చంద్రబాబు కేబినెట్ మీటింగులు ప్రజా సంక్షేమం కోసం కాదు...

బినామీల భూపందేరం కోసమే

మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ధ్వజం

విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ పశ్చిమ గోదావరి 
జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్

విశాఖలో భారతదేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్

అమరావతిలో రియల్ ఎస్టేట్ స్కామ్

విశాఖలో రూ. 30 వేల కోట్ల మహా భూ దోపిడీ

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అమర్నాధ్ ధ్వజం

ఎండాడలో రూ. 600 కోట్ల భూ కుంభకోణం.

మధురవాడలో రూ.2000 కోట్ల భూములపై బాబు బినామీల కన్ను 

విశాఖ భూములు మీ తాత సంపాదా లోకేష్?.

సూటిగా నిలదీసిన మాజీ మంత్రి అమర్నాధ్

99 పైసలు, రూపాయికే వేల కోట్ల ఖరీదైన భూములు సంతర్పణ.

లక్షలాది ఉద్యోగాలొస్తాయని భారీ ప్రచారం

ఉద్యోగ, ఉపాధి కల్పనపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

కూటమి మాజీ మంత్రిపై విచారణ జరపాలి!

కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు.

సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అంతా ఒక డ్రామా

ప్రజలను దోచుకుంటూ బినామీలకు కట్టబెట్టడుతున్న సర్కారు 

ఇదేనా చంద్రబాబు చెప్తున్న 'సంపద సృష్టి'?

కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అమర్నాధ్.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగే కేబినెట్ సమావేశాలు ప్రజా సక్షేమం కోసం కాకుండా, కేవలం తమ బినామీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టడానికే పరిమితమయ్యాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ విశాఖపట్నాన్ని దేశంలోనే ప్రముఖ నగరంగా తీర్చిదిద్ది భవిష్యత్తుగా మారిస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ నగరంపై కళ్ళు పడ్డాయని మండిపడ్డారు. గడిచిన రెండేళ్లలో విశాఖలో రూ. 25 వేల కోట్ల నుండి రూ. 30 వేల కోట్ల మేర మహా భూ కుంభకోణం జరిగిందని, ఇది దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ అని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఈ భూ దోపిడీని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతూ, సోషల్ మీడియా నియంత్రణ పేరుతో టాస్క్ ఫోర్స్ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

- కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంపై బాధ్యత లేదు..

ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతినెలా మంత్రిమండలి సమావేశాలు జరగడం సహజం. ఆ సమావేశం జరిగిన ప్రతిసారి పేదలకు మేలు చేసే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత ప్రతి కేబినెట్ సమావేశంలోనూ 30-40 అజెండా అంశాలుంటే... అందులో దాదాపు 30కు పైగా అంశాలు వారికి కావాల్సిన వ్యక్తులకు భూకేటాయింపుల కోసమే ఉంటున్నాయి. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో 35 అంశాలు ఉంటే అందులో 25కు పైగా అంశాలు భూకేటాయింపుల కోసమే ఆమోదించారు. తొలిసారిగా ఒక కేబినెట్ మీటింగ్‌లో 5 గురు మంత్రులు హాజరు కాకపోవడం చూస్తున్నాం. దీన్ని బట్టే కేబినెట్ సమావేశాల మీద వీరికి ఏ రకమైన ఉద్దేశం ఉందో, రాష్ట్రం మీద ఎంత బాధ్యత ఉందో అర్ధం అవుతుంది.

- రూ. 30 వేల కోట్ల మహా భూ స్కామ్..

ఒక పక్క అమరావతిలో రియల్ ఎస్టేట్ స్కామ్, ఇక్కడ విశాఖపట్నంలో భూముల దోపిడి జరుగుతోంది. అమరావతి అనేది భారతదేశ చరిత్రలో ఒక బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ స్కామ్ అయితే, విశాఖపట్నంలో గడిచిన రెండున్నర సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన భూముల కేటాయింపు అంతకంటే బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. గీతం భూముల దగ్గర నుంచి ఉర్సా లాంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు, సత్వా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు, కపిల్ లాంటి గ్రూపులకు తనకు కావాల్సిన బినామీలకి కేవలం 99 పైసలకే భూములు కేటాయించారు. ఈ రకంగా గడిచిన రెండేళ్లలో భూ కేటాయింపుల ద్వారా దాదాపు పాతిక వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి.

