ప్ర‌శ్నించే గొంతుల్ని చంద్రబాబు అణగదొక్కలేరు

టాస్క్ ఫోర్స్, కమిటీలకు మేం భయపడం

కూటమి సర్కార్ అరాచకాల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం

తేల్చిచెప్పిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) 

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) 

ప్రజాహితం వదిలేసిన కేబినెట్ భేటీలు

జనం సమస్యలు వదిలి సోషల్ మీడియాపై చర్చలా?

సోషల్ మీడియా అరాచకాలకు పుట్టిల్లు టీడీపీయే

ప్రశ్నించే వారిపై దాడులు చంద్రబాబుకు అలవాటే

పేర్ని నాని ఫైర్ 

మీ చేతుల్లోనే 80 శాతం మీడియా, సోషల్ మీడియా 

పొలిటికల్ ఎథిక్స్ గురించి చంద్రబాబు నీతులా ?

పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్సార్సీపీపై విషప్రచారం

సిగ్గులేకుండా సోషల్ మీడియా కట్టడికి చర్చలా ?

పేర్ని నాని మండిపాటు 

సాయికృష్ణ కేసుతో పోలీసుల్లోనూ భయాలు

చంద్రబాబుపై పోలీసులకు నమ్మకం పోయింది

వారిలో స్థైర్యం నింపడానికే ఇలాంటి కుట్రలు 

సోషల్ మీడియా కట్టడితో ఎవరినీ భయపెట్టలేరు 

పేర్ని నాని స్పష్టీకరణ 

తాడేపల్లి: విజయవాడలో సాయికృష్ణ ఘటనతో పోలీసుల్లో చంద్రబాబుపై, కూటమి సర్కార్ పై పోలీసుల్లో నమ్మకం సడలిపోయింది, తిరిగి వారిలో నమ్మకం కల్పించడానికే సోషల్ మీడియాపై కేసులు అంటూ మరో కుట్రకు చంద్రబాబు తెరలేపారని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. కేబినెట్ భేటీల్లో చర్చకు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా, వాటిని వదిలేసి సోషల్ మీడియాపై చర్యల గురించి చర్చలు జరపడం ఏంటో అర్దం కావడం లేదన్నారు. మీరు ఎన్ని టాస్క్ ఫోర్స్ లు, సబ్ కమిటీలు వేసినా సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతుల్ని అడ్డుకోలేరని పేర్ని నాని తేల్చిచెప్పారు. 
ప్రెస్ మీట్లో పేర్ని నాని ఇంకేమన్నారంటే...

సోషల్ మీడియా అకృత్యాలకు పుట్టిల్లు టీడీపీ

ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రజలకు ఏం కావాలి, ఎన్నికల్లో ఏం హామీలిచ్చాం, హద్దులు లేకుండా చేసుకుపోతున్న అప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి, గుదిబండగా మారుతున్న అమరావతిని ఏం చేయాలి, చంద్రబాబు, నారాయణ గబగబా ఇళ్లు నిర్మించుకుంటూ, రైతులకు మాత్రం ప్లాట్లు చూపించలేని పరిస్ధితులపై మాత్రం ఎలాంటి చర్చ లేదు. కానీ సోషల్ మీడియా మీద కొంత చర్చించామని సమాచార మంత్రి ఏమాత్రం బెంగలేకుండా చెబుతున్నారు.  సోషల్ మీడియా సమాజానికి ఇబ్బందికరమైన రోగంగా మారిపోయిందని మంత్రిమండలి ఆవేదన వ్యక్తం చేసిందట. సోషల్ మీడియా అకృత్యాలకు పుట్టిల్లు టీడీపీ అయితే, ఇవాళ ఆ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం అదే సోషల్ మీడియా వికృతరూపం గురించి మంత్రులు బాధపడుతున్నారట. ఏంటీ పనికిమాలిన చేష్టలు ?, అసలు సోషల్ మీడియా వికృత చేష్టలకు అసలు కారణం టీడీపీయే. దశాబ్దాలుగా మీడియాను చెరబట్టి, తనను విమర్శించే, తనను ప్రశ్నించే, వ్యతిరేకించే వారిపై దాడి చేయించడం చంద్రబాబుకు అలవాటే. ఐ టీడీపీ పేరుతో ఓ విష వృక్షాన్ని తయారు చేసుకుని, దాని ద్వారా వందలాది యూట్యూబ్ ఛానళ్లను సృష్టించింది నిజం కాదా ? రాజకీయ ప్రత్యర్థులపై విషాన్ని చిమ్మిస్తూ, ఇంకా శునకానందం తీరక ఐటీడీపీ విషపు కొమ్మలు, రెమ్మలు విస్తరించాయి. బరితెగింపుకు హద్దు లేకుండా ప్రత్యర్ధి రాజకీయనాయకుల ఇంట్లో ఆడవాళ్లపై పోస్టులు మార్పింగ్ లు చేసి పెడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి స్ధానంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి విషయంలో ఎంత జుగుప్సాకరంగా ఫొటోలు, వీడియోలు చేయించిన విషయం మర్చిపోయారా ? ఇప్పటికీ ఆ అకౌంట్లు సజీవంగానే ఉన్నాయి. అధికారంలో లేని విపక్ష నేత కుటుంబాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. 

