కూటమి ప్రభుత్వమే అనడం హాస్యాస్పదం.  2014లో రాష్ట్రం విడిపోయే నాటికే ఆంధ్రప్రదేశ్‌కు 17,731 మెగావాట్ల విద్యుత్ వనరులు ఉండగా, డిమాండ్ కేవలం 13,404 మెగావాట్లు మాత్రమే ఉంది, .. అంటే అప్పుడే రాష్ట్రం మిగులు విద్యుత్‌తో ఉందని స్పష్టమవుతోంది. 

- డిస్కమ్‌లను ముంచింది టీడీపీ.. ఆదుకుంది వైయ‌స్ఆర్‌సీపీ..

2014 నాటికి ఏపీ విద్యుత్ రంగ అప్పు రూ. 29,551 కోట్లు ఉంటే, 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం దానిని రూ. 86,215 కోట్లకు పెంచి విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది. ఆ కాలంలో సీఏజీఆర్ (CAGR) అప్పుల వృద్ధి 24 శాతంగా ఉంటే, వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో (2019-24) అది కేవలం 7.65 శాతానికే పరిమితమైంది. టీడీపీ హయాంలో డిస్కమ్‌లకు ఇచ్చింది కేవలం రూ. 13 వేల కోట్ల సబ్సిడీ మాత్రమే. కానీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ. 49 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సెంటివ్‌లు ఇచ్చి డిస్కమ్‌లను ఆదుకుంది.
2014-19 మధ్య టీడీపీ నిర్లక్ష్యం వల్ల డిస్కమ్‌ల బాకీలు రూ.6,625 కోట్ల నుంచి రూ.28,715 కోట్లకు పెరిగాయి. ఆ భారాన్ని ప్రజలపై పడకుండా వైయస్. జగన్ ప్రభుత్వం నియంత్రించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 13 పైసలు తగ్గించామని చెప్పుకోవడం పెద్ద డ్రామా, ఈఆర్సీ అక్షింతలు వేయడం వల్లే ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు.

- ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతున్న చంద్రబాబు (సెకీ వర్సెస్ ఆక్సిస్)..

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ (SECI) నుంచి యూనిట్ రూ. 2.69 కే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గగ్గోలు పెట్టారు. ఇవాళ అదే సెకీని పక్కనబెట్టి, ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ అనే ప్రైవేట్ సంస్థ నుంచి ఏకంగా యూనిట్ రూ. 4.60 చొప్పున కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తక్కువ ధరకు ఇచ్చే ప్రభుత్వ సంస్థను వదిలి, ప్రైవేటు సంస్థలకు ఎక్కువ రేటు చెల్లిస్తున్నారంటే ఇది ప్రగతి రథమా? లేక అవినీతి రథమా?. 

- పెట్టుబడులన్నీ వైయ‌స్ఆర్‌సీపీ తెచ్చినవే..

కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పెట్టుబడులన్నీ వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో వచ్చినవే. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) ద్వారా విద్యుత్ రంగంలో వైయస్.జగన్ ప్రభుత్వంలో  రూ. 7,69,000 కోట్ల పెట్టుబడులకు పునాది వేస్తే, కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైంది. 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ఒకటో తేదీన ప్రజల్లోకి వెళ్లి చేస్తున్న ఫీల్డ్ సర్వేలు చేస్తున్నారు. వచ్చే నెల మీరు ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు చేపలు, ఆయిల్స్ కొనడం కాదు.. ఆ ఇంటి కరెంటు బిల్లు ఎంతో అడిగి మీరే కట్టండి. అప్పుడు సామాన్య ప్రజలపై కరెంటు మీటర్ కంటే వేగంగా మీ అబద్ధాల మీటర్ ఎలా తిరుగుతుందో, జనం ఎలా నడ్డి విరుస్తున్నారో మీకు అర్థమవుతుంది. మంత్రి రవికుమార్ తన ప్రకటనలో ఎస్సీ, ఎస్టీలు లేదా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గురించి  కూడా మాట్లాడకపోవడం దారుణం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, లేనిపక్షంలో ప్రజల తరపున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని మొండితోక అరుణ్ కుమార్ హెచ్చరించారు.

Back to Top