- మధురవాడలో రూ. 2000 కోట్ల విలువైన భూమి బదలాయింపు..

నిన్న కేబినెట్‌లో 22-A లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) కి బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మధురవాడలో ఉన్న ఈ 9.39 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ. 1500 కోట్ల నుండి రూ. 2000 కోట్లు ఉంటుంది. ఎకరం కనీసం రూ. 100 కోట్ల పైమాటే. దీని అఫీషియల్ సబ్ రిజిస్టర్ వాల్యూ రూ. 190 కోట్లుగా బుక్స్ మీద చూపించి రెవెన్యూ నుంచి టూరిజం డిపార్ట్‌మెంట్‌కు మార్చారు. ఇదంతా మొదటి ప్రక్రియ మాత్రమే. రేపు ఈ భూమిని చంద్రబాబు నాయుడు గారు తనకు ఎన్నికల్లో సాయం చేసిన వారికో, బినామీలకో హోటల్ అనో, కన్వెన్షన్ సెంటర్ అనో చెప్పి కట్టబెట్టే కార్యక్రమం చేస్తారు.

- ఇదేమన్నా లోకేష్ తాత సంపాదించిన ఆస్తా? ధైర్యముంటే శ్వేతపత్రం ఇవ్వండి.

కారు చౌకగా వేల కోట్ల రూపాయల భూముల్ని రూపాయికి, 99 పైసలకి కట్టబెడుతుంటే... అవసరమైతే మొత్తం రూపాయికే ఇస్తాం, నీకేం ప్రాబ్లం అని ముఖ్యమంత్రి కొడుకు అడుగుతున్నాడు. వైయస్సార్సీపీ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నాం.. విశాఖపట్నం భూములు ఏమైనా మీ తాత సంపాదించిన ఆస్తా?  రెండున్నర సంవత్సరాలలో దాదాపు లక్ష మందికి ఉపాధి కలుగుతుందని ఎస్ఐపీబీ మీటింగుల ద్వారా, మీ గెజిట్ పత్రికల ద్వారా సమాచారం ఇచ్చారు. మరి ఇంతవరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి.

- బూడిద మిగుల్చుతున్న బూడిద పార్టీ...

భూములేమో మీ బినామీలు సొంతం చేసుకుంటున్నారు, తీరా విశాఖపట్నానికి మిగిలింది బూడిద మాత్రమే. చంద్రబాబు చెప్తున్న 'సంపద సృష్టి' అంటే రాష్ట్రం కోసం కాదు, ఆయన బినామీల కోసం అని ప్రజలకు అర్ధమైపోయింది. విశాఖపట్నంలో  మీ కుమారుడు తోడల్లుడు, ఎంపీ భరత్ ఏకంగా రూ. 5000 కోట్ల విలువైన 55 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారు. వైయస్సార్సీపీ ప్రశ్నిస్తే ఆ భూమి విలువ రూ. 1200 కోట్లే అని సమర్ధించుకుంటున్నారు. ప్రభుత్వ భూమి కనీసం సెంట్ కూడా ముట్టుకోకూడదనే కనీస జ్ఞానం ప్రజా ప్రతినిధులకు లేదా?

- రూ.600 కోట్ల ఎండాడ భూ కుంభకోణంపై విచారణ జరగాలి..

