మత్స్యకారుల కుటుంబాలను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా 

విశాఖ‌: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైయస్సార్సీపీ నేతలు పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పిన మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ప్రభుత్వం సహాయక చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపిస్తూ, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నంలోని ఏవీయన్ కళాశాల రోడ్డులోని జబ్బార్ తోట జంక్షన్‌లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ, జూలై 4న జరిగిన ప్రమాదానికి వారం రోజులు గడిచినా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని విమర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కూడా సంబంధిత మంత్రులు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు.

మత్స్యకారుల గాలింపు చర్యలను ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిందని, తొలి గంటల్లోనే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. సమాచారం అందిన సమయం, గాలింపు చర్యలపై అధికారులు భిన్న ప్రకటనలు చేయడం, త్రిసభ్య కమిటీ నివేదికల్లో స్పష్టత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

గతంలో వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలో మత్స్యకారుల ప్రమాదాల సమయంలో 48 గంటల్లోనే పరిహారం అందించి, సహాయక చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రకటించిన రూ.10 లక్షల పరిహారం సరిపోదని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయడంతో పాటు గల్లంతైన మత్స్యకారుల మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే వరకు గాలింపు చర్యలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

త్వరలోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖకు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలుస్తారని వైయస్సార్సీపీ నేతలు తెలిపారు.
 

Back to Top