హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించిన కూటమి ప్రభుత్వం

రైతుల భూములపై కూటమి ప్రభుత్వ దండయాత్ర

పచ్చని పంటపొలాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం దుర్మార్గం

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మనోహర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

తాడేపల్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. 

తాడేపల్లి: ఉండవల్లిలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు బుల్డోజర్లను పెట్టి సన్న, చిన్నకారు రైతుల పచ్చని పంటలను ధ్వంసం చేస్తూ, బలవంతంగా భూములను లాక్కోవడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూసేకరణ ప్రక్రియపై హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వకముందే ప్రభుత్వం వీకెండ్‌ను ఎంచుకుని పక్కా వ్యూహంతో ఈ భూకబ్జాకు పాల్పడిందని దుయ్యబట్టారు.  న్యాయస్థానాల పట్ల కనీస గౌరవం లేకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ రాక్షస చర్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, బాధిత రైతులకు పూర్తి న్యాయ సహాయం అందిస్తూ పార్టీ తరపున అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే.. 

- పోలీసు బలగాలతో రైతుల జీవనాధారంపై దండయాత్ర:

నిన్న ఉండవల్లిలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం. రైతుల పట్ల అమానుషంగా దాడి చేసి, వందల మంది పోలీసులను పెట్టి, బలవంతంగా భూములను దున్నించి, రైతుల్లో కన్నీళ్లు తెప్పించిన సంఘటనను మనం చూశాం. 2014-2019 మధ్యే ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక రైతులు తమవి మూడు పంటలు పండే జరీ భూములని ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చింది. రైతులు తమ అభ్యంతరాలు చెప్పినా కనీసం పరిగణనలోకి తీసుకోకుండా, వాటిని రిజెక్ట్ చేసి హడావిడిగా రోడ్డు వేస్తున్నారు.

నిన్న సీడ్ యాక్సెస్ రోడ్డులో జరిగింది 2 ఎకరాల 78 సెంట్ల భూసేకరణ మాత్రమే కాదు, రైతుల జీవనాధారంపై ప్రభుత్వం చేసిన దండయాత్ర. కేవలం 10, 30, 40 సెంట్లు ఉన్న సన్న చిన్నకారు రైతుల పొట్టలు కొట్టి, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా అప్పటికప్పుడు అవార్డు ప్రకటించి భూములు లాక్కున్నారు. జొన్నచేను, అరటి చెట్లు సాగులో ఉండగానే బుల్డోజర్లు పెట్టి ధ్వంసం చేస్తుంటే రైతుల ఆర్తనాదాలు భయంకరంగా ఉన్నాయి. కనీసం రైతులకు ముందుగా పూర్తి వివరాలు చెప్పలేదు, అవార్డు కాపీలు ఇవ్వలేదు, ఏ భూమి ఎంత ధరకు నిర్ణయించారో తెలపలేదు. రైతులు కోర్టును ఆశ్రయిస్తారనే భయంతో, వర్కింగ్ డేస్‌లో కాకుండా పక్కా వ్యూహంతో వీకెండ్‌ను ఎంచుకుని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇది చట్టబద్ధమైన భూసేకరణా లేక వీకెండ్ చూసుకుని కూటమి ప్రభుత్వం చేసిన భూకబ్జానా?"

- కోర్టుల పట్ల గౌరవం ఉందా? ఇది కోర్టు ధిక్కారం కాదా?:

ఈ భూసేకరణకు సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. జనవరి 8న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్, జూన్ 3న ఇచ్చిన నోటిఫికేషన్, జూన్ 6 నాటి అవార్డు విచారణ నోటీసులను రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం ముందస్తు సర్వే జరగలేదని, మార్కెట్ విలువను సవరించలేదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ (పునరావాస చర్యలు) చేపట్టలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఈ భూసేకరణకు క్లీన్ చీట్ ఇవ్వలేదు. 'ప్రభుత్వం ప్రకటించే అవార్డు ఈ రిట్ పిటిషన్ తుది ఫలితానికి లోబడి ఉంటుంది' అని స్పష్టం చేస్తూ, కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం ఇచ్చి కేసును జూలై 31 (31/07/2026)కి వాయిదా వేసింది.

