ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు లంచాల రోగం 

మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఫైర్ 

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు 

లంచం ముట్ట‌జెబితేనే స్ట్రెచ‌ర్‌, వీల్‌చైర్ దొరికేది

ర‌క్త ప‌రీక్ష‌లు, డ‌యాల‌సిస్ టెస్టులు అన్నీ లంచాల మీద‌నే

మార్చురీ నుంచి శ‌వం బ‌య‌ట‌కు రావాల‌న్నా లంచ‌మే

లంచం ఇవ్వ‌నిదే మ‌హాప్ర‌స్థానం వాహ‌నం టైర్ క‌ద‌ల‌దు

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల దుస్థితిని ఎండ‌గ‌ట్టిన మ‌ల్లాది విష్ణు  

కూట‌మి పాల‌న‌లో వైద్యారోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యం

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మందుల్లేవు, ఇంజెక్ష‌న్లు లేవు

ఎక్క‌డ చూసినా మూల‌న‌ప‌డ్డ 108 వాహ‌నాలు 

వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ రాజీనామా చేయాలి

మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు డిమాండ్ 

తాడేప‌ల్లి: కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు లంచాల రోగం ప‌ట్టుకుందని, ఆస్ప‌త్రిలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా లంచం ఇవ్వ‌నిదే ప‌ని జ‌ర‌గ‌డం లేద‌ని మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పేద‌ల‌ను లంచాల కోసం పీక్కుతింటున్నా ప‌ట్టించుకోని వైద్యారోగ్య శాఖ మంత్రి త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే ప్ర‌భుత్వ‌మే ఆయ‌న్ను త‌ప్పించాల‌న్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యారోగ్య రంగం పూర్తిగా పడకేసిందని, రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగడుగునా లంచాల దందా సాగుతోంద‌ని, ఉచిత వైద్యం అందక‌పోగా వీల్ చైర్లు, స్ట్రెచర్లు, డయాలసిస్ సేవలు, ఆఖ‌రుకి మార్చురీ నుంచి శవం బయట‌కు రావాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొందని మండిపడ్డారు. ఆసుపత్రుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, రోగుల అవ‌య‌వాలు కుక్క నోటితో ప‌ట్టుకుని కి చిక్కిన  ఆసుపత్రి ఆవరణలో తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, విశాఖపట్నం, నెల్లూరు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంట్ లేక రోగుల ప్రాణాలు కోల్పోయిన ఘోరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయని ధ్వజమెత్తారు. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం కూటమి ఎమ్మెల్యేల నుంచి ఎల్వోసీలు తేవాలంటున్నారని, ఆ ఎల్వోసీల్లో వాటాలు ఇస్తేనే ఎమ్మెల్యేలు సంతకాలు పెడుతున్నారని సంచలన ఆరోపణ చేశారు. స‌రైన స‌మ‌యంలో 108 వాహ‌నాలు రాక‌పోవ‌డంతో బాధితులు 
ప్రాణాలు కోల్పోతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేవలం ఆర్‌ఎమ్‌ఓ ని సరెండర్ చేయడం, కలెక్టర్ వచ్చి ఒకరోజు హడావుడి చేయడం వల్ల వ్యవస్థ మారదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సౌకర్యాలు, మందులు కల్పించడంతో పాటు సిబ్బందిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని మ‌ల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... 

వైద్యారోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యం

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో స‌రైన వైద్యం అంద‌క రోగులు నానా అవస్థ‌లు ప‌డుతున్న వార్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూల‌న వింటూనే ఉన్నాం. ఆస్ప‌త్రుల్లో వ‌స‌తులు లేక‌, వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం, ఆధునిక వైద్య స‌దుపాయాలు క‌ల్పించ‌కపోవ‌డంతో అనారోగ్యంతో వ‌చ్చిన‌ రోగులు చుక్క‌లు చూస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకుందామ‌ని ఎవ‌రైనా ఆస్ప‌త్రుల‌కొస్తారు. కానీ ఇక్క‌డ మాత్రం ఆస్ప‌త్రుల్లో చేరిన త‌ర్వాత ప్రాణాలు దైవాధీనం అన్న‌ట్టు త‌యారైంది ప‌రిస్థితి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఉచితంగా వైద్యం అందుతుంద‌నే ధీమా ఇప్పుడు కనిపించ‌డం లేదు. లంచం ఇస్తే త‌ప్ప రోగిని ప‌ట్టించుకోని ప‌రిస్థితి.  