ఎండాడలో దాదాపు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక మాజీ మంత్రి ప్రైవేట్ భూమిగా బదలాయింపు చేశాడని, దాని విలువ రూ. 600 నుండి రూ. 700 కోట్లు అని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎందుకు మాట్లాడటం లేదు? జిల్లాలో చాలా మంది మాజీ మంత్రులం ఉన్నాం. ప్రజల్లో ఉన్న అనుమానాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. ఇంత పెద్ద ఇష్యూ జరిగితే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎందుకు రిజాయిండర్ ఇవ్వరు? గతంలో 2014-19 మధ్యలో కూడా టిడిపి హయాంలో రెవెన్యూ రికార్డుల టాంపరింగ్ జరిగితే.. హుద్‌హుద్ తుఫాన్ వచ్చి ఫైల్స్ కొట్టుకుపోయాయని చెప్పారు. రేపు ఈ స్కామ్‌లపై ప్రశ్నిస్తే ఎలుకలు కొరికేశాయనో, చంద్రబాబు పట్టుకుపోయారనో చెప్తారా? భీమిలి గీతం ల్యాండ్ స్కామ్, ఎండాడ భూ కుంభకోణంపై తక్షణమే విచారణ జరగాలి."

- సూసైడ్ చేసుకునే వరకు వదలని సైకో సోషల్ మీడియా మీది..

కేబినెట్‌లో ప్రజా సమస్యలు, ఎన్నికల్లో మీరిచ్చిన హామీలు మహిళలకు రూ. 1500, నిరుద్యోగులకు రూ. 3000 నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్ల వంటి వాటి మీద చర్చలు లేవు. కేవలం సోషల్ మీడియాని ఎలా అరికట్టాలనే దానిపై డీజీపీతో ప్రెజెంటేషన్ ఇప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఉదయం లేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవాలి, ఏబీఎన్, టీవీ5, ఈటీవీ మాత్రమే చూడాలి... అవి చెప్పిందే నిజమని నమ్మాలనేది చంద్రబాబు విధానం. దాన్ని ప్రశ్నించే సామాన్యుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారు. ఒకవేళ రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ పెడితే, అది మొదట తెలుగుదేశం పార్టీ నడుపుతున్న సైకో సోషల్ మీడియా విభాగానికే వర్తిస్తుంది.

- మీ సోషల్ మీడియా కర్కశత్వానికి సాక్ష్యాలివిగో...

వైయస్సార్సీపీ సోషల్ మీడియా కేవలం రాజకీయంగానే ప్రశ్నిస్తుంది తప్ప ఎన్నడూ మహిళల జోలికి పోలేదు. కానీ టిడిపి సోషల్ మీడియా మా ఇంట్లో మహిళలను, వైయస్. జగన్ గారి భార్య, తల్లి, చెల్లిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. బెండపూడి హైస్కూల్లో ఇంగ్లీష్‌ మీడియం చదివి ప్రతిభ చాటిన 14 ఏళ్ల చిన్న పాప మేఘనపై సోషల్ మీడియా దాడి చేశారు. సొంత ఇల్లు లేని పేద కుటుంబానికి చెందిన గీతాంజలి అనే అమ్మాయికి జగన్ గారు ఇళ్ల పట్టా ఇస్తే, ఆ సంతోషంలో మాట్లాడినందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత వరకు వేధించిన హిస్టరీ చంద్రబాబు వెనక ఉన్న సోషల్ మీడియాది. సుగాలి ప్రీతి తల్లి న్యాయం కోసం రోడ్డు ఎక్కితే దివ్యాంగురాలైన ఆ తల్లిని వేధిస్తున్నారు. తులసి చందు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్‌పై హేయంగా దాడులు చేస్తున్నారు. మీ అవినీతిని, భూదోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఈ టాస్క్ ఫోర్స్ డ్రామాలు.

ఈ నేపధ్యంలో రాష్ట్ర సంపదను చంద్రబాబు నాయుడు తన బినామీలకు దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ హెచ్చరించారు. ఈ భూపందేరంపై, వైఫల్యాలపై ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటును తట్టుకోలేకనే ప్రభుత్వం సోషల్ మీడియాపై అక్రమ బనాయింపుల డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. భీమిలి గీతం ల్యాండ్ స్కామ్, ఎండాడ రూ. 600 కోట్ల భూ కుంభకోణంపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి డైవర్ట్ చేయాలని చూసినా, ప్రశ్నించే ప్రతి పౌరుడికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని, మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Back to Top