రాజకీయ ప్రత్యర్థులపై నీచపు ప్రచారాలు మీవే 

80 శాతం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు 80 శాతం సోషల్ మీడియాను సైతం మీ కబంధ హస్తాల్లో పెట్టుకుని, చంద్రబాబు ఇవాళ ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో తమ పార్టీ నేతలకు చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఆదేశాలే ఇందుకు నిదర్శనం. ప్రతీ నియోజకవర్గంలో సోషల్ మీడియాను వాడుకుంటూ, టిక్ టాక్ ద్వారా వీడియోలు చేయించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఎవరికి పాపులర్ ఛానల్ ఉందో, ఎవరికి ఎక్కువ రీచ్ ఉందో వారికి డబ్బులిచ్చి వాడుకుందామని చెప్పారు.  కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా గురించి గుండెలు బాదుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఏహ్యభావం దాటి విచారించే స్దితికి వచ్చేశాడు. నిన్న కేబినెట్లో పొలిటికల్ ఎథిక్స్ గురించి చంద్రబాబు మాట్లాడటం పిచ్చి పరాకాష్టకు చేరుకోవడం కాదా అని అడుగుతున్నాం. ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ అనే వ్యక్తి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర కూర్చుని ఏదో మాట్లాడారని పిచ్చికూతలు కూస్తున్నాడు. కానీ చంద్రబాబు సిగ్గు లేకుండా ఎన్టీఆర్ కు ఏమని దండలు వేస్తున్నాడు ?, హరికృష్ణ సమాధి దగ్గరి కెళ్లి దగ్గుబాటి వెంకటేశ్వరరావును వాటేసుకుని ఏమని చెప్తున్నాడో చెప్పగలరా ? వ్యక్తిత్వ హననాలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. ఇప్పటికీ 90 శాతం టీవీలు, పేపర్లు లాగేసుకుని ఎవర్ని తిట్టమంటే వాళ్లను తిడతారు, ఆకాశానికి లేపమంటే లేపుతారు. ఇంకా ఏం కావాలి మీకు ? కమ్మ కులంలో పుట్టిన శ్వేత అనే మహిళ స్వాతి రెడ్డి అనే అకౌంట్ పెట్టుకుని నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పెట్టి చేసుకుంది. ఆవిడ పెట్టే వీడియోలు అంతా జగన్మోహన్ రెడ్డి గారెపైనే, యష్ అనే మరో వ్యక్తి కూడా చంద్రబాబు, లోకేష్ తో ఫొటోలు దిగుతూ కనిపిస్తున్నాడు. ఇవన్నీ టీడీపీ సోషల్ మీడియా విషపు కొమ్మలే. వీళ్లు పెట్టే సోషల్ మీడియా పోస్టులు చంద్రబాబు నీచానికి పరాకాష్ట. మా పార్టీ కండువా వేయించి మరో నీచుడితో మా ఇంట్లోఆడవాళ్లను కూడా వదలకుండా నీచంగా మాట్లాడిస్తారు. సోషల్ మీడియా నిండా ఇలాంటి వాళ్ల ఖాతాలు, దారుణమైన పోస్టులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అరాచకాలు చేసి సోషల్ మీడియా చెడిపోయిందని తండ్రీ కొడుకులు మాట్లాడుతున్నారు. 

