తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైయస్సార్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ పీఆర్సీ, ఐఆర్, డీఏలు, పెన్షన్ ప్రయోజనాలు, బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని ఆరోపిస్తూ, ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో చంద్రశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే.. - 25 నెలల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఎన్నికల ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం కల్పిస్తామని చెప్పి, నేడు వారే రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. సీపీఎస్, జీపీఎస్, పీఆర్సీ, ఐఆర్ వంటి కీలక అంశాలపై రెండేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఉద్యోగ వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. - ఒక్కో ఉద్యోగికి రూ.5–10 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏలు, పీఆర్సీ అరియర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ బకాయిలు ఏవీ సకాలంలో చెల్లించడం లేదు. ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. హెల్త్ కార్డుల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని బకాయిలు చెల్లించి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. - ప్రైవేటీకరణతో ఉద్యోగ భద్రతకు ముప్పు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు భరోసా కల్పించిన గత ప్రభుత్వ విధానాన్ని ఇప్పుడు తిరగరాస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ వేలాది మంది ఉద్యోగుల భద్రతకు ముప్పు తెస్తున్నారు. ఆర్టీసీతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి బకాయిలు చెల్లించాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రజలతో కలిసి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని నలమరు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.