డబ్లిన్‌లో ఘనంగా మహానేత డాక్టర్  వైయ‌స్ఆర్‌ 77వ జయంతి వేడుకలు 

 వైయ‌స్ఆర్‌ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు

 ఐర్లాండ్‌లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ నేతల సంకల్పం 

తాడేప‌ల్లి: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన నాయకులు, ఆయన సంక్షేమ పాలన, ప్రజాసేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయ‌స్ఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

డబ్లిన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షుడు ఆలూరి సాంబశివ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ వైయ‌స్ఆర్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు. అలాగే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని సభికులకు చేరవేస్తూ, పార్టీ సిద్ధాంతాలు, వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రవాస భారతీయులు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఐర్లాండ్ కన్వీనర్ కిషోర్ ఆకేపాటి మాట్లాడుతూ, ఐర్లాండ్‌లో పార్టీని మరింత బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ వేడుకల్లో ఐర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వైయ‌స్ఆర్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, ఐటీ మరియు ఇతర రంగాలకు చెందిన ప్రవాస తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్, మహానేత జీవిత విశేషాలను ప్రతిబింబించే ప్రత్యేక ఆడియో–విజువల్ ప్రదర్శన, నాయకుల ప్రసంగాలు, విందుతో వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
 

Back to Top