ప్రశ్నించే గొంతుల అణచివేత చంద్రబాబుకు అలవాటే 

తెలంగాణలో సైకోగా మారి ఆరుగురిని చంపిన హంతకుడికీ, జగన్మోహన్ రెడ్డి గారికీ దగ్గరిపోలికలు ఉన్నాయంట. మీకు , మీ అబ్బాయికి ఎవరితో  పోలికలు ఉన్నాయో చూసుకున్నారా ?, 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి ? రాజకీయ సంస్కారం లేని మీ అనుభవం ఎవరికి పనికొస్తుందో చెప్పాలి. జనం కష్టార్జితంలోని నుంచి 210 కోట్లు మీ డబ్బా కొట్టుకోవడానికి ఖర్చు పెట్టారనడానికి ఎన్నో జీవోలు సాక్షాలుగా ఉన్నాయి. అయినా మీ దోపిడీని, అకృత్యాల్ని ఎవరూ ప్రశ్నించకూడదా ? మీ తప్పుల్ని ప్రశ్నించే వారిని అణచివేయడం మీకు కొత్త కాదు కదా. గతంలో అంగన్ వాడీ కార్యకర్తల్ని గుర్రాలతో తొక్కించడం, కరెంటు ఛార్జీలు తగ్గించమని అడిగితే ముగ్గురు కమ్యూనిస్టుల్ని కాల్చివేయడం మర్చిపోయారా ? అక్కడితో మీ దుశ్చర్యలు ఏమైనా ఆగాయా, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.  ఇవాళ అమరావతికి అవసరం లేని, సంబంధం లేని నాలుగు గ్రామాల భూముల్ని దాడులు, దుర్మార్గాలతో బలవంతంగా సేకరించడం లేదా ? కేబినెట్ లో చర్చించడానికి మీకు సమస్యలే దొరకలేదా ? రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు భద్రత లేకుండా అకృత్యాలకు బలవుతున్నారు, మరోవైపు వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు మాత్రమే పోలీసుల్ని వాడుతున్నారు. రెండేళ్లలో ఏ కేబినెట్ భేటీని అయినా ప్రజాహితం కోసం చంద్రబాబు వాడుకున్నారా ?, ఒక్కరికి అయినా ఉద్యోగ కల్పన చేశారా ? ప్రతీ ఏడాదీ జాబ్ క్యాలెండర్ అన్న లోకేష్.. తనకు ఓటేసిన మంగళగిరి ప్రజలకే అందుబాటులో లేరు. ప్రజా దర్బార్ పేరుతో మంగళగిరిలో ఆర్భాటం చేసి వదిలేశారు. కేబినెట్ అంటే కక్షలు, కార్పణ్యాల కోసమే అన్నట్లుగా మార్చేశారు. మీ అహం సంతృప్తి పర్చుకోవడానికే అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖాకీ బూట్లతో ప్రజల గొంతును తొక్కేసే నిర్ణయాలే అన్నీ. ఆర్టీసీని సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ఉద్యోగులు రోడ్డెక్కితే పోలీసులతో అణచివేస్తారు. బయట బజారులో తన్నించి, కేసులు పెట్టించినా సరిపోవట్లేదు, అందుకే మీ దుర్మార్గాలు, మీ తప్పులు ప్రజలకు కనబడకూడదనే సోషల్ మీడియానూ ఆణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఇవాళ మోడీ అచ్చాహై అంటే నమ్మాలి, మోడీ లుచ్చాహై అన్నా నమ్మాలి. ఎవరూ ప్రశ్నించకూడదు. 