ఆస్ప‌త్రుల్లో ప్ర‌తిదానికీ లంచ‌మే 

తిరువూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఒక రోగి కిడ్నీ సంబంధిత వ్యాధితో విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరితే అక్క‌డ స‌రైన వైద్యం అంద‌క, వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా అత‌డు చనిపోయాడు. దీనిపై రోగి బంధువులు సిబ్బందిని ప్ర‌శ్నిస్తే, మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌మంటార‌ని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఆస్పత్రిలో చనిపోయిన రోగి మృత‌దేహాన్ని పైనుంచి కిందికి తీసుకురావ‌డానికి రూ. 600లు ఇస్తేకానీ ఒప్పుకోలేద‌ని రోగి బంధువులు హృద‌య‌విదార‌కంగా విల‌పిస్తున్నారు. అక్క‌డి నుంచి మృత‌దేహాన్ని త‌మ గ్రామానికి త‌ర‌లించ‌డానికి మ‌ర్నాడు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కూడా వాహ‌నం అందుబాటులో లేద‌ని చెప్పి మ‌రింత క్షోభ‌కు గురిచేశారు. దీంతో చేసేది లేక రూ. 5500 చెల్లించి ప్రైవేట్ అంబులెన్స్‌లో మృత‌దేహాన్ని త‌ర‌లించారు. చ‌నిపోయిన త‌ర్వాత కూడా డ‌బ్బుల కోసం రోగుల బంధువుల‌ను వేధించుకు తింటున్నారు. మ‌హాప్ర‌స్థానం వాహ‌నాలు కూడా అందుబాటులో ఉంచ‌డం లేదు. ఆస్ప‌త్రుల్లో అడుగ‌డుగునా లంచాల కోసం పీక్కు తింటున్నారు. ఆఖ‌రుకి రోగులు శ‌వ‌మైనా వ‌ద‌ల‌డం లేదు. వీల్ చైర్లు అందుబాటులో ఉండ‌టం లేదు. ఆస్ప‌త్రులు రోగులు అడ్మిట్ అయితే టెస్టుల కోసం తీసుకెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు వీల్ చైర్లు, స్ర్టెచ‌ర్లు దొరక‌డం లేదు. లంచం ఇస్తే త‌ప్ప ఇవ్వడం లేదు. మార్చురీలోని శ‌వం పోస్టుమార్టం పూర్తి చేసుకుని త్వ‌రిత‌గ‌తిన బ‌య‌ట‌కు రావాల‌న్నా లంచం. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు నిత్యం పేద‌లే వ‌స్తార‌ని తెలిసిన ప్ర‌భుత్వం కూడా లంచగొండి రోగానికి చికిత్స చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి ఆస్ప‌త్రుల్లో దోపిడీ గురించి నిత్యం పేప‌ర్ల‌లో వార్త‌లొస్తున్నా ఈ ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్టు కూడా ఉండ‌టం లేదు. ఇంకోప‌క్క  ర‌క్త ప‌రీక్ష‌లు, ఈసీజీలు, స్కానింగ్‌లు చేయించుకోవాలంటే రోజుల త‌రబ‌డి ఎదురు చూడాల్సిన దుస్థితి. ఎప్పుడు చూసినా యంత్రాలు ప‌నిచేయ‌డం లేద‌ని, సిబ్బంది అందుబాటులో లేరని చెప్పి రోగుల‌ను వెయిట్ చేయిస్తున్నారు.