కోర్టు స్పష్టం చేసినా కూడా ప్రభుత్వానికి ఎందుకు అంత తొందర వచ్చింది? జూలై 31 వరకు ఆగలేరా? వివాదాస్పద న్యాయ అంశాలు ఇమిడి ఉన్నాయని హైకోర్టు అంటుంటే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పోలీసులతో తొక్కించి పని కానిస్తోంది. న్యాయ ప్రక్రియ పట్ల, కోర్టుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమైనా గౌరవం ఉందా? లేక ఇది కోర్టు ధిక్కారం కాదా? అని నేను ప్రశ్నిస్తున్నాను. హైకోర్టులో కేసు తేలకముందే, కౌంటర్ కూడా దాఖలు చేయకుండా బుల్డోజర్లను ఎందుకు దించారో సమాధానం చెప్పాలి. తుది తీర్పు వచ్చేలోపల రైతులను ఖాళీ చేయించారు. రైతులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలి, కానీ ఇలా బెదిరించి లాక్కుంటారా?"

- టీడీపీ నేతలకు ఒక విలువ.. రైతులకు ఒక విలువా?: 

అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే ఇక్కడ ఎకరా భూమి విలువ రూ. 5 కోట్ల రూపాయలు. రాజధాని అయ్యాక అది రూ. 8 కోట్లకు పైగా ఉందని రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉన్న భూములను సగటున కేవలం రూ. 2.60 కోట్లకే లాక్కుంటున్నారు. చంద్రబాబు బినామీలు, టీడీపీ నేతలు ఆ చుట్టుపక్కలే రూ. 8 కోట్ల చొప్పున కొన్నారు, మరి రైతులకు ఆ విధంగా పరిహారం ఎందుకు ఇవ్వటం లేదు? టీడీపీ నేతలు కొనేటప్పుడు ఒక మార్కెట్ విలువ.. రైతుల నుంచి లాక్కునేటప్పుడు మరో మార్కెట్ విలువా? ఎక్కడైనా ఉంటుందా?

రైతుల నుంచి కనీసం బ్యాంకు వివరాలు కూడా తీసుకోకముందే వాళ్ల పేర్లతో చెక్కులు ఎలా సిద్ధమయ్యాయో సమాధానం చెప్పాలి. రైతుల నుండి భూములు లాక్కుని భవిష్యత్తులో ఈ భూములను 'రివర్ ఫ్రంట్' పేరుతో వాణిజ్య ప్రాజెక్టుల కోసం అస్మదీయులకు, ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టబోతున్నారా? మిగిలిన చిన్న చిన్న భూభాగాలకు రహదారి, నీటి సదుపాయం ఉంటుందో లేదో సిఆర్డిఏ సమాధానం చెప్పడం లేదు. ఫ్లై ఓవర్ల ప్రాజెక్టు పేరుతో ఉండవల్లి గ్రామమే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, రాజధానిలోనే రైతులను పరాయీకరణ చేస్తూ ఉండవల్లి రైతులను తీవ్రంగా క్షోభ పెట్టారు. 

- తక్షణమే పనులు నిలిపివేయాలి...

ఈ ఉండవల్లిలో రైతుల భూములపై జరుగుతున్న అన్ని బలవంతపు చర్యలను, బలవంతపు భూసేకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయడంతో పాటు.. హైకోర్టు కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు రైతుల భూముల్లో భౌతికంగా ఎలాంటి మార్పులు చేయరాదని తేల్చి చెప్పారు. మరోవైపు ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం ఇవ్వడంతో పాటు, పంటలను ధ్వంసం చేయించిన, రైతులపై దౌర్జన్యాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మనోహర్ రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, వారి కుటుంబాలు, వారి బినామీలు కొనుగోలు చేసిన భూముల వివరాలన్నింటినీ ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలన్నారు.  రైతుల ఆస్తులను కాపాడటానికి మరియు వారికి న్యాయం చేకూర్చడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరపున న్యాయపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు .

Back to Top