సాయికృష్ణ కేసుతో పోలీసుల్లో నమ్మకం పోయింది 

విజయవాడలో లాకప్ డెత్ జరిగితే కప్పిపెట్టాలని చూశారు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు మీ దాష్టికాల్ని సమాజానికి చూపించాయి. వాళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల నమ్మకం పోయిందన్న బెంగ లేదు. లాకప్ డెత్ కేసులో పోలీసులు వెనకడుగు వేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. రెండేళ్లుగా నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా సాయికృష్ణను ఎందుకు అరెస్టు చేయలేదో సీపీ కానీ, డీజీపీ కానీ సమాధానం చెప్పారు. హత్య కేసులో అరెస్టు అయితే ఎందుకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా ఉందుకు పీటీ వారెంట్లు వేయలేదు, అతన్ని ఎందుకు జైలుకు పంపలేదు, లాకప్ డెత్ జరిగిందని తెలిసీ సీపీ, డీజీపీలు, చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. మీరు చెప్పిన పని చేయడంలో భాగంగా అతన్ని చంపేశారు. నిజాయితీగా దర్యాప్తు చేసే వారు లేరు. పోలీసులు సైతం చంద్రబాబును నమ్మడం లేదు. సీఐ నాగరాజుకు, కానిస్టేబుల్ అశోక్ కు పట్టిన గతే మనకూ పడుతుందని భయపడుతున్నారు.  ఇకపై వైఎస్సార్సీపీ వాళ్లపై దూకుడుగా కేసులు పెట్టరు, దాడులు చేసే పరిస్ధితి ఉండదని అనిపిస్తోంది. పోలీసులు జారిపోతున్నారని, వాళ్లకో ఆయుధం ఇవ్వాలని ఇప్పుడు సోషల్ మీడియాపై చర్యలు అంటున్నారు. రెండేళ్లలో చేసిన అభివృద్ది లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు దిగుతున్నారు. చంద్రబాబుకు మానసిక రుగ్మత ఉంది కాబట్టే నీచంగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి చేసుకున్నది చెప్పుకోలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారో వివరాలతో సహా బయటపెట్టగలరా, సూపర్ సిక్స్-సూపర్ హిట్ ఎలా అయింది, ఎవరికి ఇచ్చారో చెప్పగలరా? ప్రజల కోసం బతకాల్సిన ఆర్టీసీని ఉరేస్తున్నారు. మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, ఇచ్చారా ?, ఎన్నికలకు 600 కోట్లు చందాలిచ్చిన రొయ్యల మేత దారులు రేట్లు పెంచేస్తే పట్టించుకోరు. ఆరు మాసాల్లో కేజీకి 14 రూపాయలు పెంచడం తప్పు కాదా ?, రొయ్యల మేత ధరలు 4 రూపాయలు తగ్గించమని మీరు చెప్తే వాళ్లు రెండు రోజులు ఆగి 2 రూపాయలే తగ్గించారు. అంటే వాళ్లకు కూడా మీరంటే భయం లేదు. ప్రజల ఆర్తనాదాలు, కష్టాలు మీ కేబినెట్ కు పట్టవు, ఇంకా సిగ్గు లేకుండా సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ వేస్తారంట. చట్టప్రకారం నడుచుకోమని చెప్పాల్సిన చంద్రబాబు, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోమంటున్నారు. 
    
టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీలకు మేం భయపడం 

టాస్క్ ఫోర్స్, కేబినెట్ సబ్ కమిటీల పేరుతో పోలీసులకు మళ్లీ ధైర్యం కల్పించి వైఎస్సార్సీపీ వాళ్లపై తప్పుడు కేసులు, దాడులు కొనసాగేలా చేయాలనుకుంటున్నారు. పోసాని కృష్ణమురళిని సైతం 17 కేసులు పెట్టి తిప్పారు. ఆయన ఏ పార్టీకి చెందని వాడు కాబట్టి దూరంగా ఉన్నాడు. కానీ ప్రతీ గ్రామంలో జనం వైఎస్సార్సీపీని మళ్లీ గెలిపించాలని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నారు. గ్రామాల్లో మీ తప్పులు, పాపాల్ని ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లను ఆపడం మీ పోలీసుల తరం కాదు. మీరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. సోషల్ మీడియా పేరుతో నెల రోజులు జైల్లో పెట్టగలరు అంతే. రాజకీయంగా మీ తప్పుల్ని ప్రశ్నించే మా వాళ్లు ఎవరూ హద్దు దాటరు. మీరు టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నా, చట్టాలు చేసుకున్నా భయపడేది లేదు. రావణ్ అనే వ్యక్తితో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో వీడియోలు చేశాడు. కానీ చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణల్ని మాత్రం ఎందుకు ఎప్పుడూ తిట్టలేదో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ను మాత్రం ఎందుకు విమర్శిస్తాడో చెప్పాలి. ఉపా చట్టం కింద రావణ్ ను ఎందుకు అరెస్టు చేశారో ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్ని నాని చురకలు అంటించారు.

Back to Top