ల్యాప్‌టాప్ టెండర్లలో భారీ కుంభకోణం

వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్ వింగ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. ర‌విచంద్ర ధ్వ‌జం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టూడెంట్ వింగ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. ర‌విచంద్ర‌

రాష్ట్ర విద్యాశాఖలో రూ. 112 కోట్ల అవినీతి  

ఒక్కో ల్యాప్ టాప్‌పై రూ. 40 వేలు దోపిడీకి స్కెచ్‌

కాంట్రాక్టు కంపెనీల కోసం నిబంధ‌న‌లు స‌డ‌లింపు

కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు తిలోద‌కాలు 

టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసి, ల్యాప్ టాప్ కొనుగోళ్లు ఆపేయాలి

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ర‌విచంద్ర  

తాడేప‌ల్లి: ల్యాప్‌టాప్ టెండర్ల పేరుతో రాష్ట్ర విద్యాశాఖ రూ. 112 కోట్ల భారీ అవినీతికి తెరలేపిందని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. ర‌విచంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ల‌కు 27,672 ల్యాప్‌టాప్‌ల సేకరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. శాన్‌బే 70 శాతం, సెల్‌కాన్‌కు 30 శాతం ల్యాప్‌టాప్‌లు సరఫరా చేసేలా ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌ను క‌ట్ట‌బెట్టింద‌ని, చంద్రబాబు సర్కారు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, నిబంధనలను తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. బ‌హిరంగ మార్కెట్‌లో రూ. 45 వేల నుంచి రూ.50 వేలకు దొరికే ల్యాప్‌టాప్‌ను ఏకంగా రూ. 89 వేల‌కు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఒక్కో ల్యాప్‌టాప్ మీద ఏకంగా రూ. 40 వేల వ‌ర‌కు అద‌నంగా చెలిస్తున్నారని ఆరోపించారు. 

- నిబంధనలు సడలించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లబ్ధి 

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం) ద్వారా జరిగిన టెండర్లను ఉదహరిస్తూ కూటమి ప్రభుత్వ అవినీతిని ఆయన బట్టబయలు చేశారు. ఇంచుమించుగా ఇవే స్పెసిఫికేష‌న్ గ‌ల ల్యాప్‌టాప్ ల‌ను అస్సాం విద్యాశాఖ రూ. 38,501ల‌కు కొనుగోలు చేసింద‌ని ఆయ‌న వివ‌రించారు. కానీ రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వం రూ. 89 వేలు ఎందుకు చెల్లిస్తున్నారో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం వెనుక కేంద్ర ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. "కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశీయంగా ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి చేసే మేక్ ఇన్ ఇండియా సంస్థలకే ఈ టెండర్లు దక్కాలి. కానీ, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ టెండర్ నోటీసులో నిబంధనలను ఇష్టారాజ్యంగా సవరించారు. తయారీ సంస్థల వివరాలు చూపాల్సిన అవసరం లేదని, కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని నిబంధనలను సడలించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చార"ని మండిపడ్డారు. ఈ ల్యాప్‌టాప్ టెండర్ల గోల్‌మాల్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, అధికారులకు అందిన వాటాలెంత? అని నిలదీశారు. ల్యాప్‌టాప్‌ల టెండర్ల ప్రక్రియలో జరిగిన అవినీతిపై కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ అవినీతి టెండర్లను నిలిపివేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, లేనిపక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని ర‌విచంద్ర హెచ్చరించారు.

Back to Top