క‌లెక్ట‌ర్ హ‌డావుడి ఒక్క‌రోజే

రోజుకు 3 వేల మంది రోగులు వ‌చ్చే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులన్నీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక స‌మ‌స్య‌ల సుడిగుండంలో చిక్కుకుని రోగుల‌ను నానా అవ‌స్థ‌ల‌కు గురిచేస్తున్నాయి. రోగుల అవ‌య‌వాలు కుక్క నోటికి చిక్కి ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో తిరుగుతున్న దుస్థితి. ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి స‌త్య‌కుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌డం లేదు. ఆర్ఎంఓని స‌రెండ‌ర్ చేసినంత మాత్రాన ఆస్ప‌త్రిలో ప్ర‌క్షాళ‌న జ‌రిగిపోయిన‌ట్టేనా?  క‌లెక్ట‌ర్‌ని పంపించి ఒక‌రోజు హ‌డావుడి చేయించినంత మాత్రాన ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చేసిన‌ట్టేనా?  నిత్యం రోగులకు అందాల్సిన స‌దుపాయాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ ఏదీ?  కుక్క‌, పాము కరించింద‌ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వెళితే ఇంజెక్ష‌న్లు ఉండ‌వు. కిడ్నీ, క్యాన్స‌ర్ పేషెంట్ల క‌ష్టాలు ప‌ట్టించుకునే దిక్కుండ‌దు. డ‌యాల‌సిస్ చేయించుకోవాలంటే ముడుపులు స‌మ‌ర్పించుకోవాల్సిందే. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో క‌నీస మందులు కూడా ఉంచ‌లేని దౌర్భాగ్య స్తితికి ప్ర‌భుత్వం దిగ‌జారింది. వైద్యులు రాసిచ్చిన మందులు బ‌య‌ట షాపుల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కరెంట్ లేక రోగులు చ‌నిపోయ‌న ఘ‌ట‌న‌లు అనంత‌పురం, విశాఖ, నెల్లూరు, కాకినాడ‌ ఆస్ప‌త్రుల్లో చోటుచేసుకున్నాయి. వైద్యారోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. రెండేళ్లుగా మంత్రి నిద్ర‌పోతున్నాడు. 

మూల‌న‌ప‌డ్డ 108 వాహ‌నాలు

ఒక‌ప్పుడు ప్రాణాలు నిలిపే సంజీవ‌ణిలా ప‌నిచేసిన 108, 104 వాహ‌నాలు, ఇప్పుడు మూల‌న‌ప‌డి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. రెండు మూడు మండ‌లాల‌కు ఒక 108 వాహ‌నాన్ని కేటాయించారు. శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన ఒక వ్య‌క్తి స‌రైన టైంకి 108 వాహ‌నం రాక చ‌నిపోయాడు. ప‌ల్నాడు జిల్లా న‌కిరేక‌ల్ లో అబ్బూరి శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి చ‌నిపోయాడు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికెళితే 108 వాహ‌నాలు మూల‌న పడి కనిపిస్తాయి. పేద‌వాడికి కార్పొరేట్ వైద్యం అందించిన‌ ఆరోగ్య‌శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆరోగ్య‌శ్రీలో వైద్యం చేయించుకోవాల‌ని ప్రైవేట్ ఆస్ప‌త్రికి వెళితే కూట‌మి ఎమ్మెల్యేల నుంచి ఎల్‌వోసీలు తీసుకురావాల‌ని చెబుతున్నారు. వ‌చ్చిన ఎల్‌వోసీలో వారికి వాటా ఇస్తేకానీ ఎమ్మెల్యేలు సంత‌కాలు పెట్ట‌డం లేదు. అడుగ‌డుగునా లంచాల జ‌బ్బు చేస్తే పేద‌వాడు బ‌తికేదెలా? 
వైఎస్ జ‌గ‌న్ గారికి మంచి పేరొస్తుంద‌ని ఉద్దేశ‌పూర్వ‌కంగానే 108, ఆరోగ్య‌శ్రీని ఈ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసి పేద‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోఒక స‌బ్ క‌లెక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిత్యం రోగుల‌కు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేలా చూడ‌టం జ‌రిగింది. విజ‌య‌వాడ జీజీహెచ్‌కి కొత్త ఎమ‌ర్జన్సీ బ్లాకును అందుబాటులోకి తీసుకురావ‌డం జ‌రిగింది. పేద ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాల‌నే సంక‌ల్పంతో నాడు-నేడుతో మెడిక‌ల్ కాలేజీలు, ఆస్ప‌త్రుల‌ను నిర్మిస్తే చంద్ర‌బాబు వాటిని మూల‌న ప‌డేశాడు. విజ‌యవాడ ఆస్ప‌త్రిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌కు ప్ర‌భుత్వమే బాధ్య‌త వ‌హించాలి. ఏ ఆస్ప‌త్రి చూసినా నిర్ల‌క్ష్యాల పుట్టలుగా మారిపోయింది. దీనికి కార‌ణ‌మైన వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ వెంట‌నే రాజీనామా చేయాలి. లేదంటే ప్ర‌భుత్వ‌మే ఆయ‌న్ను తొల‌గించాలి. ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో అన్ని వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతోపాటు సిబ్బందిని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాలని మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

Back to Top